జీతాన్ని పొదుపు చేసి ఆదాయాన్ని పెంచుకున్న మోదీ – ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆస్తుల వివ‌రాల వెల్ల‌డి – బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లకే మొగ్గు చూపిన‌ మోదీ – పొదుపు విషయంలో జాగ్ర‌త్త‌లు పాటించిన ప్ర‌ధాని – గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే కాస్త పెరిగిన ఆదాయం

జీతాన్ని పొదుపు చేసి ఆదాయాన్ని పెంచుకున్న మోదీ

– ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆస్తుల వివ‌రాల వెల్ల‌డి
– బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లకే మొగ్గు చూపిన‌ మోదీ
– పొదుపు విషయంలో జాగ్ర‌త్త‌లు పాటించిన ప్ర‌ధాని
– గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే కాస్త పెరిగిన ఆదాయం

 

ప్రజా జీవితంలో పారదర్శకత కోసం ఆస్తుల వెల్లడి ప్రక్రియను 2004లో అటల్ బిహారి వాజ్‌పేయి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి వివిధ హోదాల్లోని రాజకీయ నేతలు వారి ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విధానాన్ని అనుస‌రిస్తున్నారు. ఆయ‌న ఆస్తుల‌ వివ‌రాలు బ‌హిర్గ‌తం చేస్తూ ఉంటారు. మోదీ కేబినెట్ లోని మంత్రులు కూడా పాటిస్తున్నారు.

ప్రధాని మోదీ చరాస్తులు 15 నెలల కాలంలో రూ.36.53 లక్షలు పెరిగాయి. మొత్తం చరాస్తుల విలువ రూ.1,39,10,260 నుంచి రూ.1,75,63,618కి చేరింది.
గాంధీనగర్ నగర్‌లో ప్ర‌ధాని కుటుంబంతో కలిపి ఇల్లు, ఒక స్థలం ఉన్నాయి. సగటు మధ్యతరగతి వ్యక్తి మాదిరిగానే తన జీతంలో ఎక్కువ భాగాన్ని బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లకే కేటాయించారు మోదీ. పొదుపు విషయంలోనూ ప్ర‌ధాని జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్ర‌ధాని జూన్‌ 30 నాటికి వ‌ర‌కు ఆయ‌నకున్న‌‌ ఆస్తులు, అప్పుల వివరాలను బహిర్గతం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్య ఆదాయ వనరు ప్రభుత్వం నుంచి పొందే రెండు లక్షల రూపాయ‌ల జీతం మాత్ర‌మే. దాన్ని ఆయ‌న‌ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టడంతో పాటు, వచ్చే వడ్డీని తిరిగి పెట్టుబడి పెట్టడం వల్ల ఆయన ఆదాయంలో వృద్ధి ఎక్కువగా కనిపిస్తోంది.

ఇక ఆయ‌న స్థిరాస్తుల్లో ఎలాంటి మార్పులేదు. కుటుంబంతో కలిపి ఆయనకు గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో ఒక ఇల్లు, స్థలం ఉన్నాయి. వాటి విలువ రూ.1.1 కోట్లు. పన్ను మినహాయింపు కోసం ప్ర‌ధాని జీవిత బీమా, నేషనల్ సేవింగ్స్‌ సర్టిఫికేట్(ఎన్‌ఎస్‌సీస్‌), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్లలలో పెట్టుబడి పెట్టారు. జూన్‌ 30 నాటికి ప్రధాని పొదుపు ఖాతాలో మొత్తం రూ.3.38లక్షలు ఉంది. ఆయన దగ్గర నగదు రూపంలో రూ. 31,450 మాత్రమే ఉన్నాయి. ఎస్‌బీఐ గాంధీ నగర్‌ బ్రాంచ్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మొత్తం గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ సారి కాస్త పెరిగింది. రూ.1,27,81,575 నుంచి రూ. 1,60,28,039కు పెరిగింది. కరోనా మహమ్మారి విజృంభించ‌డంతో తన జీతభత్యాల్లో కోత విధించుకొనేందుకు మోదీ ముందుకొచ్చిన విష‌యం తెలిసిందే.

ఇప్పటి వరకూ మోదీ ఎలాంటి రుణాలు తీసుకోలేదు. అంతేకాకుండా ఆయన పేరు మీద వాహనం కూడా లేదు. లక్షన్నర విలువ చేసే 45 గ్రాముల బరువు గల నాలుగు ఉంగరాలున్నట్టు పీఎంవో తెలిపింది. ఇక‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదాయంలో ఈ ఏడాది కాస్త తగ్గుదల కనిపించింది. షేర్ మార్కెట్‌ ప్రభావంతో అమిత్ షా నికర ఆస్తుల విలువ తగ్గిపోయింది. గతేడాది జూన్ నెలకు 32.3 కోట్ల నికర ఆస్తులు కలిగినట్లు అమిత్ షా ప్రకటించగా… ఈ ఏడాది మాత్రం వాటి నికర ఆస్తుల విలువ 28.63 కోట్లకు పడిపోయింది. వీటితో పాటు 13.56 కోట్లు విలువ చేసే స్థిరాస్తులు గుజరాత్ లోనే ఉన్నట్లు పీఎంవో పేర్కొంది. అమిత్ షాకు 15 వేల,814 నగదు ఉండగా, బ్యాంక్ బ్యాలెన్స్ 1.04 కోట్లు ఉంది. ఇక 13.47 లక్షలు విలువ చేసే ఇన్సూరెన్స్, పెన్షన్ పాలసీలు, 2.79 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, 44.47 లక్షల విలువ గల బంగారం ఉన్నట్టు పీఎంఓ వెల్లడించింది.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆస్తుల నికర విలువ గత ఏడాదితో పోలిస్తే పెద్దగా మారలేదు. 1.97 కోట్ల విలువైన చరాస్తులు, 2.97 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ వద్ద ఓ 32 రౌండ్ రివాల్వర్, 2 పైప్ గన్స్ ఉన్నాయి. ఆయన భార్య సావిత్రి సింగ్ పేర 54.41లక్షల రూపాయల విలువైన చరాస్తులు ఉన్నాయి.

బీజేపీ మాజీ అధ్యక్షుడు, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, ఆయన భార్య, ఉమ్మ‌డి కుటుంబానికి సంబంధించి ఆస్తులు 2.97 కోట్లు. సంయుక్త స్థిరాస్తులు 15.98 కోట్లు కలిగి ఉన్నట్లు ప్రకటించారు. గడ్కరీకి ఆరు వాహనాలు ఉన్నాయి. ఇక‌ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు 99.36 లక్షల విలువైన ఇల్లు ఉంది. ఆమె భర్త తరఫు ఆస్తి, వ్యవసాయ, వ్యవసాయేతర భూములతో కలిపి కేవలం 16.02 లక్షలు విలువైన ఆస్తులు మాత్రమే ఉన్నాయని తెలిపారు. సీతారామన్ తనకు కారు లేదని, ఏపీ రిజిస్ట్రేషన్‌తో ఓ బజాజ్‌ చేతక్‌ స్కూటర్ ఉందని వెల్లడించారు. ఆమెకు 19 ఏళ్ల హౌసింగ్ లోన్‌, ఒక సంవత్సరం ఓవర్‌డ్రాఫ్ట్, పదేళ్ల తనఖా రుణం ఉంది. నిర్మల చరాస్తుల విలువ 18.4 లక్షలుగా తెలిపారు.