…………………………………………………..
రాహుల్ గాంధీ చేపడుతున్న “ఛాత్రోం కీ గూంజ్” కార్యక్రమం ప్రస్తుతం సరికొత్త చర్చకు దారితీసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ సదస్సులు నిర్వహిస్తున్నారు. సుదీర్ఘ పోరాటం చేస్తున్నానని ప్రకటించడం విద్యార్థులను, యువతను రెచ్చగొట్టాలనే తపన బలంగా కనిపిస్తోంది. విద్యార్థుల భవిష్యత్తు, విద్యా సంబంధిత అంశాలపై కాంగ్రెస్ పార్టీ చూపిస్తున్న శ్రద్ధ ఎంతవరకు ప్రామాణికమైనదనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
………
ఈ సదస్సుల నిర్వహణ తీరును పరిశీలిస్తే ఒక స్పష్టమైన రాజకీయ కోణం కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తరహా ఆందోళనలు, వేదికలు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ లేదా దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లోని నగరాలలో విద్యార్థులతో సమావేశాలు ఏర్పాటు చేసి, అక్కడి ప్రభుత్వాల నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళన చేయిస్తున్నారు. అంతిమంగా బీజేపీ నేతలను బద్నామ్ చేయటమే లక్ష్యంగా ప్రసంగాలు సాగుతున్నాయి.
………………………
మరోవైపు, కాంగ్రెస్ పార్టీ లేదా దాని భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ఇలాంటి “ఛాత్రోం కీ గూంజ్” ప్రోగ్రామ్లు పెద్దగా లేనే లేవు. ఉదాహరణకు దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, కర్ణాటక వంటి కీలక రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అలాగే కేరళం లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ప్రధాన భాగస్వామిగా ఉంది. ఈ రాష్ట్రాలలోనూ విద్యా వ్యవస్థ, ఉద్యోగ ప్రకటనలు, విద్యార్థి విషయాలలో చాలా సమస్యలు ఉన్నాయి. కానీ, ఎక్కడా కూడా ఒక్కటంటే ఒక్క ఆందోళన కూడా రాహుల్ గాంధీ నిర్వహించకపోవడం గమనార్హం.
………………..
సొంత పార్టీలు అధికారంలో ఉన్న చోట విద్యార్థుల సమస్యలను పట్టించుకోవటం లేదు. కేవలం ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్న చోటే నిరసన వేదికలు పెట్టి రెచ్చగొడుతున్నారు. తమ రాష్ట్రాల్లో అన్నీ సక్రమంగా ఉన్నట్లు చిత్రీకరిస్తూ, ప్రత్యర్థి రాష్ట్రాల్లో మాత్రమే విద్యార్థుల హక్కుల గురించి మాట్లాడటం రాజకీయ ప్రయోజనాల కోసమే. ఈ పరిణామాలను బట్టి చూస్తే, రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు విద్యార్థుల సంక్షేమం లేదా విద్యా రంగ సంస్కరణల కోసం కాదు. ప్రధానంగా బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయం చేయటమే లక్ష్యంగా కనిపిస్తోంది. విద్యార్థుల పేరుతో రాజకీయ కుంపటి రాజేస్తున్నారు. జెన్ జీ పేరుతో సమాజానికి వ్యతిరేకంగా విద్యార్థులు, యువతను రెచ్చగొడుతున్నారు. అంతిమంగా కాంగ్రెస్ బలం పెంచుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నారు.



