
…………………………………………………………….
ఎన్నికల సంఘం మీద పోరాటానికి ఇండియా కూటమి దేశ వ్యాప్తంగా ఉద్యమం రెడీ చేస్తోంది. దీని మీద చర్చించేందుకు ‘ఇండియా’ కూటమి అగ్రనేతలు ఢిల్లీలో సమావేశమయ్యారు. సుమారు నాలుగు నెలల విరామం తర్వాత జరిగిన ఈ భేటీకి కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, శివసేన ఉద్ధవ్ వర్గం, ఆర్జేడీ ప్రతినిధులు హాజరయ్యారు. అయితే డీఎంకే, ఆప్, ఎస్పీ వంటి బలమైన పార్టీలు గైర్హాజరయ్యారు. జాతీయ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ, కూటమిలోని ప్రధాన పార్టీల మధ్య ఐక్యత లేదన్నది వాస్తవం.
……………………….
కేరళలో ఈ అంతర్గత విభేదాలు అత్యంత స్పష్టంగా కనిపిస్తాయి. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ (UDF), సిపిఎం నేతృత్వంలోని ఎల్డిఎఫ్ (LDF) దశాబ్దాలుగా ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నాయి. ఢిల్లీ వేదికపై చేతులు కలిపే కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు కేరళలో మాత్రం ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో పోటీపడుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలు పరస్పరం హోరాహోరీగా తలపడ్డాయి.
…….
ఇక పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ,, , కాంగ్రెస్, మరియు లెఫ్ట్ ఫ్రంట్ మధ్య ఐక్యత లేనే లేదు. మమతా బెనర్జీ నేతృత్వంలోని టిఎమ్సి, రాష్ట్రంలో కాంగ్రెస్ మరియు కమ్యూనిస్ట్ పార్టీలను తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్థులుగానే పరిగణిస్తోంది. బెంగాల్లో కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా కేటాయించేందుకు టిఎమ్సి సుముఖంగా లేదు. ఢిల్లీ సమావేశాల్లో టిఎమ్సి ప్రతినిధులు పాల్గొంటున్నప్పటికీ, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్తో కలిసి పనిచేయడానికి తీవ్రంగా నిరాకరిస్తున్నారు.
…………………
పంజాబ్లో కూడా ఇదే విధమైన పరిస్థితులు నెలకొన్నాయి. పంజాబ్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మరియు ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య భయంకరమైన పోరాటం సాగుతోంది. స్థానిక ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు ప్రత్యర్థులుగానే బరిలోకి దిగుతున్నాయి. కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి అని చెబుతున్నప్పటికీ, పంజాబ్, ఢిల్లీలలో ఆప్, కాంగ్రెస్ నేతలు నిత్యం విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ విధంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన శత్రుత్వం ఉండటం వల్ల జాతీయ స్థాయిలో ఐక్యత సాధించడం దాదాపు అసాధ్యంగా మారుతోంది.
……………………………………
రాష్ట్రాల స్థాయిలో ఉన్న ఈ తీవ్రమైన రాజకీయం కూటమి ప్రాథమిక సూత్రాలకే ముప్పుగా మారింది. ఇక, కాంగ్రెస్ పార్టీ లోపల కూడా కుమ్ములాటలు తీవ్రంగా ఉన్నాయి. రాహుల్ గాంధీ వైఖరి మీద కాంగ్రెస్ సీనియర్లు లోలోపల మథన పడుతున్నారు. ఇటీవల రాహుల్ చేపట్టిన యాత్రలు, పోరాటాలలో పెద్దగా కాంగ్రెస్ అగ్ర నేతలు కనిపించలేదు. దీంతో ఇండియా కూటమి ఐకమత్యం మీద అందరికీ అనుమానాలు కలుగుతున్నాయి.



