రానున్న బల్దియా ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ 67 స్థానాలు గెలిస్తే మజ్లిస్‌తో మిత్రపక్షం లేకుండానే మేయర్‌ పీఠం కైవసం చేసుకోనుంది. కాని

బల్దియా పోరులో పార్టీల బలబలాలు

టీఆర్‌ఎస్‌ 67 స్థానాలు గెలిస్తే చాలు మేయర్‌ పీఠం కైవసం

రానున్న బల్దియా ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ 67 స్థానాలు గెలిస్తే మజ్లిస్‌తో మిత్రపక్షం లేకుండానే మేయర్‌ పీఠం కైవసం చేసుకోనుంది. కాని బీజేపీ మాత్రం వంద స్థానాలు సాధిస్తేనే మేయర్‌ పీఠం చేజిక్కుంచుకునే అవకాశం ఉంటుంది. బల్దియా పోరుకు ఇప్పటికే దాదాపుగా రంగం సిద్ధం అయింది. జీహెచ్‌ఎంసీ గ్రౌండ్‌లో మంచి ఊపుమీదున్న కారు స్పీడును తట్టుకోవాలంటే బీజేపీ చాలా శ్రమించాల్సి ఉంటుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మేయర్‌ పీఠాన్ని గెలుచుకోవాలంటే 100మంది సభ్యుల బలం కావాలి. ఎక్స్‌అఫీషియో సభ్యులు సహా మొత్తం 199 స్థానాలు ఉండగా, బల్దియాపై జెండా ఎగురవేసేందుకు 100మంది సభ్యులు కావాలి. అధికార టీఆర్‌ఎస్‌కు ఎక్స్‌అఫీషియోల బలం ఎక్కువగా ఉంది. దీంతో టీఆర్ఎస్ మేయర్‌ పీఠాన్ని సులభంగా దక్కింంచుకోగలదు. ఎక్స్‌అఫీషియో సభ్యుల బలం లేకపోవడంతో బీజేపీకి ఈ ఎన్నికలు పెద్ద సవాలుగా మారాయి.

జీహెచ్‌ఎంసీ పాలకమండలిలో 150మంది కార్పొరేటర్లు, 49మంది ఎక్స్‌అఫీషియో సభ్యులు కలిపి మొత్తం 199మంది సభ్యులున్నారు. ఇందులో మెజారిటీ సభ్యులు బలపర్చిన వ్యక్తే మేయర్‌గా ఎన్నికవుతారు. 150మంది కార్పొరేటర్లను ప్రజలు ఎన్నుకోవాల్సి ఉండగా, మిగిలిన 49మంది ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. ఎక్స్‌అఫీషియో సభ్యుల్లో పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు ఉంటారు. ఈ ఎక్స్‌అఫీషియో సభ్యుల్లో అధికార టీఆర్‌ఎస్‌కు సంబంధించి 33మంది సభ్యులు ఉండగా, మజ్లిస్‌ నుంచి 10మంది సభ్యులు ఉన్నారు. బీజేపీ నుంచి ముగ్గురు, కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు మాత్రమే ఎక్స్‌అఫీషియో సభ్యులు ఉన్నారు. మేయర్‌ పీఠం కోసం 100మంది సభ్యులు అవసరం కాగా, టీఆర్‌ఎస్‌కు 33 మంది ఎక్స్‌అఫీషియో సభ్యుల బలం ఉంది. ఇక 67మంది కార్పొరేటర్ స్థానాలను సాధించుకుంటే టీఆర్ఎస్ మేయర్‌ పీఠాన్ని దక్కించుకుంటుంది. ఒకవేళ ఇప్పటిలాగే మజ్లిస్‌ మిత్రపక్షంగా కొనసాగితే టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ రెండు పార్టీలు కలిసి 57కార్పొరేటర్‌ స్థానాలు గెలుచుకుంటే సరిపోతుంది. గత బల్దియా ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 99, మజ్లిస్‌ పార్టీ 44కార్పొరేటర్లను గెలుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు అవగాహనతో దిగితే 57 కార్పొరేటర్ స్థానాలను ఈజీగా గెలుచుకోవచ్చు. ఈ విధంగా టీఆర్‌ఎస్‌కు ఈసారి విజయం నల్లేరుపై నడకనే చెప్పవచ్చు.

బీజెపీ, కాంగ్రెస్‌ ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వాలంటే పక్కా ప్రణాళికతో ఎన్నికల్లో ముందుకెళ్లాలి. ఈ ఆరేళ్లలో టీఆర్ఎస్ కు సంబంధించిన వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు చేరువ కావాల్సి ఉంది. ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో లోపాలను ప్రజలకు వివరించాల్సి ఉంటుంది. ఎక్కువ కాలయాపన చేయకుండా బీజీపీ రంగంలోకి దిగితే బల్దియా ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వవచ్చు. గత ఎన్నికల్లో 150 స్థానాలకుగాను కాంగ్రెస్‌ రెండు, బీజేపీ నాలుగు, టీడీపీ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. అలాగే, ఎక్స్‌అఫీషియో సభ్యుల బలం కూడా ఈ రెండు పార్టీలకు నామమాత్రంగానే ఉంది. బీజేపీకి ముగ్గురు, కాంగ్రెస్‌కు ఇద్దరు మాత్రమే ఎక్స్‌అఫీషియో సభ్యులు ఉన్నారు. దీన్నిబట్టి బీజేపీ సొంతంగా మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవాలంటే 97, అలాగే, కాంగ్రెస్‌ సొంతంగా మేయర్‌ పీఠాన్ని గెలుచుకునేందుకు 98కార్పొరేటర్‌ స్థానాలను గెలుచుకోవాల్సి ఉంటుంది.