తెలంగాణ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డగోలు అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ అప్పులు తీర్చడానికి మరియు వివిధ పథకాలకు డబ్బులు లేక ప్రభుత్వ ఆస్తులను అమ్మకానికి పెడుతున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన రాయ్‌దుర్గ్ ప్రాంతంలో ఒక భారీ భూ వివాదం వెలుగు చూసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఐదు ఎకరాల విలువైన భూమిని రేవంత్ ప్రభుత్వం విక్రయించింది. చివరకు ప్రభుత్వ భూములే కాకుండా బ్యాంకులకు సంబంధించిన స్థలాలను కూడా అమ్మేసుకునే స్థాయికి పాలన దిగజారిందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
తమ భూమిని రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా విక్రయించిందని స్టేట్ బ్యాంక్ ఆలస్యంగా గుర్తించింది. దీంతో దిగ్భ్రాంతికి గురైన ఎస్బీఐ అధికారులు వెంటనే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ తీరుపై న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఒక ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ బ్యాంకుకు చెందిన భూమినే ఇలా అమ్ముకునే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో ఆర్థిక నిర్వహణ ఎంతలా దివాళా తీసిందో అర్థం చేసుకోవచ్చు. ఆదాయం పెంచడం చేతకాక ఉన్న ఆస్తులను తగలేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఇలా ఆస్తులు అమ్ముకుంటూ పోతే రేపు తెలంగాణ భవిష్యత్తు ఏం కావాలో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ బ్యాంకు భూములు అమ్మారు కాబట్టి రేపు ప్రజా ఆస్తులను ఏం చేస్తారోనని జనం ఆందోళన చెందుతున్నారు. హైకోర్టులో ఎస్బీఐ వేసిన ఈ కేసుతో రేవంత్ ప్రభుత్వ ఆర్థిక వైఫల్యాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ ఆర్థిక విధానాలకు న్యాయస్థానంలోనే గట్టి అక్షింతలు పడటం ఖాయంగా కనిపిస్తోంది.



