మార్చి 22న మహారాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ నియామక పరీక్ష ఎంతో ఉత్కంఠగా ముగిసింది. వేలాది మంది అభ్యర్థులు రాసిన ఈ పరీక్ష ఫలితాలు విడుదల కాగానే రుతుజ అనే యువతికి ఏకంగా 7వ ర్యాంక్ వచ్చింది. అంత గొప్ప ర్యాంక్ చూసి ఆమె కుటుంబం ఎంతో ఆనందించింది. కానీ, ఆ మెరిట్ వెనుక ఒక రహస్య లవ్ స్టోరీ దాగి ఉంది.
……
గౌరవ్ పాటిల్… రుతుజ పాటిల్ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. ప్రేయసి రుతుజను ఎలాగైనా ప్రభుత్వ అధికారిగా చూడాలని ఆమె ప్రియుడు లోకేష్ అలియాస్ గౌరవ్ తపించిపోయాడు. ఎంపీఎస్సీలో పనిచేసే అధికారులకు ఏకంగా 5 లక్షలు లంచం ఇచ్చి ప్రశ్నాపత్రాన్ని ముందే చేజిక్కించుకున్నాడు. పరీక్షకు రెండు రోజుల ముందే వాట్సాప్‌లో ఆ లీక్డ్ పేపర్‌ను ఆమెకు చేరవేశాడు. ఆ రాత్రికి రాత్రే ప్రశ్నలన్నీ చదివేసిన రుతుజ, పరీక్ష రాసి ఊహించినట్లే టాపర్‌గా నిలిచింది.
…….
అయితే ఫలితాలు వచ్చాక వారి బంధంలో ఊహించని మలుపు తిరిగింది. ఇద్దరి మధ్య తీవ్ర మనస్పర్థలు వచ్చి విడిపోవాల్సి వచ్చింది. ప్రేయసి పెద్ద ఆఫీసర్ అయితే తనను పూర్తిగా మరిచిపోతుందని గౌరవ్‌కు విపరీతమైన భయం కలిగింది.
దాంతో తానే స్వయంగా ఎంపీఎస్సీ అధికారులకు విజిల్ బ్లోయర్‌లా రహస్య ఈమెయిల్ పంపి, పేపర్ లీక్ గుట్టును రచ్చకెక్కించాడు.
….
రంగంలోకి దిగిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణను తీవ్రతరం చేశారు. సీన్ కట్ చేస్తే, కంప్లైంట్ ఇచ్చిన ప్రియుడే ఈ లీకేజీకి ముఖ్య సూత్రధారని సాంకేతిక ఆధారాలతో నిరూపించారు. ఆ ప్రియుడితో పాటు లంచం తీసుకున్న ముగ్గురు ఎంపీఎస్సీ ఉద్యోగులను అరెస్టు చేశారు. ఏడో ర్యాంక్ సాధించిన రుతుజకు పోలీసు నోటీసులు అందగా, అధికారులు ఆ పరీక్షను పూర్తిగా రద్దు చేశారు.



