తెలంగాణ రాష్ట్రం మొత్తంలో జీహెచ్‌ఎంసీకి ఉన్న ప్రత్యేకతే వేరు. ప్రస్తుతం బల్దియాకు ఎన్నికల నగారా మోగింది.

ఖజానా సిటీది… ఖర్చుకేమో పైసలు కరవు

– బల్దియాపై చిన్నచూపు
– బడ్జెట్‌లో అరకొర కేటాయింపులు
– జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బందులు
– నిధులు రాబట్టడంలో బొంతు రామ్మోహన్ విఫలం

తెలంగాణ రాష్ట్రం మొత్తంలో జీహెచ్‌ఎంసీకి ఉన్న ప్రత్యేకతే వేరు. ప్రస్తుతం బల్దియాకు ఎన్నికల నగారా మోగింది. అన్ని పార్టీలు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు పోటీపడుతున్నాయి. కానీ గ్రేటర్ కు బడ్జెట్ కేటాయింపు విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. రాష్ట్రానికి హైదరాబాద్ ఖజానా గని. టీఎస్ కు ఐకాన్ సింబల్ గా ఉండే హైదరాబాద్‌ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. జీహెచ్‌ఎంసీ నిత్యం ఆర్థిక కష్టాలతో కొట్టు మిట్టాడుతోంది. రోజు వారీ ఖర్చులకు కూడా జేబులు తడుముకోవాల్సిన పరిస్థితి. తలకు మించిన భారాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది బల్దియా. పరిపాలన నిర్వహణలో రోజుకు కోటి రూపాయల లోటుతో బల్దియా బండి నడుస్తోంది. పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతో జీహెచ్ఎంసీలో పాలన సాగుతోంది. సర్కారు నుంచి రావాల్సిన నిధుల్ని గ్రేటర్ రాబట్టుకోలేకపోతోంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి జీహెచ్‌ఎంసీకి హక్కుగా రావాల్సిన నిధుల్ని సాధించడంలో ప్రస్తుత మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తో పాటు పాలక వర్గం మొత్తం పూర్తిగా విఫలమైంది.
ఇటీవల రాష్ట్ర బడ్జెట్‌లో జీహెచ్‌ఎంసీకి మొండి చేయి చూపిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ అభివృద్ధికి నిధులు సరిగ్గా కేటాయించలేదు. ప్రతిసారి బడ్జెట్‌లోనూ బల్దియాకు నిరాశే. జీహెచ్‌ఎంసీ చేపట్టిన భారీ ప్రాజెక్టులకు ఒక పైసా కూడా విదల్చలేదు ప్రభుత్వం. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి(ఎస్‌ఆర్‌డీపీ) కోసం జీహెచ్‌ఎంసీ అప్పులు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు చేయలేదు. అప్పుల ఊబిలో చిక్కుకున్న బల్దియాకు ఆసరాగా నిలవాల్సిన ప్రభుత్వమే పట్టించుకోకపోతే ఎలా?

70 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచే ..

జీహెచ్‌ఎంసీకి ప్రధాన ఆదాయ వనరులు ఆస్తి, వాణిజ్య పన్నులే. ట్రేడ్‌ లైసెన్సులు, ప్రకటనల ద్వారా కూడా కొంత ఆదాయం సమకూరుతుంది. వీటితో పాటు ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించిన నిధులు వస్తాయి. కేంద్రం స్మార్ట్‌ సిటీ వంటి పథకాల కింద ఇచ్చే నిధులను నేరుగా జీహెచ్‌ఎంసీకి ఇస్తుంది. హౌజింగ్‌ వంటి స్కీముల్లో రాష్ట్ర ప్రభుత్వానికి మంజూరు చేస్తుంది. వాటిని రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్‌ఎంసీకి ఇవ్వాల్సి ఉంటుంది. సాధారంగా రూ.1500 కోట్లు ప్రాపర్టీ ట్యాక్స్‌ ద్వారా, పట్టణ ప్రణాళిక విభాగం ద్వారా రూ. 650 కోట్లు, స్టాంప్‌ డ్యూటీ ద్వారా రూ.300 నుంచి 350 కోట్లు వస్తుంది. ఇలా వచ్చే వాటిలో జీహెచ్‌ఎంసీ 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ. 6,150 కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇక నెలవారీగా జీహెచ్‌ఎంసీ ఖర్చులు చూస్తే 40 శాతం రాబడి జీతాల కోసమే పోతోంది. పెన్షనర్లకు రూ.60 కోట్లు, రెగ్యులర్‌ ఉద్యోగులకు రూ. 50 కోట్లు,పారిశుధ్య సిబ్బందికి రూ.35 కోట్లు ఇవ్వాలి. నగరంలోని వీధి దీపాలు, కార్యాలయాల నిర్వహణలో భాగంగా కరెంటు బిల్లు కోసమే నెలకు రూ.15 కోట్లు చెల్లించాలి. ప్రతి రెండు వారాలకు ఓ సారి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. నెల తిరిగే సరికి రూ.200 కోట్లు ఆదాయం వస్తేనే ఖర్చులకు ఇబ్బంది ఉండదు. ప్రసుత్తం నెలకు రూ.147 కోట్లు అవసరం పడుతుందని, కానీ రూ.110 కోట్లు మాత్రమే వస్తోందని స్వయంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర ఆదాయంలో 70 శాతం హైదరాబాద్ నుంచే వస్తోంది. నగర అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. జీహెచ్‌ఎంసీ కోసం మొత్తం రూ.25.33 కోట్లు బడ్జెట్‌లో కేటాయించింది. ఇందులో జీత భత్యాలకు రూ.5.23 కోట్లు, ప్రొఫెషనల్‌, ప్రాపర్టీ ట్యాక్స్‌ కింద రూ.10 కోట్లు, మోటారు వెహికిల్‌ ట్యాక్స్‌ రూ.10 లక్షలు బడ్జెట్‌లో పేర్కొంది. అప్పుల ఊబిలో చిక్కుకున్న బడ్జెట్‌లో కనీసం ఈసారైనా ఊరట లభిస్తుందనుకున్నారు. కానీ బడ్జెట్‌లో కేటాయింపులు చూస్తే విస్తుపోవాలి. గతేడాది చాలా తక్కువగా రూ.69 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ సారి ఆ మాత్రం కూడా కేటాయించకుండా రూ.25.33 కోట్లతో సరిపెట్టింది.

 

అప్పుల పాలు అవ్వాల్సిందేనా?
ఆదాయ, వ్యయాలు సమానమై జీహెచ్ఎంసీ చాలా ఇబ్బందలు ఎదుర్కొంటోంది. భారీగా కూడబెట్టిన డిపాజిటన్నీ కరిగిపోయాయి. ఇప్పుడు ఆర్థిక కష్టాలతో గ్రేటర్ కొట్టు మిట్టాడుతోంది. బల్దియా ఖజానా మొత్తం ఖాళీ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఏదైనా భారీ ప్రాజెక్టు చేపట్టాలంటే చాలా ఆలోచించాల్సిన పరిస్థితి. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చెబుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఆచరణలో మాత్రం మరో రకంగా ప్రవర్తిస్తుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాలంటే చాలా కష్టంగా ఉంది. ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌ బ్రిడ్జీలు, రోడ్ల నిర్మాణం వంటి భారీ ప్రాజెక్టుల చేపట్టేందుకు జీహెచ్ఎంసీ ముందడుగు వేసినా.. నిధులు లేక అగచాట్లు పడుతోంది. అభివృద్ధి పథకాలు చేపట్టాలంటున్న రాష్ట్ర సర్కారేమో నిధుల విషయంలో మాత్రం అసలు పట్టించుకోవడం లేదు. మొత్తం భారం జీహెచ్‌ఎంసీపైనే వేస్తోంది. బడ్జెట్‌లో కేటాయింపుల్లో ప్రాధాన్యత అసలుకే లేదు.

అప్పు భారం పెరిపోతుంది..
బాండ్ల ద్వారా మొత్తం రూ.1000 కోట్లు నిధులు సేకరించాలని జీహెచ్‌ఎంసీ గతంలోనే ప్రణాళికలు రచించింది. బాండ్ల ద్వారా అప్పులు సేకరించడం ద్వారా గతేడాది ఫిబ్రవరిలో రూ.200 కోట్లు, ఆగస్టులో రూ.195 కోట్లు అప్పు చేశారు. ఇందులో మొదటి రూ.200 కోట్లకు 8.9 శాతం, రెండో సారి తెచ్చిన రూ.195 కోట్లకు 9.38 శాతం వడ్డీని చెల్లిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ రాబడి నుంచి ఆరు నెలలకు ఓ సారి రూ.18 కోట్లు వడ్డీ కోత పడుతోంది. ఇప్పటికే రూ.395 కోట్లు సేకరించింది. మరో రూ.305 కోట్లు సేకరించాలని నిర్ణయించింది. వీటితో మొత్తం బాండ్ల ద్వారా సేకరించిన అప్పు రూ.700 కోట్లకు చేరుతుందని భావించింది. కానీ ఇటీవల బిడ్డింగ్‌ వెళ్లగా ఆర్థిక మందగమనంతో పెట్టుబడిదారులు ముందుకురాలేదు. వడ్డీ అధికమవుతుందని భావించిన జీహెచ్‌ఎంసీ అధికారులు కేవలం రూ.100 కోట్లు అప్పుగా తీసుకున్నారు. భారీ ప్రాజెక్టులు చేపట్టాలంటున్న సర్కారు నిధుల కేటాయింపు విషయంలో మాత్రం నిర్లక్ష్యం చూపుతుందని జీహెచ్ఎంసీ అధికారులు ఆవేదన చెందుతున్నారు.

జీతాలు ఇవ్వడానికి కూడా కష్టాలు…
జీహెచ్‌ఎంసీ పరిపాలనలో భాగంగా పెద్ద మొత్తంలో నిధులు అవసరం. కానీ బల్దియా ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసంతో పనులు ముందుకు సాగడం లేదు. సాధారణ పరిపాలనకు కూడా సరిపడా నిధులు లేక అవస్థలు పడుతోంది. జీహెచ్‌ఎంసీ పరిపాలన కోసం నెలకు రూ.147 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. కానీ ప్రస్తుతం వివిధ మార్గాల ద్వారా రూ.110 కోట్లు ఆదాయం వస్తుంది. ప్రతి నెలా రూ.37 కోట్లు నిధులు లోటు ఏర్పడుతోంది. జీహెచ్‌ఎంసీ సిబ్బందిని సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి కూడా కష్టాలు పడుతోంది. జీతాలు ఇవ్వడానికీ ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదైనా నూతన కార్యక్రమం చేపట్టాలంటే పైసల్లేక బాధపడుతోంది. జీహెచ్‌ఎంసీకి భారీ ఆదాయ మార్గాలున్నప్పటికీ అలసత్వం, అవినీతి, ప్రభుత్వ నిధులు రాకపోవడమే కష్టాలకు కారణం.

 

కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నారు…
రోడ్ల నిర్మాణం కోసం ఏటా రూ.500 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. నాసిరకం రోడ్లు వేసినప్పటికీ పట్టించుకోకుండా కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నారు. దెబ్బ తిన్న రోడ్ల మరమ్మతుల భారం కూడా మోస్తోంది. పెద్దల ఇష్టారాజ్యంగా పెద్దఎత్తున జీతాలు ఇస్తూ అవుట్‌సోర్స్‌ ఉద్యోగాలు ఇస్తుండటంతో జీహెచ్‌ఎంసీ కొందరికి పునరావాస కేంద్రంగా మారింది. కార్మికుల నకిలీ హాజరు చూపిన సూపర్‌వైజర్ల కుంభకోణం బయటపడినా చర్యలు శూన్యం. ఉద్యోగులు లేకపోయినా ఉన్నట్టు చూపించడం ద్వారా కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఈ వ్యవహారం కూడా అటకెక్కింది. ఇలా అవినీతి, పాలన వైఫల్యాలతో అక్రమాలకు అడ్డాగా మారిన జీహెచ్‌ఎంసీ ఆర్థికంగా బలోపేతం కావాలనుకోవడం కూడా అత్యాశగానే మిగిలిపోతోంది.

 

బొంతు రామ్మోహన్ విఫలం
లోటు మేరకు నిధులు సేకరించుకునేందుకు జీహెచ్‌ఎంసీ ప్రయత్నించడం లేదు. ప్రభుత్వం నుంచి నిధులు సేకరించుకునేందుకు ప్రయత్నిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ పాలక పక్షానికి పట్టింపు లేకుండా పోయింది. మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో పాటు పాలక వర్గం పెద్దలెవరూ ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల గురించి ఆలోచించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీయే బల్దియాలోనూ అధికార పక్షంగా ఉండటంతో అడగలేకపోతున్నారని విమర్శలు ఉన్నాయి. హక్కుగా రావాల్సిన నిధుల గురించి అడగడానికి మొహమాటమేంటని నిలదీస్తున్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలను ఆచరణలో పెట్టేందుకు జీహెచ్‌ఎంసీ పరితపిస్తోంది. ఎస్‌ఆర్‌డీపీ వంటి ప్రాజెక్టుల్ని అప్పులు చేసి మరీ చేపట్టాల్సిన అవసరమేంటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం పైసా విదల్చకుండా సంబంధం లేని ప్రాజెక్టుల్ని నెత్తిపై మోపుతుంటే ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడం కష్టమే.

బడ్జెట్‌లో జీహెచ్‌ఎంసీకి కేటాయించిన నిధులపై బల్దియాలోని ఓ అధికారిని మైఇండ్ మీడియా సంప్రదించింది. ఆయన తీవ్ర అసతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ సహకారం లేకపోతే పనులు ముందుకు సాగడం కష్టమేనని పేర్కొన్నారు. గతంలో వందల కోట్లు కేటాయించినా ఇప్పటికీ ఇవ్వలేదని.. ఇప్పుడు పాతిక కోట్లు కేటాయించినా ఇస్తారనే నమ్మకం లేదని చెప్పారు. ఎలాగో ఇవ్వని నిధులను ఎన్ని కేటాయిస్తే ఏం లాభంలే అని అసహనం వ్యక్తం చేశారు. ఇక వాటర్‌ బోర్డుకు రూ.8.25 కోట్లు
జల మండలి అప్పులు తీర్చడానికి రూ.8.25 కోట్లు అప్పుగా ఇవ్వనున్నట్టు ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొంది. కులీకుతుబ్‌షా అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి రూ.5.9 కోట్లు కేటాయించారు. జీహెచ్ఎంసీకి చట్టబద్ధంగా కేటాయించాల్సిన వాటాను బడ్జెట్‌లో పేర్కొనకపోవడంపై కార్మిక సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సిటీకి చెందిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు.

ప్రస్తుత బల్దియా బడ్జెట్ ప్రతిపాదన ఇలా ..

ఏటికేడాది అధికంగా ఉండే జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ రాబోయే (2021– 22) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తగ్గించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ రూ.6,973.64 కోట్లు కాగా, కొత్త బడ్జెట్‌ను రూ.5,600 కోట్లకు కుదించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయంలో ఆస్తిపన్ను అంచనా రూ.1,850 కోట్లు కాగా, అప్పులు రూ.1,224.51 కోట్లు. అసైన్డ్‌ రెవెన్యూ ఆదాయంగా రూ.652.10 కోట్లు ప్రతిపాదించారు. బీఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కారానికి హైకోర్టు ఆదేశం అవసరం కావడంతో వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని పెద్దగా చూపలేదు. 2020– 21 ఆర్థిక సంవత్సరానికి జీహెచ్‌ఎంసీ నిధులకు సంబంధించిన రూ.5,380 కోట్ల బడ్జెట్‌ను రూ.5,500 కోట్లుగా సవరిస్తూ ప్రతిపాదించారు. కొత్త బడ్జెట్‌ (2021–22)ను డిసెంబర్‌ 10వ తేదీలోగా స్టాండింగ్‌ కమిటీ ఆమోదించి 15వ తేదీలోగా పాలకమండలి ముందు ఉంచాలి. 2021 జనవరి 10వ తేదీలోగా జనరల్‌ బాడీ సమావేశంలో సమీక్షించాలి. ఫిబ్రవరి 20వ తేదీలోగా కార్పొరేషన్‌ ఆమోదించాల్సి ఉంటుంది. అనంతరం 2021 మార్చి 7వ తేదీ వరకు ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది.

ఎస్లాబ్లిష్‌మెంట్‌… 1226.91
నిర్వహణ ఖర్చులు… 905.30
ఇతర రెవెన్యూ ఖర్చులు… 281.79
రోడ్లు, పేవ్‌మెంట్లు…. 1582.51
భూమి, భూ అభివృద్ధి…. 445.19
వరద కాలువలు…. 170.00
గ్రీన్‌బడ్జెట్… ‌ 560.00
వాటర్‌ సప్లై, సివరేజీ… 131.87
ఇతర క్యాపిటల్‌ ఖర్చులు 296.43