వానపడితే అందరికీ ఆనందం ఉంటుంది. కానీ హైదరాబాద్ లో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది.

చెరువుల్ని కప్పేసి.. సిటీని పెంచేసి

వానపడితే అందరికీ ఆనందం ఉంటుంది. కానీ హైదరాబాద్ లో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. వర్షం కురిస్తే నగరవాసులు అల్లాడిపోవాల్సి వస్తుంది. చినుకు పడితే వెన్నులో వణుకు పుడుతుంది. చిన్నపాటి వర్షం కురిసినా రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. నగరం మొత్తం నదిలా తలపిస్తుంది. కాలనీలు, బస్తీలు, లోతట్టు ప్రాంతాలన్నీ రోజుల తరబడి నీటిలో ఉండాల్సిన దుస్థితి. చిన్నపాటి వర్షం పడినా అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. వాహనాలు ముందుకు కదలలేక ట్రాఫిక్ జామ్ అవుతోంది. వర్షానికి నగరం రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని సార్లు గంట ప్రయాణం 6 గంటలు పడుతుందంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం కనీసం వర్షం నీరు వెళ్లేందుకు మార్గం చూపలేకుంది. ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం చెరువులను ఆక్రమించడమే. కనుమరుగైన చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నామమాత్రమే. దీంతో చెరువుల్లోకి పోవాల్సిన నీరంతా రోడ్లపై చేరుతుంది. స్థానిక సంస్థలు, అధికార యంత్రాంగం, ప్రజల ఉమ్మడి అలసత్వంతో సిటీలోని చెరువులు ఉనికిని కోల్పోయాయి. లేక్స్‌ సిటీగా పేరు పొందిన హైదరాబాద్ లో ఇప్పుడు అసలు చెరువులే కనిపించడం లేదు.

చెరువుల్ని ఆక్రమణతో సిటీని ఎలా విస్తరించింది.. ఈ విషయంలో ప్రభుత్వం వైఫల్యాలు ఏమిటి.. ఇటీవల వరదలు వచ్చి జనాలు పడిన తీవ్ర అవస్థలు ఇలాంటి పలు విషయాలపై మైఇండ్ మీడియా ఫోకస్ పెట్టింది. మైఇండ్ మీడియా గ్రౌండ్ రిపోర్ట్ లో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.. ఆ వాస్తవాలన్నీ ప్రత్యేకంగా మీకోసం…

నిబంధనలకు విరుద్ధంగా చేపట్టే నిర్మాణాలు, ఆక్రమణలతో చెరువులు కనుమరుగవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం కురిసిన వర్షాలకు చాలా ప్రాంతాలు చెరువుల్ని తలపించిన విషయం తెలిసిందే. నెక్టార్‌గార్డెన్స్‌, ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌, ఉప్పర్‌పల్లి, ఎంఎస్‌ మక్తా, ప్రకాశ్‌ నగర్‌, బోడుప్పల్‌, సరూర్‌నగర్‌, వారాసిగూడ వర్షం ధాటికి విలవిలలాడాయి. వరద నీటిలో చిక్కుకున్న ఇళ్లల్లో ఉన్న వారిని పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

అభివృద్ధి నమూనా కరవు
నగర అభివృద్ధి నమూనాలో అధ్వానమైన విధానాలతో సిటీ మునుగుతోంది. ప్రకృతి సంపద, పర్యావరణం దెబ్బ తినడంలో పాలక వర్గాల నిర్లక్ష్యం ఎక్కువగా ఉంది. నగర పరిధిలోని చెరువు గుర్తింపు, ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణ కోసం లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీ ఏర్పాటు చేయాలని క్రితం హైకోర్టు పదేళ్ల క్రితం ఆదేశించింది. హెచ్‌ఎండీఏ కమిషనర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటయిన కమిటీ చెరువుల పరిరక్షణ, ఎఫ్‌టీఎల్‌ ఆక్రమణలు అరికట్టడం, సుందరీకరణ బాధ్యతలు నిర్వర్తించాలి. కానీ హెచ్ఎండీఏ, జీహెచ్‌ఎంసీ అధికారుల అలసత్వంతో చెరువులు విధ్వంసానికి గురయినా పట్టించుకునేనాథులు లేకుండా పోయారు.

 

హెచ్‌ఎండీఏ పరిధిలో 3132 చెరువులు, జీహెచ్‌ఎంసీ చెరువులో పరిధిలో 189 చెరువులు ఉన్నాయి. మొత్తం 3132 చెరువులకు గాను 1000 చెరువుల్ని మాత్రమే లేక్స్‌ ప్రొటెక్షన్‌ కమిటీ గుర్తించింది. ఈ వెయ్యి చెరువుల్లోనూ 224 చెరువులకు మాత్రమే కమిటీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 189 చెరువుల్లో 50 చెరువుల ఎఫ్‌టీఎల్‌ను కమిటీ గుర్తించింది. సిటీ వ్యాప్తంగా చాలా చెరువుల ఎఫ్‌టీఎల్‌ పరిధిలో భారీ బిల్డింగ్ లు వెలుస్తున్నాయి. ప్రైవేట్ సంస్థలు, వ్యక్తుల ఆక్రమణలపైనా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. చెరువులకు సంబంధించిన భూమి తమదేనంటూ కొందరు వ్యక్తులు పత్రాలు చూపిస్తూ కోర్టులో కేసులు వేస్తున్నారు. ఏళ్ల తరబడి కేసులు తేలకపోవడంతో చెరువుల పరిరక్షణ, అభివృద్ధి ముందుకు సాగడం లేదు.

నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో చెరువులలోకి వరద నీటిని తీసుకొచ్చే ఫీడర్‌ ఛానళ్లు దెబ్బ తిన్నాయి. చుట్టుపక్కల నిర్మాణాలు, నివాసాల నుంచి మురుగు నీటి ప్రవాహం మాత్రమే చెరువుల్లోకి ప్రవహిస్తోంది. దుర్గం చెరువు చుట్టూ పెద్దఎత్తున బహుళ అంతస్తుల నిర్మాణాలు వెలిశాయి. వీటి నుంచి వెలువడుతున్న వ్యర్థాలు చెరువులోకి వదులుతున్నారు. భారీ వర్షాలు పడినప్పుడు చెరువు నిండిపోయి మురుగు నీరు రోడ్లపైకి వచ్చి నిలుస్తోంది. చెరువుల అభివృద్ధి పేరిట జీహెచ్‌ఎంసీ చేపడుతున్న పనులు కూడా లేక్స్‌ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. చెరువుల్లోకి నీటి ప్రవాహాన్ని పెంచేలా చూడాల్సిన పాలక వర్గాలు చెరువు చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌లు నిర్మిస్తున్నారు. చెరువు చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌లు ఉంటే చెరువుల్లోకి నీరు ఎలా వస్తుందని ఇటీవల సేవ్‌ అవర్‌ అర్బన్‌ లేక్స్‌ ప్రతినిధి లుబ్నా సార్వత్‌ ప్రశ్నించారు. అధికారుల అనాలోచిత నిర్ణయాలు నగరాన్ని విధ్వంసానికి గురి చేస్తున్నాయని విమర్శించారు.

 

సిటీ ఎందుకు మునుగుతుందో అర్థం చేసుకోవడంలో జీహెచ్‌ఎంసీ, హెచ్ఎండీఏ విఫలమవుతున్నాయి. ఏటా మాన్‌సూన్‌ యాక్షన్‌ ప్లాన్‌ పేరిట జీహెచ్‌ఎంసీ హడావుడి చేస్తున్నప్పటికీ మౌలిక సమస్యలు పరిష్కరించకుండా పరిస్థితి మారదనే విషయం తెలుసుకోవడం లేదు. హైదరాబాద్ మహానగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దుతామని పాలక పక్షాలు ప్రణాళికలు రచిస్తున్నప్పటికీ ఈ దుస్థితికి కారణమేంటనే విషయం గుర్తించడం లేదు.

– నీరు పోయే దారేది?
గ్రేట‌ర్ ప‌రిధిలో దాదాపు వెయ్యి కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో మురికి కాలువ‌లు, వ‌ర్షపునీటి కాలువ‌లు ఉన్నాయి. వీటిలో 216 మేజ‌ర్ నాలాలు, 735 కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో పైప్‌లైన్ డ్రెయిన్‌లు, చిన్న సైజు డ్రెయిన్‌లు ఉన్నాయి. ఈ నాలాలు ఎక్కడికక్కడ ఆక్రమణకు గురయ్యాయి. ఫలితంగా నీరు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. వర్షపు నీరు రోడ్లపైనే నిలిచి ఇబ్బంది కలుగుతోంది. సిటీలో ఆక్రమణకు గురైన నాలాల్లో 840 బాటిల్ నెక్‌లు ఉన్నట్టు గుర్తించారు. వీటిలో 506 చోట్ల విస్తరణ చేపట్టారు. నాలాలు ఆక్రమించిన వారిని అక్కడి నుంచి తొలగించి, ప్రత్యామ్నాయ నివాస సదుపాయం కల్పించే ముందుకు సాగడం లేదు.

నగరంలో వర్షపు నీటి డ్రెయిన్ల సామర్థ్యం అవసరానికి సరిపడా లేవు. హైటెక్ సిటీ, పరిసర ప్రాంతాల్లో సెంటీ మీటర్ల వర్షం కురిసినా రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. ఆ ప్రాంతంలో 3 సెంటీమీటర్ల వర్షపు నీటిని తీసుకునే సామర్థ్యం కలిగిన డ్రెయిన్లు ఉన్నాయి. డ్రెయిన్లలో చెత్తా చెదారం పేరుకుపోయింది. ప్రైవేటు సంస్థలు అక్రమంగా కేబుళ్లు ఏర్పాటు చేసుకున్నాయి. ఫలితంగా నీరు వెళ్లలేక రోడ్లపైనే నిలుస్తోంది. హైటెక్‌ సిటీ ఏరియాలో రియల్‌ బూమ్‌తో బ‌ర్లకుంట‌, తుమ్మిడికుంట, దుర్గం చెరువు, పటేల్‌ చెరువు, మల్కం చెరువు, కాజాగూడ చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. చెరువులు విధ్వంసానికి గురి కావడంతో వర్షపు నీరు రోడ్లపైకి ప్రవహిస్తోంది. సిటీ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పరిస్థితి ఇలాగే ఉంది.

 

చెరువులు కనుమరుగు కావడం వల్ల భూగర్భ జలాలు కూడా పాతాళానికి పడిపోయాయి. భారీ వర్షాలను భూగర్భ జలాలుగా మార్చుకోవడంలో పర్యావరణం దెబ్బతింటోంది. వేసవిలోనే కాకుండా మామూలు సమయాల్లోనూ తాగునీటి సమస్య వేధిస్తోంది. గ్రావిటీ ద్వారా చెరువ్లోకి నీరు వెళ్లకపోవడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. సిటీ నీటి అవసరాలు తీర్చేందుకు 150 కిలో మీటర్ల దూరంలో ఉన్న గోదావరి నుంచి, 250 కిలో మీటర్ల దూరంలో ఉన్న కృష్ణా నది నుంచి నీటిని సరఫరా చేసుకోవాల్సి వస్తోంది. సిటీలో నీటి కొరతను అధిగమించేందుకు వందల కోట్ల రూపాయలు వెచ్చించి నదీ జలాల్ని నగరానికి తరలిస్తున్నారు. సిటీ అభివృద్ధి, విస్తరణకు సరైన ప్రణాళికలు లేకపోవడం, ఆచరణలో అలసత్వం కారణంగానే సమస్యలు వస్తున్నాయి. చెరువుల్ని పురుద్ధరించి, కబ్జాల్ని అరికట్టాల్సిన పాలకులు నిర్లక్ష్యం వహించే తీరు వల్లే ఈ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

ఏటా వర్షాకాలనికి మూడు నెలల ముందే కోట్ల రూపాయలతో జీహెచ్‌ఎంసీ మాన్ సూన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నప్పటికీ ఫలితం ఉండటం లేదు. ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం 87 మినీ మొబైల్ మాన్‌సూన్ టీమ్‌లు, 79 మొబైల్ మాన్సూన్ టీమ్‌లు, ఒక జోన‌ల్ ఎమ‌ర్జెన్సీ టీమ్‌, 101 స్టాటిక్ లేబ‌ర్ టీమ్‌లను ఏర్పాటు చేస్తుంటారు. న‌గ‌రంలో భారీ వ‌ర్షాల‌తో ఏర్పడే ప‌రిస్థితుల‌ను ఎదుర్కొనేందుకు కోట్లాది రూపాయలతో ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తుంటారు. హైదరాబాద్ నగరంలో వందలాది చెరువులు కనుమరుగయ్యాయి. వర్షం కురిసినప్పుడు ఆ నీరంతా ఫీడర్ ఛానళ్ల ద్వారా చెరువుల్లోకి వెళ్లాలి. కానీ నగరంలో భవన నిర్మాణాల సమయంలో ఫీడర్ ఛానళ్లు ఉనికిని కోల్పోయాయి. ఫలితంగానే చెరువులకు సమీప ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలుస్తోంది.

 

జీహెచ్‌ఎంసీ గుర్తించిన 30 ముంపు ప్రాంతాలు సిటీలోని అన్ని జోన్‌ల పరిధిలో ఉన్నాయి. హబ్సీగూడ(మోడర్న్‌ బేకరి), నాగోల్‌(ఆదర్శన్‌ నగర్‌ కాలనీ), మలక్‌పేట్‌ (ఆర్‌యూబీ), యాకుత్‌పురా(ఆర్‌యూబీ), చాంద్రాయణ్‌గుట్ట (వలీ ఫంక్షన్‌ హాల్‌), న్యూఅఫ్జల్‌ నగర్‌, దత్తాత్రేయ కాలనీ (న్యూ బైటెక్‌ రోడ్‌), కరోల్‌ బాగ్‌, టోలీ చౌకీ(హెచ్‌ఎస్‌ రెసిడెన్సీ), నదీమ్‌ కాలనీ కల్వర్ట్‌, జమాలీకుంట ఔట్‌లెట్‌, బేగంబజార్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట, రంగ్‌ మహల్‌, లేక్‌ వ్యూ గెస్ట్‌ హౌజ్‌, ఎంఎస్‌ మక్తా, బల్కంపేట్‌ ఆర్‌యూబీ, విల్లా మేరీ కాలేజీ ఎదురుగా, షేక్‌పేట్‌ ఆదిత్య టవర్‌, షేక్‌పేట్‌ వివేకానంద నగర్‌, జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 44, మాదాపూర్‌ నెక్టార్‌ గార్డెన్‌, శిల్పారామం బస్టాప్‌ ముందు, అయ్యప్ప సొసైటీ, మాదాపూర్‌ హఫీజ్‌పేట్‌ ఫ్లైఓవర్‌ దగ్గర, మాదాపూర్‌ డొమినోస్‌ రోడ్‌, నింబోలి అడ్డ, యూనివర్సల్‌ స్విమ్మింగ్‌ పూల్‌ నుంచి షిర్డీనగర్‌ వరకు, ఒలిఫంట బ్రిడ్జి, కర్బలా మైదాన్‌ సమీపంలో, రాణీగంజ్‌ బాంబే హోటల్‌ ముందు వర్షం పడినా ప్రతిసారి నీరు నిల్వ ఉంటుందని జీహెచ్‌ఎంసీ స్పష్టంచేసింది. ఈ ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం చూపలేమని తేల్చిచెప్పింది.

కొన్ని రోజుల క్రితం సెంట్రల్​ టీమ్​ నగరంలో పర్యటించింది. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పినప్పటికీ ముందస్తుగా ఎందుకు అలర్ట్​ కాలేదని రాష్ట్ర అధికారులను ప్రశ్నించింది. హైదరాబాద్​ చుట్టుపక్కల చెరువుల జాగలను కబ్జా చేస్తుంటే ఏం చేస్తున్నారని, చెరువులకు గొలుసుకట్టు ఎందుకు మిస్సయిందని నిలదీసింది. రాష్ట్రంలో వరద పరిస్థితులను తెలుసుకునేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన సెంట్రల్​ టీమ్​ కొన్ని రోజుల క్రితం హైదరాబాద్​కు వచ్చింది. ఆ టీమ్​లోని ముగ్గురు సభ్యులు హైదరాబాద్​లోని వరద ప్రాంతాల్లో, చెరువులకు గండ్లు పడ్డ ప్రాంతాల్లో పర్యటించారు. పల్లె, గుర్రం, అప్పా చెరువులను పరిశీలించారు. చెరువులపై ఉన్న నిర్మాణాలను చూసి వీటికి అనుమతులు ఎవరిచ్చారని రాష్ట్ర ఆఫీసర్లను సెంట్రల్​ టీమ్​ నిలదీసింది. నిజాం కాలంలో నిర్మించిన ఈ చెరువుల గొలుసుకట్టు ఎందుకు మిస్సయిందని, ఇట్లయితే నీరంతా ఎక్కడికి పోతుందని ప్రశ్నించింది. చెరువుల వివరాలతో పాటు ఆరేండ్లలో కబ్జాలపై తీసుకున్న చర్యలపై రిపోర్టు ఇవ్వాలని ఆఫీసర్లను ఆదేశించింది. ఇక ఇక్కడి అధికారులు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో సెంట్రల్​ టీమ్​ అసహనం వ్యక్తం చేసింది. చెరువులతో పాటు ఫలక్​నుమా, కందికల్​, హఫీజ్​ బాబానగర్ తదితర​ ప్రాంతాల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడి ఏం జరిగిందన్న విషయాలను టీమ్​ సభ్యులు తెలుసుకున్నారు. ఇప్పటికీ రోడ్లపై, ఇండ్లలోనూ నీళ్లు పేరుకుపోయి ఉన్నాయని చాంద్రాయణగుట్ట, ఫ‌‌ల‌‌క్‌‌నుమా, పూల్​బాగ్​లోని వరద బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు.

గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌లోని 185 చెరువులను పర్యవేక్షించేందుకు ఇంజనీర్లతో 15 స్పెషల్​ టీమ్​లను ఏర్పాటు చేసినట్లు ఇరిగేషన్‌‌ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ రజత్‌‌కుమార్‌‌ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఆయన చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. చెరువుల ఆక్రమణలు నివారించేందుకు 2016లో డ్రాఫ్ట్‌‌ చేసిన లేక్‌‌ ప్రొటెక్షన్‌‌ యాక్ట్‌‌ను తీసుకువస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. రజత్‌‌ కుమార్‌‌ సమాధానం ఇవ్వలేదు. చెరువులు, నాలాల ఆక్రమణలపైనా నేరుగా సమాధానం ఇవ్వలేకపోయారు. ఇరిగేషన్‌‌ ఇన్వెంటరీ ద్వారా డిపార్ట్‌‌మెంట్‌‌కు ఉన్న ఆస్తుల వివరాలన్నీ సేకరించామని, అవన్నీ డిపార్ట్‌‌మెంట్‌‌ పేరిట మ్యుటేషన్‌‌ అవుతున్నాయని చెప్పారు. గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌లో భూముల విలువలు పెరగడం, లీగల్​ లిటిగేషన్స్​ ఇతరత్రా కారణాలు ఉన్నాయని, ఆ వివరాలన్నీ సిద్ధంగా లేవని పేర్కొన్నారు. ‘గ్రేటర్‌‌లోని 185 చెరువులు నిండాయని చెప్తున్నారు.. మరి మియాపూర్‌‌లోని చెరువుల్లోకి చుక్కా నీళ్లు కూడా రాలేదు’ అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోయారు.

రాష్ట్ర సర్కార్​పై హైకోర్టు ఆగ్రహం

‘‘గొలుసు కట్టు చెరువుల లింక్‌‌లు తెగ్గొట్టేశారు. రాత్రికి రాతి చెరువులు ఇండ్ల జాగాలైనయ్. ఇప్పుడు భారీ వానలకు హైదరాబాద్‌‌ లాంటి మహానగరమే మునుగుతోంది. చెరువుల కబ్జాలు అడ్డుకొని ఉంటే రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉండేవి కావు. ఇప్పటికైనా కండ్లు తెరవండి. రాష్ట్రంలోని చెరువుల కబ్జాలు తొలగించే చర్యలు తీసుకోండి. కఠినంగా ఉండాలి. కొరడా ఝుళిపించాలి. రెవెన్యూ, ఇరిగేషన్‌‌ శాఖలు ఇప్పుడైనా కోఆర్డినేషన్​తో పనిచేయాలి. అవసరమైతే పోలీసుల్ని వెంటబెట్టుకొని వెళ్లండి. చెరువుల రక్షణకు నడుంబిగించండి. చెరువులకు నీళ్లు ఇచ్చే క్యాచ్​మెంట్ ఏరియాలు, కాలువలు, నాలాలు, కల్వర్టుల రక్షణకు చర్యలు చేపట్టాలి. వాటిపై ఆక్రమణల్ని చట్ట ప్రకారం తొలగించండి’’ అని ఇటీవల రాష్ట్ర సర్కార్​పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెరువుల కబ్జాపై సర్కార్ చర్యలు నామమాత్రంగానే ఉన్నాయని ఓ పత్రికలో వచ్చిన వార్తను హైకోర్టు సుమోటోగా తీసుకుని బుధవారం విచారించింది. చెరువుల్లో ఆక్రమణల్ని తొలగించాల్సిందేనంటూ సీఎస్​, ఇరిగేషన్‌‌, పంచాయతీరాజ్‌‌, మున్సిపల్‌‌, రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఇరిగేషన్‌‌ ఇంజినీర్‌‌ ఇన్‌‌ చీఫ్, హెచ్‌‌ఎండీఏ, జీహెచ్‌‌ఎంసీ, జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది.

మీర్​పేట్ పెద్ద చెరువు నిండితే.. ఆ నీరు మంత్రాల చెరువులోకి వెళ్తుంది. అయితే నీరు వెళ్లేందుకు ఎలాంటి కాలువలు లేకపోవడం వల్ల టీఎస్ఆర్ నగర్, ఎమ్మెల్లార్ కాలనీ, అయోధ్య నగర్, ఎస్.ఎల్.ఎస్.ఎన్.ఎస్. కాలనీ, తిరుమల ఎంక్లేవ్​, జనప్రియ మహానగర్ కాలనీల మీదుగా మంత్రాల చెరువుకు చేరుకుంటోంది. మంత్రాల చెరువు నుంచి నీరు తాళ్ల చెరువుకు వెళ్లాల్సి ఉంది. అయితే తాళ్ల చెరువు మొత్తం కబ్జాకు గురికావడంతో అటు వెళ్లాల్సిన నీరు సైతం మిథిలా నగర్ కాలనీ, సత్యసాయి నగర్, సాయి బాలాజీ నగర్​ల మీదుగా సందె చెరువులోకి వెళుతోంది. ఇటీవల కురిసిన వర్షంతో పెద్ద చెరువులోకి నీరు భారీగా చేరడం వల్ల ఈ కాలనీలన్నీ చాలా రోజులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మొత్తం 5 వేల కుటుంబాల వరదల్లో చిక్కుకోగా.. అందులో సుమారు 3 వేల ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. మీర్​పేట్ పెద్ద చెరువు విస్తీర్ణం 70 ఎకరాలు. ఇందులో సుమారు 20 ఎకరాలు కబ్జాకు గురైంది. ఇక చెరువులో శిఖం భూములు ఎఫ్​టీఎల్ పరిధిలో 35 ఎకరాలు ఉంది. అక్కడా పలువురు ఇళ్లు నిర్మించుకున్నారు. పెద్ద చెరువు కింద ఉన్న మంత్రాల చెరువు విస్తీర్ణం 40 ఎకరాలు. ఇందులో సుమారు 10 ఎకరాలు కబ్జాకు గురైంది. మంత్రాల చెరువులోని ఎఫ్​టీఎల్ పరిధిలో 15 ఎకరాల్లో ఇళ్లు నిర్మాణం చేసుకున్నారు. మంత్రాల చెరువు పక్కనున్న తాళ్ల చెరువు విస్తీర్ణం 33 ఎకరాలు. ప్రస్తుతం ఇక్కడ ఒక్క గుంట భూమి కూడా లేదు. చెరువు స్థలం 33 ఎకరాలు మొత్తం కబ్జాకు గురైంది.

హైదరాబాద్… డెక్కన్ రీజియన్ లో ఉంది. ఇక్కడ వాటర్ ఒకే డైరెక్షన్ లో రాదు. అన్ని డైరెక్షన్స్ లో ఫ్లో అవుతుంది. అందువల్లే 1908 లో మూసీ ఫ్లడ్స్ వచ్చాయి. హైదరాబాద్ లో అప్పట్లో కురిసిన భారీ వర్షాలకు15 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 80 వేల మంది రోడ్డున పడ్డారు. అప్పుడు… వరదలు వచ్చినా తట్టుకునేలా ఓ మంచి డ్రై.నేజీ సిస్టంతో కూడిన ప్లాన్ గీయమని మోక్షగుండం విశ్వేశ్వరయ్యను అడిగారు. ఆయన గీసిన ప్లాన్ ప్రకారం… రెండు రిజర్వాయర్లను కట్టించారు. అవి ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లు. 2000 సంవత్సరంలో కురిసిన భారీ వర్షాలకు… హైదరాబాద్ మళ్లీ మునిగింది. కాకపోతే ఒకప్పుడంత కాదు. ప్రాణనష్టం తగ్గింది. కానీ 2020 లో ఇంత టెక్నాలజీ ఉన్ సమయంలో ఈ మహానగరం వరదలు వస్తే ఎందుకు మునిగిపోయింది ?
1950 వ సంవత్సరంలో… హైదరాబాద్ లో 500 చెరువులుండేవి. బేసిక్ గా హైదరాబాద్ లో ఉన్న ప్రతీ లోతట్టు ప్రాంతంలో కనీసం మూడు నుంచి నాలుగు చెరువులుండేవి. కానీ… ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నవి 191 చెరువులు మాత్రమే. మరి… మిగిలిన 309 చెరువులు 309 చెరువులు ఏమయ్యాయంటే… రాజకీయ నాయకులు కబ్జాలు చేసి భవంతులు కట్టేశారు. పెరిగిన హైదరాబాద్ జనాభా వల్ల ఎంతోమంది… సమ్మర్ టైంలో ఎండిపోయిన చెరువుల్లో ఇళ్లు కట్టేసుకున్నారు. ఆ మిగిలిన 191 చెరువులు ఏమైనా బాగున్నాయా అంటే… అది కూడా లేదు. విపరీతంగా పెరిగిపోయిన జనాభా వల్ల చెత్త, ఇతరత్రా వృథాలు ఆ చెరువుల్లోకి చేరాయి. ఎండాకాలం వరకూ బాగానే ఉంటుంది. వర్షాకాలంలో… వర్షపు నీరు చెరువుల్లోకి చేరుతుంది. ఇప్పుడు మన ఇళ్లల్లోకే వచ్చేస్తున్నాయి. అంటే… హైదరాబాద్ లో చెరువులు లేవు. చెరువులున్న చోటే మనమున్నాం. మన అవసరాల కోసం చెరువులను నాశనం చేశాం. ఇప్పుడు హైదరాబాద్ బాగుపడాలంటే… చెరువుల్లో ఇళ్లు కట్టుకున్న వాళ్ళను ఖాళీ చేయించడం కుదురుతుందా ? అస్సలు కుదరదు. ఒకవేళ ఖాళీ చేయిస్తే… వాళ్ళకు వేరే చోట ఇళ్ళు కట్టించి అప్పుడు ఖాళీ చేయించాల్సి ఉంటుంది. అసలే ఖాళీ లేని హైదరాబాద్ లో మళ్లీ ఇళ్లు కట్టాలంటే… ఇంకో చెరువులోనే కట్టాలి. దీనికి ఒకటే మార్గం… నీళ్లు రోడ్ల మీద నిలవ ఉండకుండా… అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంను నిర్మించాలి. ఆ డ్రైజేజీ సిస్టం నుంచి… ఇప్పుడు వాడకంలో ఉన్న కొన్ని చెరువుల్లోకి నీళ్లు వెళ్లేలా ప్లాన్ చేయాలి.