……………………………………………………….
ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా రాయచోటి టెర్రర్ లింక్స్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన షేక్ అమానుల్లా అలియాస్ అబూబకర్ సిద్ధిఖ్‌తో కలిసి కుట్ర పన్నిన రెండో నిందితుడు మహ్మద్ అలీ అలియాస్ షేక్ మన్సూర్ పై తాజాగా ఛార్జ్‌షీట్ దాఖలైంది. గతేడాది షేక్ అమానుల్లా ఇంట్లో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న నాటి నుండి ఈ కేసులో దేశద్రోహ కోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
…………………………………..
ఈ కేసులో నిందితుల నేపథ్యం దేశ భద్రతకు ఎంత పెద్ద ముప్పు పొంచి ఉందో స్పష్టం చేస్తోంది. రెండో నిందితుడైన మహ్మద్ అలీ నిజానికి 1999లో తమిళనాడులో జరిగిన ఓ బాంబు పేలుడు కేసులో నిందితుడిగా ఉండి పోలీసులకు దొరకకుండా పరారయ్యాడు. ఆ తర్వాత రాయచోటి పట్టణంలో షేక్ మన్సూర్ అనే నకిలీ పేరుతో చొరబడి, తప్పుడు పద్ధతుల్లో ప్రభుత్వ గుర్తింపు కార్డులను సంపాదించి ఇక్కడే నివాసం ఉంటున్నాడు. ఇలాంటి నేరస్థులు నకిలీ గుర్తింపులతో సమాజంలో చొరబడటం అంతర్గత భద్రతకు అత్యంత ప్రమాదకరమైన అంశం.
………………………………
ఎన్ఐఏ దర్యాప్తు ప్రకారం, ప్రధాన నిందితుడు షేక్ అమానుల్లా ద్వారా మహ్మద్ అలీ తీవ్రవాదం వైపు ఆకర్షితుడై, బాంబుల తయారీలో ప్రత్యేక శిక్షణ కూడా పొందాడు. రాయచోటిలోని ఒక రహస్య ప్రాంతానికి పేలుడు పదార్థాలను రవాణా చేయడంలో అమానుల్లాకు ఇతడు పూర్తి స్థాయిలో సహకరించాడు. దేశంలో అశాంతిని రేకెత్తించడానికి, ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన ప్రముఖ నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడానికి మరియు భారతదేశంలో శరియా చట్టాన్ని తీసుకురావడానికి వీరిద్దరూ కలిసి పెద్ద కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది.
…………………………………………………
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకొని, ఉగ్రవాదులు దాడులకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఇందుకోసం తీవ్రమైన కుట్ర ను అమలు చేసే క్రమంలో దొరికిపోయారు. భద్రతాబలగాలు, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించటంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే చాలా నష్టం జరిగి ఉండేది అని తెలుస్తోంది.



