ఆత్మీయ భరితమైన వాతావరణంలో హైదరాబాద్ వై యమ్ సీ ఏ హాలు లో నారద జయంతి కార్యక్రమం జరిగింది. సమాచారభారతి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవంలో మీడియాలోని వివిధ విభాగాలకు చెందిన పలువురు జాతీయవాద జర్నలిస్టులకు పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. పురస్కారాలను అందుకున్నవారిలో ‘వార్త’ దినపత్రిక సంపాదకులు దామెర్ల సాయిబాబా, సీనియర్ జర్నలిస్ట్ జంధ్యాల శరత్ బాబు, మహిళా జర్నలిస్టు-వీడియో బ్లాగర్ వల్లీ పద్మాంజలి (అంజలి), సీనియర్ కార్టునిస్ట్ సరస్వతుల రామ నరసింహం (సరాసి), ఐన్యూస్ చానెల్ వరంగల్ బ్యూరో చీఫ్ బూరం ప్రశాంత్, రాజ్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ లక్ష్మి ఉన్నారు. వీరికి సమాచార భారతి అధ్యక్షులు ప్రొఫెసర్ జి గోపాల్ రెడ్డి, సంస్థ ఉపాధ్యక్షులైన సీనియర్ జర్నలిస్ట్ వల్లీశ్వర్, జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి చేతుల మీదుగా సత్కారాలు, పురస్కార ప్రదానం జరిగాయి.
సమాచార భారతి అధ్యక్షులు ప్రొఫెసర్ జి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ మీడియా రంగానికి ఈ సంస్థ చేస్తున్న సేవలను వెల్లడించారు. సమాచార భారతి మూడు దశాబ్దాలుగా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ మీడియా రంగానికి సంబంధించిన పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోందని తెలిపారు. వక్రీకరణ జరిగిన భారతదేశ చరిత్రను సరైన దిశలో ప్రపంచానికి తెలియజేయడానికి సమాచార భారతి కృషి చేస్తున్నదని, అందులో భాగంగానే పాత్రికేయ మిత్రులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి, సోషల్ మీడియా సంగమాలు, పాత్రికేయ శిక్షణా శిబిరాలు వంటి పలు కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. జాతీయవాద పాత్రికేయుల్ని తయారు చేయడం కోసం జర్నలిజం కళాశాలను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.



