కాషాయ కండువా కప్పుకున్నోళ్లంతా పార్టీకి బలమేనా?

రాష్ట్రంలో దుబ్బాక ఉప ఎన్నికలు రాజకీయ దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. అయితే హోరాహోరీగా జరిగిన ఆ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. దీంతో తెలంగాణ బీజేపీలో జోష్ పెరిగింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇదే ఊపును కొనసాగించాలని బీజేపీ భావిస్తోంది. ఇక బీజేపీలో చేరికలు కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో పలువురు టీఆర్ఎస్ నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. గెలుపుతో ఉత్సాహం మీదున్న బీజేపీవైపే కాంగ్రెస్ నేతలంతా చూస్తున్నారు. బీజేపీ కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ సహా టీఆర్ఎస్ అసంతృప్త నేతలందర్నీ చేర్పించుకోవాలని చూస్తోంది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీకి ఎంతోకొంత అండగా ఉన్న నేతలు కూడా బీజేపీలో చేరుతున్నారు. మరోవైపు అధికార టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలతో బీజేపీ నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నారు. వివిధ పార్టీల్లోని ముఖ్య నేతలకు కాషాయ కండువా కప్పేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. వివిధ పార్టీల్లో ముఖ్య నేతలు, అసంతృప్తులను గుర్తించి వారికి గాలం వేస్తున్నారు.

తాజాగా హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ గ్రేటర్ ఎన్నికల ఇంచార్జి భూపేందర్ యాదవ్ సమక్షంలో ఆమె పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ లో జరిగిన అన్యాయం బీజేపీలో జరగదనే నమ్మకంతో వచ్చినట్లు కార్తీక రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఇవ్వాల్సిన టికెట్ రెండు సార్లు వేరే వాళ్లకు కేటాయించిందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీ కోసం పని చేస్తానని బండ కార్తీక చెప్పారు. కచ్చితంగా గ్రేటర్ మేయర్ సీటు బీజేపీదేనని ఇతర పార్టీల నుంచి వలస వస్తున్న నేతల అభిప్రాయం. అదే మాటను బండ కార్తీక కూడా చెప్పారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, శేరిలింగంపల్లి ఇంచార్జ్ రవికుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. వారు తమ అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. భిక్షపతి యాదవ్, రవికుమార్ యాదవ్ ను బుజ్జగించేందుకు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఇతర కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగి బుజ్జగించినా ఫలితం లేకపోయింది.

ఇటీవల మైలార్ దేవ్ పల్లి టీఆర్ఎస్ కార్పోరేటర్ శ్రీనివాస్ రెడ్డి, తోకల శ్రీశైలం రెడ్డి తదితర టీఆర్ఎస్ నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. డీకే అరుణ, జితేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావు, సామ రంగారెడ్డి తదితరుల ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీలో చేరారు.

అలాగే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు కొప్పుల నర్సింహారెడ్డి కాంగ్రెస్ ను వీడి.. కాషాయ కండువా కప్పుకోవడం చర్చనీయంశమైంది. ఈ ఊహించని పరిణామం రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారింది. రంగారెడ్డి జిల్లా బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, బీజేవైఎం జాతీయ కార్యదర్శి కాచం వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డితో కలిసి నర్సింహారెడ్డి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. నర్సింహారెడ్డికి కిషన్ రెడ్డి కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు.

గత కొన్ని రోజుల నుండి సినీ నటి విజయశాంతి బీజేపీలో చేరుతుంది అని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆమె బీజేపీలో చేరేందుకు అన్ని కసరత్తులు పూర్తయినట్లు తెలుస్తోంది. ఆమె మొదట ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తో రెండుసార్లు సమావేశమయ్యారు. ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా కొనసాగుతున్న ఆమె కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డితో ఇటీవల భేటీ అయ్యారు. అయితే సంజయ్‌తో సమావేశానికి ముందే విజయశాంతి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఢిల్లీలో సమావేశమైనట్లు తెలిసింది. అప్పటి నుండి ఆమె కేసీఆర్ మీద తన విమర్శల్లో పదును పెంచారు.

త్వరలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లేదా కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో విజయశాంతి బీజేపీ కండువా కప్పుకునే అవకాశం ఉందని సమాచారం. విజయ శాంతి చేరిక అంశం మీద బండి సంజయ్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఆమె చేరిక త్వరలోనే బీజేపీలో ఉంటుందని అన్నారు. అయితే విజయశాంతి రాజకీయ అరంగేట్రం బీజేపీతోనే చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ అదే పార్టీలోకి చేరేందుకు ఆమె ఇష్టపడుతున్నారు.

చేరికలతో బీజేపీకి ఎంత మేర లాభం…

బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి వస్తున్న వలసుల చూస్తుంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న కాంగ్రెస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలిందనిపిస్తుంది. నామినేషన్ల మొదటి రోజునే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, ఆయన కుమారుడు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకోవడం కొంత మేరకు ఆ పార్టీకి నష్టమే. పీసీసీ చీఫ్ ఉత్తమ్ సహా రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తదితరులు ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించినప్పటికీ ఆయన బెట్టువీడలేదు. వచ్చే ఎన్నికల్లో శేరిలింగంపల్లి అసెంబ్లీ టికెట్‌పై అధిష్ఠానం నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడం వల్లే ఆయన పార్టీని వీడినట్టు తెలుస్తోంది. తనకు తగిన గుర్తింపు లేకపోవడం వల్లే పార్టీని వీడినట్టు భిక్షపతి యాదవ్ స్వయంగా చెప్పారు.

అలాగే నగరానికే చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నగరంలో పట్టున్న మరో 10 మంది కాంగ్రెస్ నాయకులతో బీజేపీ మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. మరోవైపు, అభ్యర్థులకు బీఫారాలు జారీ చేసే విషయంలో ప్రొటోకాల్ పాటించలేదని హైదరాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ పార్టీపై అలకబూనారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాల ఎన్నికల కమిటీల్లో ఉన్న అంజన్ కుమార్, అభ్యర్థుల ఎంపిక కోసం జరిగిన సమావేశాలకు గైర్హాజరయ్యారు. ఆయన తనయుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు.

ఎంపీ రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు కొప్పుల నర్సింహారెడ్డి కాంగ్రెస్ ను వీడడం ఆ పార్టీకే పెద్ద నష్టమే. 2018లో జరిగిన ఎన్నికల్లో ఎల్ బి నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సుధీర్ రెడ్డి విజయం సాధించారు. అయితే ఆయన కొన్నాళ్లకు టీఆర్ఎస్ గూటికి చేరారు. అప్పటి నుంచి కొప్పుల నర్సింహారెడ్డి ఎల్ బి నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆయన రేవంత్ రెడ్డి కుడి భుజమని స్థానికంగా పేరుంది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారడం కాంగ్రెస్ పార్టీకి దెబ్బగా మారింది. ఇదిలా ఉంటే.. మన్సూరాబాద్ డివిజన్ నుంచి కొప్పుల నరసింహారెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ ఆయనకు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే మరికొందరు కాంగ్రెస్ నేతలు సైతం కొప్పుల బాటలోనే బీజేపీ గూటికి చేరుతారని ప్రచారం జరుగుతోంది.

నగర మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి బీజేపీలోకి చేరడానికి ప్రధాన కారణం ఆమే స్వయంగా చెప్పారు. తనకు కాంగ్రెసు పార్టీలో అన్యాయం జరిగిందన్నారు. ఆమె కాంగ్రెస్‌కు సర్వం ధారపోస్తే తనకు ఇవ్వాల్సిన టికెట్‌ను ఆ పార్టీ రెండు సార్లు వేరేవాళ్లకు ఇవ్వడంపై కలత చెందారు. ఈ సారి మేయర్ సీటు బీజేపీదేనని నమ్మకంతోనే ఆమె పార్టీలో చేరినట్లు తెలుస్తుంది.

ఇక బీజేపీ నేతలు పలువురు నాయకుల ఇళ్లకు వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్ మాజీ ఎంపీ, ప్రస్తుత కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర రెడ్డి నివాసానికి బండి సంజయ్ వెళ్లి చర్చలు జరిపినట్లు సమాచారం. ఇటీవల టీఆర్ఎస్ అధిష్ఠానంపై అసంతృప్త స్వరం వినిపించిన శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్‌ను కూడా బీజేపీ ముఖ్యులు కలిసినట్లు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై స్వామి గౌడ్ అసహనంతో ఉంటూ, కొంత కాలంగా టీఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్నారు. గతేడాది ఆర్టీసీ సమ్మెను నడిపిన కార్మిక నేత అశ్వత్థామ రెడ్డి ఇప్పటికే బీజేపీ నాయకులను కలిసినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పట్ల అసంతృప్తితో ఉన్న నేతలను కూడా లక్ష్యంగా చేసుకుని బీజేపీ నేతలు తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. అయితే పార్టీలో చేరిన వాళ్లంతా బీజేపీకి బలమేనా అంటే కొందరు పార్టీకి బలం కావొచ్చు.. మరికొందరేమో వాళ్ల స్వప్రయోజనాల కోసం పార్టీలోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల్లో కంఫర్ట్ లేని వాళ్లంతా కాషాయ కండువా కప్పుకుని బీజీపీలోకి రావడం ఆ పార్టీకి పెద్ద బలమేమీ కాదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.