తోక జాడిస్తే ఊరుకోబోం..!!

భారత్-చైనా మధ్య దౌత్యపరమైన చర్చలు కొన‌సాగుతూనే ఉన్నాయి. గ‌త జూన్ 15న ఇరు దేశాల సైనికులు ల‌ఢ‌క్‌లోని గ‌ల్వాన్ లోయ‌లో ప‌ర‌స్ప‌ర దాడులు చేసుకున్న‌విష‌యం తెలిసిందే. అప్ప‌టినుంచి ఇరుదేశాల మ‌ధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్ర‌మంలోనే తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో భారత ఆర్మీ చైనా పీఎల్‌ఏపై పైచేయి సాధించింది. ఒక వైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే గడిచిన మూడు వారాల్లో కీలకమైన 20కి పైగా పర్వత ప్రాంతాలను భారత సైన్యం ఆధీనంలోకి తీసుకుంది. LAC వెంబడి ప్రస్తుత పరిస్థితిని భారత్, చైనా సమీక్షిస్తూనే ఉన్నాయి. విదేశీ వ్యవహారాల ప్రతినిధుల స్థాయిలో రెండు దేశాల మధ్య చర్చలు సాగుతున్నాయి.
రెండు దేశాల సైన్యాలు మే నెల మధ్యకాలం నుంచి తూర్పు లడఖ్‌లోని పలు ప్రదేశాలలో నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఇరు దేశాలు పరిష్కారం కాని 3,488 కిమీ సరిహద్దును పర్యవేక్షించాయి. ప్రస్తుతం ఉన్న ద్వైపాక్షిక ఒప్పందం, ప్రోటోకాల్‌ల ప్రకారం ఎల్‌ఏసీ వెంట ముందస్తు, పూర్తి దళాలను విడదీసే దిశగా చర్యలు తీసుకోవడానికి రెండు దేశాల సైన్యాలు ఏడో రౌండ్ చర్చలను షెడ్యూల్ చేయడానికి కృషి చేస్తున్నాయి.

సెప్టెంబర్‌ 10న మాస్కోలో జ‌రిగిన స‌మావేశంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. ఐదు పాయింట్ల ఆధారంగా ముందుకు వెళ్లాలని అందులో నిర్ణయించారు. ఇక‌ సెప్టెంబర్‌ 21న ఆరో రౌండ్‌ కోర్‌ కమాండర్‌ స్థాయి సమావేశం జ‌రిగింది. అందులో కూడా ఐదు పాయింట్లేపైనే చ‌ర్చ సాగింది. ఆగస్టు 20న WMCC సమావేశం త‌ర్వాత‌ జరిగిన పరిణామాలపై ఇటీవ‌ల కూలంకుశంగా చ‌ర్చించారు. ఆ చర్చల్లో సరిహద్దులకు మరిన్ని దళాలు పంపకూడదనుకున్నారు. ప్ర‌స్తుత స్థితిని ఏకపక్షంగా మార్చే ప్రయత్నాలు చేయకూడదని కమాండర్లు నిర్ణయించారు. త్వరగా, పూర్తిగా దళాల ఉపసంహరణ జరిగేందుకు కృషి చేయాలని నిర్ణయించారు. ఆచరణలో అవేమీ అమలు కావట్లేదు. ఇక రెండు రోజులుగా విదేశాంగ ప్రతినిధుల స్థాయిలో చర్చలు సాగుతున్నాయి. త్వ‌ర‌లో ఏడో రౌండ్‌ కోర్‌ కమాండర్ల సమావేశం జ‌ర‌గాల్సి ఉంది. అయితే అది ఎప్పుడు నిర్వ‌హిస్తార‌నే విష‌యంపై ఇంకా స్పష్టత రాలేదు.

భారత–చైనాల మధ్య కోర్‌ కమాండర్ల స్థాయిలో ఇంత వ‌ర‌కు ఆరు దఫాలుగా చ‌ర్చ‌లు జ‌రిగాయి. LACలో ప్రస్తుతం ఎలాంటి ఘటనలు జరగటంలేదుగానీ, ఉద్రిక్తతలు కాస్త ఎక్కువే ఉన్నాయి. ఇరువైపులా చెరో 40,000మంది సైనికులు ఆయుధాల‌తో సర్వసన్నద్ధంగా వున్నారు. ఏ పక్షం నుంచి అయినా చిన్న పొరపాటు జరిగితే తీవ్ర‌మైన ఘర్షణలు చోటుచేసుకునే అవ‌కాశం ఉంది. అందువ‌ల్ల త్వ‌ర‌గా చర్చలు ఒక‌ కొలిక్కి వచ్చి సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడాలని భార‌తీయులు కోరుకుంటున్నారు.

LAC దగ్గర రెండు దేశాల మధ్య క‌చ్చితమైన సరిహద్దు లేద‌నేమాట వాస్తవం అయినా, ఎన్నో ఏళ్లుగా ఇరు సైన్యాలు గస్తీ కాస్తున్న ప్రాంతాలైతే స్పష్టంగానే ఉన్నాయి. అందువ‌ల్ల‌ పొరబాటు ప‌డే అవకాశం లేదు. అందువల్లే మన దేశం చైనాను, దాని సైన్యాన్ని తమ ప్రాంతంలోనే ఉండాల‌ని హెచ్చ‌రిస్తోంది. ప్యాంగాంగ్‌ సో, చుశాల్, గోగ్రా హాట్‌ స్ప్రింగ్స్, డెస్పాంగ్‌ ప్రాంతాల్లో చైనా సైన్యం వెంట‌నే అక్క‌డి నుంచి ఖాళీ చేసి వెళ్లాల‌ని భార‌త్ కోరుతోంది. అలా వెళ్ల‌క‌పోవ‌డానికి కార‌ణం ఏమిటో చెప్పాలంటోంది. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే డెస్పాంగ్‌ వద్ద చైనా సైన్యం ఎక్కువ‌గా భార‌త్ లోకి చొర‌బ‌డింది. సుమారు 15 కిలోమీటర్లకు పైగా చైనా సైన్యం అక్ర‌మంగా వ‌చ్చింది. కాగా ప్యాంగాంగ్‌ సో సరస్సు సమీపంలోని ఫింగర్‌–5, ఫింగర్‌–6 శిఖరాల నుంచి వైదొలగాలంటూ చైనా భార‌త్ ను కోరుతుంది. మొద‌ట మీరు ఆక్రమించిన ప్రాంతాల నుంచి వైదొలగితే త‌ర్వాత తాము వెళ్లే అంశాన్ని పరిశీలిస్తామంటున్నారు.

ఇక చైనా వెనక్కు తగ్గడానికి నిరాకరించ‌డంతో మన సైన్యం ఇటీవ‌ల‌ ప్యాంగాంగ్‌ సో సరస్సు వద్ద వున్న కైలాష్‌ రేంజ్‌ శిఖరాల్లో భాగమైన ఫింగర్‌–5, ఫింగర్‌–6 శిఖరాలపై పట్టు సాధించింది. మన సైన్యం ఈ ప్రాంతాల ద్వారా వ్యూహ్యాత్మ‌కంగా ఎన్నో ఎత్తుగ‌డ‌లు వేయొచ్చు. చైనా సైన్యం కదలిక‌ల‌న్నింటీనీ ప‌సిగ‌ట్ట‌వ‌చ్చు. పశ్చిమంవైపు వారు విస్తరించకుండా అడ్డుప‌డ‌వ‌చ్చు. కానీ చైనాకు ఇది పెద్ద స‌మ‌స్య‌గా మార‌డంతో అక్క‌డి నుంచి వెన‌క్కి వెళ్లాల‌ని పట్టుబడుతోంది. అయితే మ‌నం ఎందుకు వెన‌క్కి త‌గ్గాల‌ని మ‌న‌వాళ్ల వాద‌న‌.

ఇక‌ ఈసారి జరిగే కోర్‌ కమాండర్ల స్థాయి చర్చల్లో పురోగతి ఉంటుందనుకున్నారు. ఇప్పుడున్న సైనిక దళాల సంఖ్యను రెండు దేశాలూ పెంచకూడదనే అంశంలో గ‌త‌ కోర్‌ కమాండర్ల స్థాయి చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఈమధ్య జరిగిన ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాలనుద్దేశించి పంపిన వీడియో ప్రసంగంలో ఏవేవో క‌ల్ల‌బొల్లి మాట‌లు చెప్పారు. తాము అన్ని దేశాలతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ విభేదాలను తగ్గించుకోవాలని, వివాదాలను సామ రస్యంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నామ‌న్నారు. ఆ మాటల్లో అస‌లు నిజ‌మే లేద‌ని మ‌న‌కు తెల‌స్తూనే ఉంది. మన దేశమే కాదు, ప్రపంచమంతా ఈ విష‌యాన్ని గమనిస్తుంది.

అంతేకాదు ఇటీవ‌ల చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ ఇటీవల ఓ కథనం ప్రచురించింది. భారత్‌ వైపు నుంచి తూటాలు పేలితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయంటూ ఏవేవో రాసుకొచ్చింది. భార‌త్ సైన్యం ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తితేలా చేస్తే తమ సైనికులు కాల్పులు జరుపుతారంటూ హెచ్చ‌రించిది.
బలగాల ఉపసంహరణకు చర్చలు జరుగుతున్న సమయంలో లడఖ్ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ LAC వెంట కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని చైనాకు భారత్ గట్టి హెచ్చరిక చేసింది. ఆగస్టు 31న చైనా బలగాలు భారత సరిహద్దులోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించాయి. భారత్ గట్టిగా బదులిచ్చింది. ఎలాంటి కవ్వింపు చర్యలకు దిగకూడదని, ముందుగా బలగాలను ఉపసంహరించుకోవాలని చైనాను మ‌నదేశం కోరింది. ఇటీవ‌ల చైనా పలుమార్లు స్టేటస్ కో మార్చేందుకు ప్రయత్నించింది. అయితే, భారత బలగాలు గట్టిగా బదుల్లివ్వడంతో తోకముడిచింది.

ఇక మ‌న రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనాకు గట్టి హెచ్చరికనే చేశారు. తమ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తే మాత్రం ఊరుకునేది లేదన్నారు. తాము అన్నింటికీ సిద్ధమని డ్రాగన్ దేశాన్ని హెచ్చరించారు. ఏ ఎత్తుగ‌డ వేసినా కూడా మ‌న దేశం దాన్ని తిప్పిగొట్టేందుకు సిద్ధంగా ఉంది. చైనాకు ముకుతాడు వేసి దాని ఆగ‌డాల‌కు ఫుల్ స్టాప్ పెట్టాల‌ని భార‌త్ గ‌ట్టిగానే నిర్ణ‌యం తీసుకుంది. చ‌ర్చ‌ల శాంతికి ఒప్పుకుంటే సరి లేదని తోకజాడిస్తే ఈసారి డ్రాగన్ కు గట్టిగానే బుద్ధి చెప్పాలనుకుంటోంది డ్రాగన్.