ఓవైపు బుల్డోజర్లతో అక్రమ కట్టడాలు తొలగిస్తూ మరోవైపు పోలీసులతో ఆకతాయిల పని పట్టిస్తోంది యూపీలోని యోగీ సర్కారు. అమ్మాయిని వేధిస్తున్న ఓ పోకిరీకి పోలీసులు గుణపాఠం చెప్పిన వీడియో సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది. యోగీ ఐదేళ్ల క్రితం మొదటిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచే నేరాల కట్టడిపై దృష్టిపెట్టారు. మాఫియా ముఠాలు, పోకిరీలు, అవినీతిపరుల భరతం పడుతూ శాంతిభద్రతలపై ప్రత్యేక శ్రద్ధవహించారు.
ఇక తాజాగా కాన్పూర్ కు చెందిన పోలీసులు పోకిరీకి నడిరోడ్డుపై దేహశుద్ధి చేశారు. కాన్పూర్లోని గ్వాల్టోలి పోలీస్ స్టేషన్ పరిధి రాణిగంజ్కి చెందిన ఓ వ్యక్తి తన కూతుర్ని ఒకడు నిత్యం వేధిస్తున్నాడని ఏసీపీ త్రిపురారి పాండే కు ఫిర్యాదు చేశాడు. దాంతో ఆ పోకిరికోసం కాపు కాశారు యాంటీ రోమియో స్క్వాడ్ . వాళ్లతోపాటే ఉన్న యువతి తండ్రి అతన్ని గుర్తుపట్టి పోలీసులకు చూపించాడు. బాధితురాలి సమీపానికి వచ్చిన అతగాడ్ని పట్టుకుని బండాపి చెంప చెళ్లుమనిపించారు ఖాకీలు. పారిపోబోతుంటే జుట్టుపట్టిమరీ… ఇంకొకసారి అమ్మాయిల వెంటపడితే వదిలేదే లేదని హెచ్చరించారు. అప్పటికే కేసు నమోదు చేయడంతో ఆ నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇప్పుడా వీడియో సోషల్మీడియాలో హల్ చల్ చేస్తోంది. పోకిరీకి బుద్ధి చెప్పిన పోలీసులను అభినందిస్తున్నారు నెటిజన్లు.