అఖిలేష్ యాదవ్ ను ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడం అంటే రాష్ట్రంలో అంతమైన గూండారాజ్ ను మళ్లీ తెచ్చుకోవడమేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా షా మధురలో పర్యటించారు. సమాజ్ వాదీ కీలక నేత ఆజమ్ ఖాన్ పై అనేక కేసులు ఉండి…అరెస్టైతే… అఖిలేష్ శాంతిభద్రతల గురించి మాట్లాడ్డం సిగ్గుచేటని అన్నారు. యూపీలో ఒకప్పుడు గ్యాంగ్ స్టర్స్, క్రిమినల్స్ దే రాజ్యంగా సాగిందని…2017లో యోగీ ముఖ్యమంత్రి అయ్యాక పరిస్థితులు అన్ని విధాలా మెరుగయ్యాయని గుర్తు చేశారు.
బీజేపీ అధికారంలోకి వచ్చాక క్రిమినల్స్, గ్యాంగ్స్టర్లను జైళ్లలో పెట్టామని, యూపీలో కుటుంబ పాలన లేకుండా చేశామని, కులతత్వాన్ని లేకుండా చేసి, అభివృద్ధిపై ఫోకస్ పెట్టామని అన్నారు. 20 కోట్ల జనాభాఉన్న ఉత్తరప్రదేశ్ ను కాదని భారత్ ముందుకెళ్లబోదని అమిత్ షా అన్నారు. బీజేపీపై, యోగీపై ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని నిలుపుకుంటున్నామన్నారు. దేశభవితవ్యాన్ని నిర్ణయించేది యూపీనేనని…బీజేపీని మళ్లీ గెలిపిస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామనీ అన్నారు.