భారతీయ సంస్కృతి ఒక వైజ్ఞానిక సంస్కృతి. ఈ ఆర్యవర్త పర్వములన్నీ వైజ్ఞానిక-సాంస్కృతిక ,చారిత్రాత్మక మరియు సామాజిక విలువలతో సంపన్నమైనవి. శ్రావణ పౌర్ణమి నాడు ద్విజులు అందరూ యజ్ఞోపవీత ధారణ చేస్తారు. ద్విజులు అనగా ఎవరైతే గురువు వద్ద జ్ఞాన జన్మ (ద్వి జన్మ) పొందినారో వారు.
ఈ పర్వము చాలా సనాతనమైనది. మహత్వ పూర్ణమైనది.ఈ పర్వం యొక్క ఆధారము స్వాధ్యాయము.అందులకే దీనిని స్వాధ్యాయ పర్వము అని కూడా అంటారు.
ప్రాచీన కాలంలో ఈ దేశము వ్యవసాయ ప్రధానమైన దేశము.వర్షాకాలం లో శ్రావణమాసం వరకు వ్యవసాయం చేసే కర్షకులు దున్నుకోవడం ,విత్తుకోవడం చేసేవారు. వ్యాపారస్తులకు కూడా వర్షాల మూలాన రవాణా సౌకర్యం అనుకూలంగా ఉండేది కాదు.అందుకే వ్యాపారస్తులకు కూడా అంతగా పని ఉండేది కాదు.దానితో ఇతర వర్ణాల వారికి కూడా జీవనోపాధికి సంబంధించిన కర్తవ్యవిశేష కర్మలు ఏమి ఉండేవి కావు. అరణ్యాలలో తపస్సు చేసుకునే మహాత్ములకు కూడా వాతావరణం అనుకూలంగా ఉండేది కాదు.
కావున అన్ని శ్రేష్ట కర్మలకు ఆధారమైన ఈ సమయాన్ని స్వాధ్యాయానికి ఉపయోగించుకునేవారని శాస్త్రం కూడా అంటుంది.
. ” ఏహా వైకేచ శ్రమాః ఇమే ద్వావా పృథివీ అంతరేణ”
స్వాధ్యాయో హైవతేషాం పరమథాకాష్టా””
మనుస్మృతిలో ఉపాకర్మ మరియు ఉత్సర్జన కార్యక్రము కొరకు ఈ విధంగా ఆదేశించబడినది.
“శ్రావణ్యాం స్రౌష్ఠపద్యాo వాప్యుపాకృత్య యధావిధి
యుక్తశ్చ౦ధాన్యధీయితా మాసాన్ విప్రోర్థ పంచమాన్
పుష్యే తు ఛందసాం కుర్యాద్బహిరుత్సర్జనం ద్విజః
మాఘ శుక్లస్య వా ప్రాప్తే పూర్వాహ్ణే ప్రథమే హాని””
బ్రాహ్మణాదులు శ్రావణము లేక భాద్రపద పూర్ణము నాడు ఉపాకర్మ చేసి నాలుగున్నర మాసములు శ్రద్ధతో, భక్తితో వేదాధ్యయనం చేయాలి. పుష్య నక్షత్రము యొక్క పూర్ణిమ నాడు వేద స్వాధ్యాయము యొక్క ఉత్సర్జన కార్యక్రమము గ్రామము బయటకు వెళ్లి చేయాలి.లేదా మాఘ శుక్ల ప్రతిపద నాడు పూర్వాహ్నమున చేయాలి.
ఏ జాతి ప్రతి సంవత్సరము నిరంతరము స్వాధ్యా యనము చేస్తూ విశేషంగా నాల్గున్నర మాసములు స్వాధ్యాయనం చేస్తుందో ఆ జాతి ఎంత గొప్పదై ఉండాలి.
వారు ఆ అనుష్టానమునే ఒక పర్వంగా ఆరాధించారు. ఏ జాతి ప్రతిపర్వము ఒక జ్ఞాన జ్యోతిని, సమాజ చైతన్యము ను గావిస్తుందో ఆ సంస్కృతి ఎంత గొప్పదో, ఈనాటి సమాజం అర్థం చేసుకోవాలి.
స్వాధ్యాయమును ఒక పర్వముగా స్వీకరించి జ్ఞానానికి ఒక పెద్ద పీట వేసింది. ఈ భారతీయ జీవన విధానము ఎంతవరకు ఈ జ్ఞానపూరిత వైజ్ఞానిక సంస్కృతి నిర్విరామముగా ప్రవహించిందో, అంతవరకు ఈ ఆర్యవర్తము భూమండలములో విజయ పతాకములు ఎగురవేసింది. స్వాధ్యాయము ప్రతి మనిషికి,ప్రతి సమాజానికి ,ప్రాణం పోస్తుంది, యశము, కీర్తి లతో మంగళహారతుల నందిస్తుంది. మరి ఈరోజు శ్రావణ పౌర్ణమిని మనందరము అన్నదమ్ముల – అక్కాచెల్లెళ్ల అనుబంధమునకు మంగళహారతులను అందిస్తుంది . జన్మతో ఈశ్వరుడు ప్రసాదించిన ఈ సంబంధం యొక్క పవిత్రతను లోకానికి తెలియజేస్తుంది. ఆషాడ మాసంలో జరిగే జగన్నాథ రథయాత్ర బలరామ-కృష్ణ- సుభద్ర ల అన్నాచెల్లెళ్ల గౌరవ యాత్ర యే
ఏ దేశము-ఏ సంస్కృతి చేయని ఈ గొప్ప పవిత్ర అనుబంధమునకు రాజ తిలకం దిద్ది గౌరవించినది. అందులకే ఈ పవిత్రమైన అనుబంధ రథయాత్ర లోకోత్తరమైనది. ఈ అనుబంధమే సమాజ మర్యాదలకు ఆధారమై ఆదరింపబడినది.
ఎన్నో చారిత్రాత్మక ఘటనలు ఈ రక్షాబంధన పవిత్ర బంధనము తో ముడిపడి ఉన్నవి.
ఉదాహరణకు అలెగ్జాండర్ భార్య రుక్సానా మహావీరుడైన మహారాజా పురుషోత్తమునకు ఈ రక్షాబంధనము కట్టి తన భర్త యొక్క ప్రాణములను కాపాడమని కోరుకున్నది . మరియు రాజస్థాన్ ప్రాంతంలో స్త్రీలు తమ రక్షణార్థము వీరుల చేతికి రక్షకట్టే పరిపాటి ప్రసిద్ధి పొందినది . ఎవరైనా స్త్రీ ఏ క్షత్రియ వీరునికైనా రాఖీని పంపి తన సోదరునిగా చేసుకునేది. ఆ వీరులు జీవనపర్యంతము ఆ స్త్రీలను రక్షించడమే కర్తవ్యం గా తీసుకునేవారు. ఛిత్తోడ్ మహారాణి కరుణావతి మొగల్ భాషా హుమాయూన్ కు గుజరాత్ భాషా నుండి రక్షణ పొందుట కొరకు రాఖీ పంపించినది. దానితో వారు ఛిత్తోడ్ వెళ్లి బహదూర్ షా ఆక్రమణ నుండి విడిపించాడు. ఈ విధంగా స్త్రీలు తమ సోదరులకు రక్షకట్టే వ్రత పర్వముగా మారినది వేదం కూడా ఉపదేశిస్తుంది.
” మా భాత భ్రాతరం ద్విక్షణ్మ స్వసారముత సస
సంయంచః స్వవ్రతా భ్రూత్వా వాచం వదత భద్రయా”
అనగా అక్క- చెల్లెళ్ళు- అన్నదమ్ములు ఎప్పుడూ ప్రేమాభిమానాలతో ఉండాలి కానీ ఒకరినొకరు ద్వేషింపకూడదు. అందరూ కలిసిమెలిసి ఒకే ఆదర్శం తో ఉండాలి.ఎప్పుడూ కళ్యాణకరమైన ,ప్రియమైన వారిని పరస్పరం ఆదరించాలి..ఈ విధంగా మన పర్వాలు ఆత్మ కళ్యాణము చరిత్ర నిర్మాణము
సుధృడ వ్యవస్థ వ్యక్తి నిర్మాణముతో వృద్ధి పొందాలనే ఉద్దేశంతో వ్యవస్థ చేయబడినది.




