పాకిస్తాన్‌ పత్రికలో భారత జర్నలిస్ట్ కథనం – భారత వ్యవస్థనే ప్రశ్నించిన వ్యాసం !

శేఖర్ గుప్తా లాంటి అనేక మంది టాప్ జర్నలిస్టులు పాశ్చాత్య మీడియాతో చేతులు కలిపి భారత దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేయటం కొన్ని దశాబ్దాలుగా సాగుతోందనే విషయం మన అందరికీ తెలుసు. ఇప్పుడు మరో కొత్త పోకడ వెలుగు చూస్తున్నది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అవసరాల దృష్ట్యా పనిచేసే కొంతమంది జర్నలిస్టులు తయారవుతున్నారని నిన్నటి పాకిస్తాన్ పత్రికలో భారతదేశానికి చెందిన ఒక జర్నలిస్టు రాసిన వ్యాసం మనకు అర్థం చేయిస్తున్నది.

డాన్‌ పత్రికలో హథ్రాస్‌పై కథనం :

ది ప్రింట్ పత్రికలో శేఖర్ గుప్తా తో పాటు పనిచేసే శివం విజ్ అనే జర్నలిస్టు 2 రోజుల క్రితం పాకిస్థాన్‌కు చెందిన డాన్ పత్రికలో ఉత్తరప్రదేశ్ లోని హథ్రాస్ అత్యాచార ఘటనకు సంబంధించిన విషయాలు రాశాడు. ఎంత విద్వేషంతో తెగించి రాసాడు అంటే.. భారత్‌లో ఉన్నత కులస్తులు.. దళిత హిందూ మహిళలపై అత్యాచారం చేసే హక్కు ఉన్నదని భావిస్తున్నారని రాశాడు. 2019 సంవత్సరం ఎన్నికల సమయంలో హిందుత్వ శక్తుల ఏకీకరణను లౌకికవాద పరిరక్షణకు విచ్ఛిన్నం చేయాలని తీవ్రంగా వాదించాడు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఆ దాడిలో చనిపోయిన భారతీయ సైనికుల వివరాలు కులాలవారీగా ప్రస్తావిస్తూ పాకిస్తాన్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఆ ప్రచారం భారతదేశానికి ఇబ్బంది కలిగిస్తుంది అని భావించింది. కానీ, అది జరగలేదు.

పాకిస్తాన్‌కు ప్రయోజనం కలిగేలా వ్యాసం :

ఇప్పుడు భారత్‌లో దళిత మహిళలపై లైంగిక అత్యాచారం జరుగుతున్నదని వార్తా పత్రికలో మనదేశానికి చెందిన జర్నలిస్ట్ రాసి పాకిస్థాన్‌కు సహకరిస్తున్నాడు. భారతదేశ రాజకీయాలలో కొన్ని వర్గాల ప్రయోజనాల కోసం హిందువుల మధ్య ఘర్షణ నిర్మాణం చేయాలని ఉద్దేశం. పాకిస్తాన్‌లో హిందువులపై జరిగే హత్యాకాండను కప్పి పుచ్చుకొనేందుకు ఇటువంటి వార్తలు పాకిస్తాన్‌కు ఉపయోగపడతాయి. అట్లాగే భారతదేశంపై ఎదురు దాడి చేసేందుకు అవకాశాలు కలిపిస్తాయి. అదే ఒక ముస్లిం ఈ హత్యాచారానికి పాల్పడి ఉన్నట్లయితే, ఈ దేశ రాజకీయ నాయకులు మీడియా ఇంత ప్రాధాన్యత ఇచ్చేదా? అన్నది అందరినీ తొలుస్తున్న ప్రశ్న.

పాకిస్తాన్‌లో అరాచకాలపై కలం ఎక్కుపెట్టగలరా?

పాకిస్తాన్‌లో ఇస్లాం ఉగ్రవాదులు ఉన్నచోట హిందువుల పైన ఇతర మైనారిటీలపై దాడులు, ఆడపిల్లలను బలవంతంగా ఎత్తుకొని పోవడం, మతం మార్చడం, వివాహాలు చేయడం ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. అక్కడ అవి సర్వసాధారణమైనా ఇటువంటి వాటిని పాకిస్థాన్ మీడియా ప్రశ్నించకపోవటం పక్కనబెడితే శివంవిజ్ లాంటి భారత జర్నలిస్టులు ప్రశ్నించగలుగుతున్నారా? భారతదేశాన్ని అపఖ్యాతిపాలు చేయాలని భారత ప్రయోజనాలను దెబ్బతీయాలని శివం విజ్ ఈ వ్యాసం రాశాడు.. అనటంలో ఎటువంటి సందేహం లేదు. మీడియాలో కులాల మధ్య విభేదాలు, ఘర్షణలను ప్రోత్సహిస్తున్నట్లు రాయటం స్పష్టంగా కనపడుతోంది. ఇటువంటి పోకడలను సోషల్ మీడియా అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది.

– రాంపల్లి మల్లికార్జున్‌ రావు (సామాజిక, రాజకీయ విశ్లేషకులు)