డ్రాగ‌న్ కంట్రీపై అగ్రరాజ్యం క‌న్నెర్ర‌

ప్ర‌పంచానికి క‌రోనా అంటించింది చైనానే – డ్రాగ‌న్ కంట్రీపై అగ్రరాజ్యం క‌న్నెర్ర‌

– 2022లో బీజింగ్‌లో ఒలింపిక్స్‌ గేమ్స్ జరగకుండా ఆపే ప్రయత్నాలు

ప్రపంచానికి కరోనా వైరస్ ను పరిచయం చేసింది చైనానే అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. చైనా చేసిన త‌ప్పు వ‌ల్లే వైర‌స్ వ్యాపించింద‌న్నారు. ఇందుకు చైనా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేన‌ని ట్రంప్ మండిపడ్డారు. ఈ మేర‌కు ట్విట్టర్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు.

ట్రంప్ క‌రోనా బారిన ప‌డి బయటపడిన విష‌యం తెలిసిందే. తనకు వైద్యం అందించిన‌ సిబ్బందిని ట్రంప్ అభినందించారు. తాను హాస్పిటల్‌లో నాలుగు రోజులు గడిపానని, తక్కువ స‌మ‌యంలో కోలుకున్నాననీ తెలిపారు. హాస్పిటల్‌లో రెజెనెరాన్ అనే మందును ఇచ్చారని, దాన్ని తీసుకున్న వెంటనే మంచి రిలీఫ్ అనిపించిందన్నారు… త్వరలోనే ఓ మంచి వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాబోతుందని ప్రకటించారు ట్రంప్.

వైరస్‌కు కారణమైన చైనా తీరుపై ట్రంప్ విరుచుకుపడ్డారు. ఇలాంటి పరిస్థితి రావడానికి ప్రజల తప్పేమీ లేదని ఇదంతా చైనా తప్పిదమేనన్నారు. ప్రపంచ‌మంతా ఈ పరిస్థితి ఎదుర్కోవడానికి కారణమైన చైనా రానున్న రోజుల్లో భారీ మూల్యం చెల్లించక తప్పద‌న్నారు. అంతేకాదు కరోనా మూలాలపై అమెరికా విదేశాంగ వ్యవహారాల కమిటీ చాలా విష‌యాలు బ‌య‌ట‌పెట్టింది. కరోనా వైరస్ విష‌యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చైనా చాలా అబద్దాలు చెప్పిందని పేర్కొంది. డబ్ల్యూహెచ్‌వో కూడా ఈ విషయాన్ని దాచిందని కమిటీ సభ్యుడు బ్రెయిన్‌ మాస్ట్ తెలిపారు. కరోనా వైరస్‌ నియంత్రణలో చైనా సరిగా వ్యవహరించకపోవడం, పాదర్శకంగా ఉండకపోవడంతోనే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయార‌ని పేర్కొంది. కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వ‌చ్చింద‌ని, ప్ర‌పంచ‌ ఆర్థికవ్యవస్థ అత‌లాకుత‌లమైంద‌ని తెలిపింది.

ఇక ఇలాంటి ప్రవర్తన చైనాకు కొత్తేమి కాదు, ఇన్ఫ‌ర్మేష‌న్ ను తారుమారు చేసి తప్పుదారి పట్టించడంలో చైనాకు సాటిలేరు. చైనా చేసిన నేరాలకు ఆ దేశాన్ని క‌చ్చితంగా జవాబుదారీగా ఉంచుతాం అంటూ కమిటీ స్పష్టం చేసింది. అలాగే హాంగ్‌కాంగ్, టిబెట్‌తో పాటు వీగర్‌ ముస్లింలపై చైనా చేస్తోన్న దాడులపై కూడా అగ్ర‌రాజ్యం ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. ఇక 2022లో బీజింగ్‌లో ఒలింపిక్స్‌ గేమ్స్ జ‌ర‌గ‌కుండా చూడాలనే వాదన కూడా మొదలైంది. ఇందుకోసం అగ్ర‌రాజ్యం అన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తో పాటు, ఆ దేశ విదేశాంగశాఖ కార్యదర్శి మైక్‌ పాంపియో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న చైనా వ్యతిరేక శక్తులను ఏకంచేసే పనిలో ప‌డ్డారు. మొత్తానికి డ్రాగ‌న్ కంట్రీకి అగ్ర‌దేశం బుద్ది చెప్ప‌నుంద‌ని అర్థ‌మ‌వుతోంది. ప్ర‌తి విష‌యంలో తోక జాడిస్తున్న చైనాకు త‌గిన గుణ‌పాఠం చెప్పాల‌ని భార‌త్ తో పాటు ప్ర‌పంచ దేశాల‌న్నీ అనుకుంటున్నాయి.