గాజా ఘర్షణల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తప్పు పడుతున్నారు. ముస్లిం ల మీద దాడులను ఖండించాలని ఆమె పరోక్షంగా పట్టుబడుతున్నారు. ఈ వ్యాఖ్యలు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీశాయి. అంతర్జాతీయ వేదికలపై భారత్ మౌనంగా ఉందంటూ ఆమె వ్యక్తం చేసిన ఆవేదన… మైనార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు నిదర్శనం . దూరాన ఎక్కడో జరుగుతున్న ఘర్షణలపై గుండెలు బాదుకునే కాంగ్రెస్ అధినాయకత్వం, దశాబ్దాలుగా హిందువులపై జరుగుతున్న ఘోరాలపై ఎందుకు నోరు విప్పడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
…….
గతంలో కాశ్మీరీ పండిట్లపై జరిగిన సామూహిక హత్యాకాండ, వారిని సొంత గడ్డ నుండే తరిమివేసిన అమానవీయ ఘటనలపై కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ నిరసన వ్యక్తపరచలేదు. అలాగే పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువుల ఇళ్లను తగులబెడుతూ, ఆలయాలను ధ్వంసం చేస్తూ, వారిపై నిరంతరం దాడులు జరుగుతున్నా సోనియా గాంధీ ఎన్నడూ స్పందించలేదు. సొంత దేశంలో మరియు పొరుగు దేశాలలో హిందువులు అనుభవిస్తున్న నరకయాతన కంటే, సుదూర తీరాల్లోని గాజా సంక్షోభమే ఆమెకు నైతిక ప్రాధాన్యతగా కనిపిస్తోంది.
…….
ఇలాంటి ఉదాహరణలు కాంగ్రెస్ చరిత్రలో అనేకం కనిపిస్తాయి.
గతంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో వేధింపులకు గురై భారతదేశానికి శరణార్థులుగా వచ్చిన హిందూ, సిక్కు మైనారిటీలకు పౌరసత్వం కల్పించే ‘సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్’ ను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. కేరళలో ఐసిస్ ఉగ్రవాద భావజాలం వల్ల వందలాది మంది యువతులు బలవుతున్నా పట్టించుకోలేదు. బెంగాల్లో ఎన్నికల అనంతర హింసలో హిందూ కుటుంబాలు అల్లాడినా కాంగ్రెస్ అధినాయకత్వం వహించింది. ఇవేమీ గుర్తుకురాని సోనియా గాంధీకి, ఇప్పుడు గాజాలోని మానవీయ సంక్షోభం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.
ఈ పరిణామాలన్నీ చూస్తుంటే, సోనియా గాంధీ అనుసరిస్తున్న విదేశాంగ నీతి కేవలం ముస్లిం ఓటు బ్యాంకును ఆకర్షించే పక్షపాత ధోరణి మాత్రమేనని స్పష్టమవుతోంది. హిందువుల ప్రాణాలకు, వారి హక్కులకు కనీస విలువ ఇవ్వకుండా, కేవలం ఒక వర్గాన్ని సంతృప్తి పరచడం కోసమే గాజా అంశాన్ని తెరపైకి తెచ్చారు. భారతదేశ చారిత్రక విదేశాంగ విధానం ఎప్పుడూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగానే ఉంటుందని, అంతర్జాతీయ రాజకీయాలను దేశీయ ఓటు బ్యాంకు రాజకీయాలతో ముడిపెట్టడం దేశ ప్రయోజనాలకు నష్టదాయకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.



