సంస్క్రత భాష గొప్పతనం అంతా ఇంతా కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ జీ భాగవత్ అన్నారు. సంస్క్రతం మన భారతీయ సమాజానికి ఆత్మ వంటిది అని అన్నారు. ఆత్మ దర్శనం జరిగితేనే భారతీయ సమాజం గొప్పతనం అర్థం అవుతుందని వివరించారు.
న్యూఢిల్లీ లో నూతనంగా నిర్మించిన సంస్క్రత భారతి కార్యాలయానికి మోహన్ జీ ప్రారంభోత్సవం చేశారు. సంస్థ భవిష్యత్ ప్రయత్నాలకు దైవ ఆశీస్సులు కోరుతూ, సాంప్రదాయ పూజ, హవనంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. దీని అనంతరం సంస్కృత భారతి చిహ్నాన్ని లాంఛనంగా ఆవిష్కరించి, కొత్తగా నిర్మించిన “ప్రణవః” భవనాన్ని ప్రారంభించారు. “సంస్కృతం భారత్‌కు ప్రాణశక్తి వంటిది. ఎందుకంటే ఆలోచనలు, జీవన విధానం, సంస్కృతికి సంబంధించిన అత్యంత ప్రాచీనమైన, సంప్రదాయం ఇప్పటికీ దీని ద్వారానే కొనసాగుతోంది. భారత్ సాంస్కృతిక వారసత్వం అనేది విశ్వంలోని సజీవ, నిర్జీవ అంశాలతో సహా సమస్త జీవరాశిని పరిరక్షించే ఒక సంప్రదాయంగా పరిగణించబడుతుంది” అని తెలిపారు.
సంస్క్రతం గొప్పతనాన్ని మోహన్ జీ వివరించారు. “ఈ కర్తవ్యాన్ని నెరవేర్చాలంటే, ప్రతి ఒక్కరూ భారత్‌ను తెలుసుకోవాలి, భారత్‌ను స్వీకరించాలి. తమను తాము భారత్‌లో ఒక భాగంగా తీర్చిదిద్దుకోవాలి” అని ఆయన స్పష్టం చేశారు. డాక్టర్ భాగవత్ మాట్లాడుతూ, “సంస్కృతం ఒక భాష. అయినప్పటికీ, ఇది కేవలం ఒక భాష మాత్రమే కాదు. మీకు సంస్కృతం తెలిస్తే, ఏ ఇతర భారతీయ భాషనైనా అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది” అని చెప్పారు. భారత్‌లో, సంస్కృతం దేశానికి ఆత్మ వంటిదని పేర్కొంటూ ఇది ఆలోచనలు, జీవన విధానం, సంస్కృతికి సంబంధించిన అత్యంత ప్రాచీన సంప్రదాయం అని, ఇది నేటికీ భారత్ నడుమ సజీవంగా, శక్తివంతంగా వెలుగొందుతోందని ఆయన తెలిపారు. “భారత్ ఉనికి అనేది కేవలం ఒక భౌగోళిక వాస్తవం మాత్రమే కాదు. ఇది కేవలం ఒక రాజకీయ లేదా ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు. భారత్ అనేది ఒక సజీవ సంప్రదాయం. జీవన ప్రవాహం నిరంతరాయంగా కొనసాగడానికి ఆధారమైన మూలస్తంభం” అని ఆయన అభివర్ణించారు.
తాను సంస్క్రతం అభ్యసించానని మోహన్ జీ వెల్లడించారు. “నా చిన్నతనంలో, పాఠశాలలో సంస్కృతం బోధించేటప్పుడు, అది చాలా కష్టమైన భాషగా అనిపించేది. పాఠ్య ప్రణాళికలో భాగంగా మేము శ్లోకాలను కంఠస్థం చేయాల్సి వచ్చేది. దీనివల్ల సంస్కృతం ఒక క్లిష్టమైన భాష అనే భావన మాలో ఏర్పడింది. కానీ, అదే శ్లోకాలను ఇంట్లో సహజ సంభాషణల రూపంలో విన్నప్పుడు మాత్రం, అవి ఏమాత్రం కష్టంగా అనిపించేవి కావు” అంటూ తన అనుభవాలను డా. భగవత్ వివరించారు. “ఈ సమస్య నేటికీ కొనసాగుతూనే ఉంది. విద్యార్థులు సంస్కృతాన్ని ఒక కష్టమైన భాషగానే భావిస్తున్నారు. అయితే, ఇక్కడ ఒక ప్రశ్న మిగిలే ఉంది. ఇది ఎందుకంత కష్టంగా అనిపిస్తుంది? వాస్తవానికి, భాష నేర్చుకోవడానికి అత్యంత సరళమైన, ప్రభావవంతమైన పద్ధతి పాఠ్యపుస్తకాల ద్వారా కాదు, సంభాషణ ద్వారానే” అని ఆయన తెలిపారు. భాషలో లీనమవడం, నిరంతరం ఉపయోగించడం ద్వారా భాషా అభ్యసనం సులభతరం అవుతుందని ఆయన నొక్కి చెప్పారు.
ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సంస్క్రత భారతి జ్యేష్ట కార్యకర్తలు పాల్గొన్నారు. సంస్క్రతంలో నిర్వహించిన సాంస్క్రతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకొన్నాయి.



