……………………………………………………………
ఫ్లై దుబాయ్ విమాన ప్రమాదం ప్రపంచాన్ని కలవర పరిచింది. స్వయంగా కో పైలట్ హంతకుడిగా మారి, మారణ హోమం స్రష్టించాలని భావించాడు. కత్తితో పైలట్ ను భయపెట్టేసి, విమానాన్ని ఏకంగా భారీ భవంతులను ఢీ కొట్టేయాలని భావించాడు. సెప్టెంబర్ 11 దాడులను తలపించేట్లుగా ప్లాన్ చేశాడు. అదే జరిగితే ప్రాణ నష్టం వందల మందికి చేరుకొనేది. కానీ, పైలట్ గా ఉన్న భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ ప్రాణాలకు తెగించి అడ్డుకొన్నారు. విమానంలోని 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. ప్రపంచ దేశాలన్నీ స్మిత్ మచ్చర్ సాహసాన్ని మెచ్చుకొంటున్నారు.
……………………………………………………………..
వాస్తవానికి, ఇదే మాదిరిగా గతంలో కూడా జరిగాయి. భారతీయ పైలట్స్ అప్రమత్తంగా వ్యవహరించి వందలాది మంది ప్రాణాలను రక్షించారు. ఆ సంఘటనలను ఒకసారి చూద్దామ్.
కెప్టెన్ దేవి శరణ్ …
1999 డిసెంబర్ 24న కాట్మాండు నుంచి ఢిల్లీ వస్తున్న IC 814 విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేశారు. అమృత్‌సర్‌లో ల్యాండ్ అయినప్పుడు భారత కమాండోల చర్యలకు వీలుగా రీఫ్యూయెలింగ్ను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారు. లాహోర్‌లో రన్‌వే లైట్లు ఆర్పివేసినా, ఇంధనం లేకపోయినా అత్యంత చాకచక్యంగా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. తన తెలివితేటలతో 170 మందికి పైగా ప్రయాణికుల ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించారు.
కెప్టెన్ ఎం. కె. కచ్రూ … శ్రీనగర్ నుంచి జమ్మూ వెళ్తున్న ‘గంగ’ ఫోకర్ విమానాన్ని పాకిస్థాన్ ఉగ్రవాదులు హైజాక్ చేసి లాహోర్‌కు మళ్లించారు. కెప్టెన్ కచ్రూ,, ఫస్ట్ ఆఫీసర్ ఎం.పి. లక్ష్మణ్ ఉగ్రవాదులతో వ్యూహాత్మకంగా మాట్లాడుతూ పరిస్థితిని శాంతింపజేశారు. ఉగ్రవాదులు విమానాన్ని తగలబెట్టడానికి ముందే, ప్రయాణికులు మరియు సిబ్బంది అందరూ క్షేమంగా బయటపడేలా చూశారు.
కెప్టెన్ వి. కె. మెహతా …. చండీగఢ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానాన్ని తీవ్రవాదులు హైజాక్ చేసి లాహోర్, ఆపై దుబాయ్‌కి తీసుకెళ్లారు.
విమానంలో ఇంధనం అయిపోతున్నప్పటికీ కెప్టెన్ మెహతా చాకచక్యంగా దుబాయ్‌లోని అల్ మక్తూమ్ రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్ చేశారు. 36 గంటలకు పైగా సాగిన ఉత్కంఠకు తెరదించి ప్రయాణికులందరినీ సురక్షితంగా విడిపించారు.
కెప్టెన్ జి. ఎన్. సింగ్ … ఢిల్లీ నుంచి అమృత్సర్ మీదుగా శ్రీనగర్ వెళ్తున్న బోయింగ్ 737 విమానాన్ని దల్ ఖల్సా ఉగ్రవాదులు లాహోర్‌కు మళ్లించారు. కెప్టెన్ జి.ఎన్. సింగ్ హైజాకర్లను అనుమానం రాకుండా శాంతపరుస్తూనే … ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి రహస్య సమాచారం అందించారు. పాకిస్తాన్ కమాండోలు మెరుపు దాడి చేసి ఉగ్రవాదులను పట్టుకునే వరకు కాపాడారు.
………………………………………………………………………
ఇటువంటి ఘటనల్లో … భారతీయ కెప్టెన్స్ తిరుగులేని సాహసం ప్రదర్శించారు. తాజాగా ఫ్లై దుబాయ్ విమానంలో ప్రాణాలకు తెగించిన ఫ్లైట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు. ప్రపంచ నాయకులు పొగడ్తలతో ముంచెత్తారు. భారతీయ యువతకు ఇనిస్పిరేషన్ గా నిలిచారు.



