కోటాలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రాహుల్ గాంధీ సభ ఘోరంగా విఫలమైంది. విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ ర్యాలీకి విద్యార్థులే పెద్దగా రాకపోవడంతో కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. రాహుల్ గాంధీ ఎప్పటిలాగే వేదికపైకి వచ్చి వ్యవస్థల లోపాలపై గంభీరమైన ఉపన్యాసాలు దంచారు. కానీ ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలో చెప్పడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. కేవలం రాజకీయ లాభం కోసం, నెగెటివిటీని ప్రచారం చేయడమే లక్ష్యంగా ఆయన ప్రసంగం సాగిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
ప్రస్తుతం లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ప్రతిష్టాత్మకమైన నీట్ పరీక్షకు సిద్ధమవుతున్నారు. పరీక్షకు మరో రెండు మూడు రోజుల సమయం మాత్రమే ఉన్న ఈ తరుణంలో విద్యార్థులకు ధైర్యం చెప్పాల్సింది పోయి, రాహుల్ గాంధీ వారిని భయపెట్టే ప్రయత్నం చేశారు. పరీక్షా విధానంలో తప్పులు జరుగుతున్నాయంటూ విద్యార్థులను తీవ్ర గందరగోళంలోకి నెట్టారు. పరీక్ష రాయకముందే వారిలో అభద్రతా భావాన్ని నింపేలా మాట్లాడారు. ఓట్ల రాజకీయం కోసం విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ రాజకీయ వ్యూహాలను నీట్ విద్యార్థులు ముందే గమనించారు. అందుకే రాహుల్ గాంధీ ర్యాలీకి దూరంగా ఉంటూ ఆయనకు గట్టి బుద్ధి చెప్పారు. పరీక్షల సమయంలో రాజకీయం చేసే ఇలాంటి నేతలను దేశ యువత అస్సలు నమ్మదని తాజా పరిణామం నిరూపించింది. పరీక్షల సమయంలో విద్యార్థులకు కావలసింది ధైర్యం, ప్రశాంతత మాత్రమేనని, ఇలాంటి పొలిటికల్ డ్రామాలు కావని స్పష్టమవుతోంది. రాహుల్ గాంధీ అనుసరించిన ఈ వైఖరిని కోటా విద్యార్థులు, విద్యావేత్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు.




