యూపీ సీఎం యోగీ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారనే దానిపై ఉత్కంఠ వీడింది. ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ అర్బన్ నుంచి పోటీ చేయనున్నారు. యోగీ అయోధ్య లేదా మధుర లేదా గోరఖ్ పూర్ లో ఓ స్థానం నుంచి పోటీ చేస్తారని ఎప్పడి నుంచో ప్రచారం జరుగుతోంది. యూపీ సీఎం కాకముందు 2014లో యోగీ గోరఖ్ పూర్ లోక్ సభా స్థానంనుంచి పార్లమెంట్ కు ప్రాతినిథ్యం వహించారు. తరువాత 2017లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోవడంతో ఆయన్ని సీఎంగా పంపారు. ఎంపీగా రాజీనామా చేయించి ఆరునెలల్లోగా ఆయన్ని కౌన్సిల్ కు పంపించారు. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తానని యోగీ కొద్దిరోజుల క్రితమే ప్రకటించారు.
యోగీ గోరఖ్ పూర్ లోక్ సభా నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగడం ఇదే మొదటిసారి. మొదటిసారి యోగీ గోరఖ్ పూర్ సిటీ స్థానం నుంచి పోటీ చేస్తారని పార్టీ ప్రకటించింది.
అటు యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రయాగరాజ్ లోని సిరతు నుంచి పోటీ చేస్తారని పార్టీ అనౌన్స్ చేసింది. ఫిబ్రవరి 10, 14 తేదీల్లో మొదటి, రెండో విడత పోలింగ్ జరిగే స్థానాలకు పార్టీ అభ్యర్థులను శనివారం ప్రకటించారు. మొదటి దశలో 58 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా 57 మంది అభ్యర్థులను ..రెండో విడత ఎన్నిక జరిగే 55 స్థానాలకు 48మంది అభ్యర్థులను ప్రకటించారు. అదనంగా యోగీ, మౌర్య అభ్యర్థిత్వాలను పార్టీ ప్రకటించింది. ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ జరగనున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
తనకు గోరఖ్ పూర్ స్థానాన్ని కేటాయించడంపై సీఎం యోగీ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి, జాతీయ అధ్యక్షుడు నడ్డాకు ధన్యావాదాలు తెలిపారు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అనే మంత్రం ఆధారంగా బీజేపీ పనిచేస్తోందని…పూర్తి మెజారిటీతో తిరిగి యూపీలో అధికారాన్ని నిలుపుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు.
అటు యూపీ గోరఖ్ పూర్ అభ్యర్థిత్వంపై అఖిలేష్ యాదవ్ స్పందించారు. యోగీ ఇక గోరఖ్ పూర్ సిటీకే పరిమితం అవుతారని వ్యాఖ్యానించారు. గోరఖ్‌పూర్‌లో ఈసారి అన్ని స్థానాలను సమాజ్‌వాదీ పార్టీయే గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. గోరఖ్ పూర్ కు యోగీ చేసిందేంలేదన్నారు.
ఇక ప్రధానిమోదీ తన సొంత నియోజకవర్గం వారణాశిలోని పార్టీ కార్యకర్తలతో ఈనెల 18న సమావేశం కానున్నారు. యూపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పార్టీ కేడర్ తో పీఎం సమావేశం కావడం ఇదే మొదటిసారి. వర్చువల్ మీట్ ద్వారా మోదీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు.