తొలిదశలో 30కోట్లమందికి కరోనా వ్యాక్సిన్

తొలిదశలో 30కోట్లమందికి కరోనా వ్యాక్సిన్

క‌రోనా వైరస్ నియంత్ర‌ణ‌కు వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. మ‌న కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ పంపిణీకి కార్యాచరణ సిద్ధం చేసింది. తొలిదశలో ఎవరెవరికి వ్యాక్సిన్ ఇవ్వాలనే విష‌యంపై ఒక నిర్ణ‌యానికి వ‌చ్చింది. దేశంలోని 30 కోట్ల మందికి మొదట కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. వైద్య, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి మొద‌టి ప్రాధాన్యం ఇవ్వనుంది. అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

70 లక్షల మంది వైద్య, ఆరోగ్య సిబ్బంది, 2 కోట్ల మంది రక్షణ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, 26 లక్షల మందికి పైగా సాధారణ ప్రజలకు టీకా ఇవ్వ‌నున్నారు. 50 ఏళ్లకు పైబడినవారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా ఈ జాబితాలో ఉన్నారు. బూస్టర్ డోస్ తో కలిసి తొలి విడతలో 60 కోట్ల వ్యాక్సిన్ డోసులు అవసరంకానున్నాయి. నవంబర్ లో ఇందుకు సంబంధించిన జాబితా విడుద‌ల కానుంది. మొత్తానికి డిసెంబరు మొదటి వారంలో వ్యాక్సిన్‌ తొలిదశ పంపిణీ మొద‌లుకానున్న‌ట్లు స‌మాచారం.

దేశంలో కరోనా వైరస్‌ పరిస్థితి, వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రజలందరికీ వ్యాక్సిన్‌ను త్వరగా అందించేలా ఏర్పాట్లు చేయాలని ప్రధాని సూచించారు. దేశంలో మూడు వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో రెండు వ్యాక్సిన్లు రెండో దశలో ఉండగా, ఒకటి మూడో దశ ప్రయోగాల్లో ఉంది.