మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, కాంగ్రెస్ మాజీ ఎంపీ సుస్మితా దేవ్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి సమర్పించారు. రాజీనామా లేఖను అధినేత్రికి పంపిన వెంటనే …దేవ్ తన ట్విట్టర్ ఖాతాలో …’భారత జాతీయ కాంగ్రెస్ మాజీ సభ్యురాలు, అఖిల భారత మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు’ అని పేర్కొన్నారు. సుస్మితా దేవ్ 2014 నుండి 2019 వరకు లోక్ సభలో అస్సాంలో సిల్చార్కు ప్రాతినిధ్యం వహించారు. ఆమె తండ్రి సంతోష్ దేవ్ రాజీవ్, మన్మోహన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఏడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.
అస్సాంలో బెంగాలీ భాష మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండే బరాక్ లోయలో దేవ్ కుటుంబానికి మంచిపట్టుంది. ఇటీవల అస్సాంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, బిజెపి గెలిచినప్పుడు, ఎఐయూడీఎఫ్ తో సీట్ల భాగస్వామ్య ఏర్పాటుతో సుస్మితా దేవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బరాక్ లోయలో ఎఐయూడీఎఫ్ కు ఎక్కువ సీట్లు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు నాయకులకు వ్యతిరేకంగా ఆమె మద్దతుదారులు నిరసన నిర్వహించారు.
పార్టీకి రాజీనామా చేసేముందు అసోం పీసీసీ చీఫ్, ఇతర పార్టీ ముఖ్యులతో ఆమె సమావేశమయ్యారు. సుస్మితా దేవ్ రాజీనామాపై ట్విట్టర్ వేదిగ్గా స్పందించారు కపిల్ సిబల్ . ‘సుస్మితా దేవ్ రాజీనామా చేశారు. యువ నాయకులు వెళ్లిపోతున్నప్పుడు, పార్టీని బలోపేతం చేయడానికి మా ప్రయత్నాలకు ‘వృద్ధులు’గా నిందకు గురవుతున్నాం. కళ్ళు మూసుకుని పార్టీ ముందుకు సాగుతుంది’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.