చిరు నవ్వుల వర్తకం

చిరునవ్వుల వర్తకం

ఆరు నెలల క్రితం ఇల్లు మారినప్పుడు అంతా కొత్త, దానికి తోడు పొద్దున ఉద్యోగానికి పోతే రాత్రి కి ఇంటికి చేరుకుంటా. దానితో ఇరుగు పొరుగు తో ముఖ పరిచయం కరువు. దానికి సాయం టీవీ సీరియల్స్ పుణ్యమాని రోడ్ల మీద మనుషులు కనిపించరు. పొద్దున్నే సొప్పు(ఆకుకూరలు కి కన్నడ నామధేయం) అనే అరుపు తో వీధిలో కి వెళ్ళా. ఒక మామ్మ తట్టలో రకరకాల ఆకుకూరలు పెట్టుకుని అమ్ముకుంటోంది. పిలిచి రెండు రకాలు తీసుకున్న చక్కగా నవ్వుతూ “అమ్మ ఈ కూర తీసుకోండి దానితో కలిపి వండు ఇవి ఇట్టే అయిపోతాయి ఇంకొంచెం కొను”, అంటూ చొరవగా హుషారుగా మాట్లాడింది. దాదాపు 6 పదుల వయసు ఉంటుంది, నేను రోజు వస్తా కొంటావా అని అడిగింది. శనివారం ఆదివారం రా అమ్మ కొంటా అన్నాను. ఓ రెండు వారాలు తర్వాత ఇవాళ మళ్ళీ ఇవాళ కనిపించింది. ఏంటమ్మా అసలు తినట్లేదా, నువ్వు కనపడలేదు నీ కోసం మొన్న గోంగూర తెచ్చా ఇప్పుడు అయిపోయింది మళ్ళా మంగళవారం తెస్తా వుంటావా? అంది. లేదమ్మ మళ్ళీ ఆదివారం తీసుకొస్తా మంచిగా తెనాలి, అంటూ నవ్వుతూ కూరలు ఇచ్చేసి వెళ్ళింది.

నిజానికి ఇలా నవ్వుతూ కలుపుగోలుగా మన చుట్టూ వుంటూ మనకి రోజు కూరలు అమ్మేవాళ్ళు, పాలు ,సరుకులు అమ్మేవారు, పువ్వులు పళ్ళు అమ్మే వాళ్ళు బోలెడు మంది. వారి జీవితం లో ఎన్ని సమస్యలు ఉన్నా నవ్వుతూ మాట్లాడి ఎదో ఇంట్లో మనిషి లాగా సలహా చెప్పి చక్కగా వారి వద్దనున్న వస్తువుల్ని మనకి అవసరం అనిపించేలా చేసి అమ్మగల సమర్ధులు. నిజానికి వీళ్ళకి అమ్మకాల లో పెట్టుబడి పోను మిగిలేది చాలా తక్కువ, కానీ మార్కెటింగ్ లో ఎంబీఏ వాళ్ళకి తీసిపోరు. కానీ మన లో చాలా మంది ఇలాంటి చిన్న వ్యాపారుల దగ్గర బేరాలు ఆడతాం, అదే సూపర్ మార్కెట్ లో షోరూం లో మెట్రో లో అయతే బిల్ తో పాటు పన్ను కట్టి డిస్కౌంట్ ల కోసం అరువులు చాస్తాం. ఏ చేద్దాం మనకంటే చిన్న వాళ్లను చూస్తే లోకువ కదా కానీ వాళ్ళకి మిగిలేది రూపాయి దాన్ని మనం బేరం ఆడి గెలిచే ప్రయత్నం చేస్తామేమో. కానీ ఈ బేరాలు బీరాలు పోయి చుట్టూ మనల్ని అభిమానించే వారిని కోల్పోతామేమో -పెమ్మరాజు అశ్విని