బైరప్ప చెప్పిందే నిజమవుతోంది

మెజార్టీ హిందువుల మనో భావాలు లెక్క చేయకుండా దేశాన్ని మత ప్రాతిపదికన విడగొట్టినప్పుడు… హిందువులతో కలసి జీవించలేం అనుకునే వాళ్ళు అటువైపు వెళ్లిపోయారు.

మతపరంగా నచ్చినట్లు ఉండేలా వేరే దేశం ఏర్పడిన తరువాత కూడా …అక్కడకు వెళ్లిపోయే అవకాశం ఇచ్చినా వెళ్లకుండా.. ఇక్కడ హిందువులతో కలసి ఉంటాం అని ఉండిపోయిన ముస్లిమ్స్ నేతలను కన్విన్స్ చేసి.. కాశీ, మధుర, అయోధ్య ఆలయాలను హిందువులకు అప్పుడే అప్పచెప్పవలసింది. సెక్యులర్ జబ్బు అంటించుకున్న నాయకులు భవిష్యత్ పరిణామాలను ఊహించలేదు. ఈ సెక్యులర్ కేన్సర్ ని దేశం మీదకు వదిలారు.

మాకు మేముగా బతకడానికి దేశాన్ని విడగొట్టి వేరే ముక్క కావాలి. ఇక్కడ మా పూర్వీకులు పురాతన ఆలయాలను ధ్వంసం చేసి వాటిపై కట్టిన మా ప్రార్ధనా స్థలాలపై కూడా హిందువులకు హక్కు లేదు. అవి కూడా మాకే కావాలి అంటే… సరే తీసుకోండి అన్నాయ్ సెక్యులర్ ప్రభుత్వాలు.

మెజార్టీలైన హిందువులకు దేశ విభజన గాయాన్ని మాన్పడానికి అప్పటి నాయకులు తీసుకున్న చర్యలేవి?
పై పెచ్చు వారి ఆలయ, విద్యా సంస్థల నిర్వహణ కూడా సెక్యులర్ ప్రభుత్వాలు లాగేసుకున్నాయి. అదీ ప్రజాస్వామ్యం లో మెజార్టీ ప్రజల మనోభావాలను గౌరవించే విధానం.

నిత్యం లక్షల మంది హిందువులు ఆయా పవిత్ర, ప్రసిద్ధ ఆలయాలను దర్శించుకుంటారు. ప్రతిసారీ ముస్లింల మీద వారికి ద్వేష భావం పెరిగిపోతుంది. ఇది ఏ విధంగా దేశ సమగ్రతకు ఉపయోగపడుతుంది?

నా చిన్నప్పుడు మధుర దేవాలయంలోకి మసీదు పక్కనుండి సన్నటి సందు గుండా లోపలికి పోయినప్పుడే ఆ భావం నాకు కలిగింది. మన ముఖ్యమైన దేవాలయాలను దర్శించుకునేందుకు కూడా ఈ ఖర్మ ఏమిటీ అనిపించింది. సోమనాధ్ దేవాలయంలాగా ఈ మూడింటిని అప్పుడే హిందువులకు అప్పచెప్పి ఉంటే అప్పటి ముస్లిం నాయకులు, సాధారణ ముస్లిమ్స్ అడ్డుచెప్పి ఉండేవారు కాదు. చాలా సమస్యలు ఉండేవి కాదు. ఎంత సేపూ 15% ప్రజల సెంటిమెంట్ గురించి ఆలోచించారు గాని 80శాతంగా ఉన్న మెజార్టీల సెంటిమెంట్ గురించి ఒక్కరూ ఒక్కసారైనా ఆలోచించలేదు.

మొఘల్ పాలకుల దారుణాలు పాఠ్య పుస్తకాలలో రాయడం వల్ల దేశ సమగ్రత దెబ్బతింటుంది అని.. విద్యార్థులకు సెక్యులర్ పాఠాలు బోధించడానికి వీలుగా మొఘల్ పాలకుల అకృత్యాలు దాచిపెట్టి వారిని అతి గొప్పవారిగా చిత్రీకరించే విధంగా ఇందిరా గాంధీ హయాంలో సిలబస్ మార్చడానికి కమిటీ వేశారు.

కర్నాటకకు చెందిన ప్రముఖ చరిత్ర పరిశోధకుడు బైరప్పను ఆ కమిటీలో సభ్యునిగా వేశారు. ఇలా సెక్యులర్ పాఠ్య పుస్తకాలు రాయాలి అన్న మాటతో విబేధించి బైరప్ప బయటకు వచ్చారు.

“గజనీ మమ్మద్ సోమనాథ్ ఆలయాన్ని కొల్లగొట్టాడు. ఔరంగజేబు కాశీ, మధుర దేవాలయాలను కూల్చివేసి మసీదులను నిర్మించాడు, అతను జిజియా పన్నులు సేకరించాడు – వంటి పనికిరాని వాస్తవాలను తెలియజేయడం ద్వారా బలమైన భారతదేశాన్ని నిర్మించడం సాధ్యమేనా? ఇవి ద్వేషాన్ని రేపడం తప్ప పిల్లలు వీటి వల్ల ఏ విధంగా ప్రయోజనం పొందుతారు? ” అని బైరప్పను కమిటీ ఛైర్మన్ ప్రశ్నించారు.

అయితే అవి చారిత్రక సత్యాలు కాదా? ” అని బైరప్ప గారు తిరిగి ప్రశ్నించారు. మీరే కాశీ మరియు మధుర ఉదాహరణలు ఇచ్చారు. నేటికీ, దేశంలోని అన్ని మూలల నుండి లక్షలాది మంది యాత్రికులు ఈ ప్రదేశాలను ప్రతి సంవత్సరం సందర్శిస్తారు. ఒకప్పుడు కూల్చివేసిన దేవాలయాలకు చెందిన గోడలు, స్తంభాలు…ఆ స్తంభాలను ఉపయోగించి నిర్మించిన భారీ మసీదులను వారు చూడవచ్చు. మసీదు వెనుక ఒక మూలన ఇటీవల నిర్మించిన ఆవు షెడ్‌ లాంటి దేవాలయాన్ని కూడా వారు చూడవచ్చు. ఇలాంటి భయంకర నిర్మాణాలను చూసి యాత్రికులందరూ బాధపడి వారు ఇంటికి తిరిగి వచ్చిన తరువాత వారి దేవాలయాల దుస్థితిని వారి బంధువులకు వివరిస్తారు. ఇది జాతీయ సమైక్యతను సృష్టించగలదా? అని బైరప్ప తిరిగి ప్రశ్నించారు.

‘మీరు వాస్తవాలను పుస్తకాలలో లేకుండా చేయగలరేమో. కానీ పిల్లలు విహారయాత్రలకు ఆ పుణ్య స్థలాలకు వెళ్లి తమకు తాము సత్యాన్ని చూసినప్పుడు మనం అలాంటి వాస్తవాలను దాచగలమా? భారతదేశంలో ఇటువంటి ముప్పై వేలకు పైగా శిథిలమైన దేవాలయాలున్నాయి. అవన్నీ మనం దాచగలమా? ” అని భైరప్ప ప్రశ్నించారు.

గజనిమొహమ్మద్ మరియు ఔరంగజేబులను మైనారిటీలు తమ సొంత వ్యక్తులుగా, వీరులుగా ఎందుకు భావించాలి? ఔరంగజేబు మతపరమైన మూర్ఖత్వం వల్లనే మొఘల్ రాజ్యం నాశనం అయింది. అక్బర్ పరమత సహనం సామాజిక సామరస్యానికి దారితీసింది. నిజమైన చరిత్రను దాచాలనే ఈ ఆలోచన రాజకీయాలను నడిపిస్తుందేమో కానీ అది సరైన పద్ధతికాదు. మైనారిటీ అయినా, మెజారిటీ అయినా, భావోద్వేగ పరిపక్వతతో సత్యాన్ని ఎదుర్కోవటానికి విద్య జ్ఞానాన్ని ఇవ్వకపోతే, అలాంటి విద్య అర్థరహితం, ప్రమాదకరమైనది. ” అని బైరప్ప గట్టిగానే బదులిచ్చారు.

బైరప్ప వంటి వారిని ‘ద్రష్టలు’ అంటారు. పేరు ప్రతిష్టలు కోసం పాకులాడకుండా దీర్ఘకాలంలో జరగబోయే పరిణామాలను వాటి వల్ల జరగబోయే అనర్ధాలను ముందుగా ఊహించి హెచ్చరిస్తారు.

సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతోంది. రామజన్మ భూమి సమస్య పరిష్కారం అయింది.రాబోయే రోజుల్లో కాశీ, మధుర క్షేత్రాలు కూడా విముక్తి పొందుతాయి. ఎవరికో కొందరికి నచ్చకపోయినా చరిత్ర పునరావృతం కాకమానదు.

…చాడా శాస్త్రి .