యోగమే విశ్వశాంతికి లోక కళ్యాణానికి సమస్త జీవకోటి జీవనానికి మానవుని సమగ్ర ఉన్నతికి మూల కారణము. వేదములోనే యోగము యొక్క ప్రాముఖ్యత విశేషత,మహత్వము, వైభవము,లక్ష్యము, విధానము చెప్పబడినది. మహర్షి పతంజలి సర్వ మానవ కల్యాణానికై వేదము నుండి యోగ విషయములను తీసుకొని వారి స్వ అనుభవముతో దర్శించి యోగ దర్శనమును రచించారు. ఇందులో యోగము యొక్క సంపూర్ణ జ్ఞానము ,క్రియాత్మక అష్టాంగ రూపమును క్లుప్తముగా చెప్పబడినది. యోగము ద్వారానే పరమాత్మను, ఆత్మను, ప్రకృతిని సాక్షాత్కారము చేసుకోగలము.యోగము ద్వారానే అనగా యోగ నిష్టులైన ఋషుల ద్వారానే వేదము లోకానికి అందినది. ఈ అష్టాంగ యోగము వ్యక్తిగత నిర్మాణము నుంచి విశ్వశాంతికి పునాదులు వేసింది. ప్రధమ ద్వితీయ అంగాలే యమ,నియమములు.
అహింస :-
దీని ముఖ్య ఉద్దేశ్యము మనసుతో కానీ,వాణి తో కానీ, చేష్టలతో కానీ ఏ ప్రాణికి బాధ కలిగించరాదు. ఈ ప్రథమ నియమము పాటించిన పరివారంలో గాని, సమాజంలో గాని, విశ్వంలో ఎక్కడైనా అశాంతి,దుఃఖం,బాధ ఉండజాలదు. ఈరోజు అన్ని దేశాలు జీవవైవిద్యము గురించి గొప్ప గొప్ప నినాదాలు చేస్తున్నారు.కానీ అంతటా హింస తాండవిస్తోంది.పశువులు, పక్షులు,మనుషులు జీవకోటి ఈరోజు త్రాహి త్రాహి అను విధముగా జీవిస్తున్నారు.హింసా భావము యోగములోనికి,ధ్యానము లోనికి ప్రవేశించనివ్వదు. అహింస అన్ని యమ నియమములకు మూలము.
సత్యము:-
మనసా వాచా కర్మణా సత్యమునే ఆచరించడమనేది ఒక బలమైన విధానము. సత్యమే వ్యక్తిగతంగా కానీ, సామాజికంగా గాని అంతర్ రాష్ట్రీయ వ్యవహారాల్లో గాని చాలా ముఖ్యమైనది. సత్యముతోనే లోకములో విశ్వాసము కలుగుతుంది.విశ్వాసముతోనే వ్యవహారము జరుగుతుంది.అహింస-సత్యముతోనే అందరూ అన్ని క్షేత్రాలలో జయించవచ్చు అని శాస్త్రం అంటోంది.
“సత్యమ్ న సత్యమ్ ఖలుయత్ర హింస”
” సత్యమ్ భూృయాత్ ప్రియం భూృయాత్ నసత్యమ్ అప్రియమ్ భూృయాత్”
అస్తేయము:-
అస్తేయము అనగా దొంగతనము చేయకుండా ఉండడము.ఈరోజుల్లో అంతట అసత్యము తో ఇతరుల ధనమును తనదిగా చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దీనినే లోభత్వము అని అంటారు .సామాజిక వ్యవహారము అంతా అవిశ్వాసమయమవుతోంది.
బ్రహ్మచర్యము:-
బ్రహ్మచర్యము అంటే ఇంద్రియ నిగ్రహము. ఇది పాటిస్తే సమాజంలో ఉన్న అన్ని మర్యాదలు కాపాడబడతాయి.దీని యొక్క విలువలు లేనందు వల్లనే ఈరోజు యువత ఎన్నో తప్పుడు మార్గాలను వెతుకుతోంది. వాటికి ఆకర్షింపబడి అన్ని మర్యాదలను ఉల్లంఘించుచున్నది. భవిష్యత్తు అంధకారమయమవుతున్నది.
అపరిగ్రహము :-
మనకు అవసరమున్న వస్తువుల కన్నా, ధనము కన్నా ,భూమికన్నా ,ఎక్కువ సేకరించడమే అపరిగ్రహము. ఇది వ్యక్తిగతముగా,
సామాజికంగా,కూడా హాని చేస్తుంది.ఎంత అవసరమో అంతనే సేకరణ చేస్తే ప్రపంచంలో అనవసరమైన మాలిన్యము (చెత్త) తయారు కాదు.వాతావరణ మశుద్ది కానేరదు. దీనికి కారణము అత్యాశ కాబట్టి ఎంత అవసరమో అంతనే వస్తు సేకరణ చేసినచో ప్రపంచంలో ఈ రోజునున్న ప్రకృతి కాలుష్యము నుంచి విముక్తి కలుగుతుంది. అనవసరమైన శ్రమ తప్పుతుంది.
మహర్షి పతంజలి 5 యమముల గురించి ఒక గొప్ప నిర్దేశము చేశారు. ఈ ఐదు యమములు జాతి, దేశము, కాలమునకు అతీతమైన సార్వభౌమ మహావ్రతములనీ, ఈ జాతి ప్రాణి ,ఆజాతి ప్రాణి కాకుండా ఏ జాతి ప్రాణినైనా హింసంచరాదని,అదే విధముగా పవిత్రమైన దేవస్థానముల వద్ద హింస చేయకూడదు అని అనుకోవడము మరియు ముఖ్యమైన పుణ్య సమయములలో చేయరాదు కాని ఇతర కాలములలో చేయవచ్చు అనే భావము ను తిరస్కరిస్తూ, ఈ యమముల యొక్క ఆదర్శములను సార్వకాలికము గా సార్వభౌమ మహావ్రతములుగా పరిగణించి లోకానికి ఒక గొప్ప సత్యమును చెప్పారు.
నియమములు
ఐదు యమములు తరువాత ఐదు నియమాలను యోగము యొక్క ఆధారాలుగా వివరించారు. అవి … శౌచము, సంతోషము, తపము ,స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము.
శౌచము
బాహ్య శౌచము – ఆంతరిక శౌచము
బాహ్య శౌచము :-
మట్టి మరియు జలములతో శరీర శుద్ధి మరియు పవిత్రమైన పరిమిత ఆహారంతో ఉదర ప్రక్షాళనను కూడ బాహ్య శౌచమని అంటారు.
ఆంతరంగిక శౌచము
చిత్తము యొక్క మలములు, రాగ, ద్వేష, మధ,మాన ఈర్ష్య నిందాదుల నుండి రహితము కావడము.
సంతోషము.
తన సమీపంలో ఉన్న భోగసాధనముల నుండి అధిక ప్రాప్తి ని కాంక్షించకుండా ఉండడము.
తపము
ద్వంద్వములను సహించడం ఆకలి – దప్పిక, మాన-అవమానములను,సుఖ-దుఃఖాలను,చలి-వేడి ఇత్త్యాదులను సహించడమే తపము.
స్వాధ్యాయము
మోక్ష గ్రంధాలు వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు ఇత్యాది శాస్త్రాలను చదవడము మరియు ప్రణవ జపము చేయడమే స్వాధ్యాయము.
ఈశ్వర ప్రణిధానము
పరమ గురువైన పరమాత్మ యందు సర్వకర్మలను సమర్పించుకోవడము. ఈ విధముగా యమ, నియమముల ఆధారము పైనే యోగ సాధన స్థిరమై ఉన్నది. ఇది పాటిస్తూ ఆసనముల ద్వారా స్థిర సుఖాసనము అనగా స్థిరముగా సుఖ పూర్వకముగా ధ్యానములో కూర్చునే అభ్యాసము చేయాలి. దీనికి ప్రాణాయామములు చాలా తోడ్పడుతాయి.వీటన్నింటి ఆధారముతో ధారణ,ధ్యానము, సమాధి సిద్ధిస్తుంది.
మహర్షి పతంజలి నిర్దేశించిన ఈ అష్టాంగ యోగము వ్యక్తిగత ,సామాజిక ఉన్నతికి మరియు విశ్వ కళ్యాణానికి ఆధారము, ఆదర్శము.




