తెలంగాణలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటూ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత బలమైన శక్తిగా ఎదుగుతున్న బీజేపీని చూసి కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం పట్టుకుంది. ఈ రాజకీయ ఎదుగుదలను తట్టుకోలేకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా కేంద్ర ప్రభుత్వంపై బురదజల్లే రాజకీయాలకు తెరలేపారు. మెట్రో రైల్ ప్రాజెక్టును కేంద్రం అడ్డుకుంటోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కేవలం రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ మైలేజ్ కోసమేనని స్పష్టమవుతోంది. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీల అమలును గాలికొదిలేసి, ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రేవంత్ రెడ్డి ఈ తరహా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు అని విశ్లేషకులు అంటున్నారు.
………………………………………………..
గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ విధంగానైతే కేంద్రంపై నెపం నెట్టి కాలయాపన చేశారో, నేడు రేవంత్ రెడ్డి కూడా అదే పాత పద్ధతిని కాపీ కొడుతున్నారు. నిజానికి హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది. మెట్రో ఫేజ్-1 ప్రాజెక్టు కోసం మోదీ ప్రభుత్వం రూ.1,250 కోట్లు కేటాయించడమే కాకుండా, ఫేజ్-2కు కూడా 50:50 నిష్పత్తిలో నిధులు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. దేశంలోని ఇతర నగరాల తరహాలోనే హైదరాబాద్ మెట్రో విషయంలోనూ సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాలను పరిశీలించి కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుంది తప్ప, ఎవరో ఆపమంటే ఆగే ప్రాజెక్టులు ఇవి కావు.
………………………………………
అభివృద్ధి పనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే అసలైన అలసత్వం. సికింద్రాబాద్, నాంపల్లి, చర్లపల్లి రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు భూసేకరణ చేయాలని కేంద్రం కోరినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా ఎంఎంటిఎస్ ఫేజ్-2ను కేంద్ర నిధులతోనే నిర్మించారు. తెలంగాణలో రూ.1.75 లక్షల కోట్లతో జాతీయ రహదారులు విస్తరించారు. రైల్వే స్టేషన్ల ఆధునీకరణ వంటి భారీ ప్రాజెక్టులను కేంద్రమే మంజూరు చేసింది. మూసీ పునరుజ్జీవనం కోసం రూ.4,100 కోట్ల రుణం ఇప్పించారు. రాష్ట్రానికి 50 ఏళ్ల కాలపరిమితితో రూ.11,000 కోట్ల వడ్డీ లేని రుణాన్ని కూడా కేంద్రమే అందించింది.
…………………………………………………………………..
మెట్రో రైలు విషయంలో మీడియా ముందు తప్పుడు ప్రచారాలు చేయడం తగదు అని విశ్లేషకులు అంటున్నారు. మెట్రో ఆదాయం నుంచి మొదట ఆపరేషన్స్, మెయింటెనెన్స్ ఖర్చులు చూసుకున్నాకే అప్పులు కట్టాలని, లేదంటే ప్రాజెక్టు మనుగడ కష్టమవుతుందని కేంద్రం సూచిస్తే రేవంత్ రెడ్డి అంగీకరించడం లేదు. కేంద్రంపై నిందలు వేయడం ఆపి, ఫైనాన్షియల్ మరియు టెక్నికల్ ఫీజిబిలిటీపై కలిసి కూర్చుని చర్చించడమే మార్గమని నిపుణులు అంటున్నారు.




