‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి “Y” కేటగిరీ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర హోంశాఖ. ఈ భద్రత కింద పోలీసు సిబ్బందితో పాటు ఒకరు లేదా ఇద్దరు కమాండోలు, ఎనిమిది మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది ఆయనకు రక్షణగా ఉంటారు. ఆయన దర్శకత్వం వహించిన ది కశ్మీర్ ఫైల్స్ సంచలనంతో పాటు వివాదాస్పదం కూడా అవుతోంది. ఇక ముప్పై ఏళ్ల కిందటి కశ్మీరీ హిందువుల ఊచకోత నేపథ్యంలో మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. సినిమాను చూసిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అగ్నిహోత్రి ప్రయత్నాన్ని అభినందించారు. వాస్తవ కథను చూపించారంటూ చాలా రాష్ట్రాలు పన్నురద్దు చేశాయి కూడా. నిజాన్ని ధైర్యంగా చూపించారని.. దేశంలోని ఓ రాష్ట్రంలో ఇంత జరిగితే తమకు తెలియనే తెలియదని సినిమా చూసిన చాలా మంది అభిప్రాయపడడం కనిపించింది. ఇక సోషల్‌మీడియాలో అయితే ఈ సినిమా గురించే చర్చ. ఇప్పటికైనా కశ్మీర్ హిందువులకు న్యాయం చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సున్నితమైన అంశాన్ని తెరకెక్కించిన వివేక్ అగ్నిహోత్రి భద్రతపైనా పలువురు సందేహాలు వ్యక్తం చేశారు.
ఇస్లామిస్టులు, లిబరల్స్, కమ్యూనిస్టులు ఈ మూవీని అడ్డుకునేందుకు చాలా ప్రయత్నాలే చేశారు. కోర్టుకు సైతం వెళ్లారు పలువురు. అయితే తాను సినిమాలో చూపిన ఒక్క సన్నివేశం కానీ, ఒక్క డైలాగ్ తప్పుకాదని… ఎక్కడైనా సరే ఆధారాలతో నిరూపించేందుకు సిద్ధమని ఎప్పుడో ధైర్యంగా ప్రకటించాడు అగ్నిహోత్రి. ఇన్ని పరిణామాల నేపథ్యంలో ఆయన భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో Y కేటగిరీ భద్రత కల్పించింది కేంద్రం.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)