దేశంలో క్రికెట్ తప్ప మరే ఇతర ఆటలకు తగినంత
ప్రోత్సాహం లేదని అందరు అనుకుంటున్న విషయమే..
పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్, పీవీ సింధు పుణ్యమాని ఇప్పుడిపుడే బ్యాడ్మింటన్ లో మంచి ఫలితాలు చూస్తున్నాం. ఒలంపిక్స్ లో పతకాలు కూడా సాధిస్తున్నాము..
130 కోట్లకు పైగా జనాభా ఉన్న భారతదేశం ఒలంపిక్స్ వంటి ప్రపంచ స్థాయి పోటీల్లో పతకాల పట్టికలో అట్టడుగున ఉండటం బాధాకరమే. ఎంతసేపు చదువులు, మార్కులు, ర్యాంకులు,
ఇంజనీరింగ్, మెడిసిన్, ఐఐటి, అమెరికాలో సెటిల్ అవడమే లక్ష్యంగా సాగే విద్యాభ్యాసం, క్రీడలను ప్రోత్సహించే కుటుంబ వాతావరణం లేకపోవడం, ఆటలు ఆడుకోవడానికి తగిన స్థలం, స్టేడియాలు, రన్నింగ్ ట్రాక్స్ వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడం, ప్రభుత్వం క్రీడలను ఇన్నాళ్లు ప్రాధాన్యత అంశంగా గుర్తించి తగినంత ప్రోత్సాహం ఇవ్వకపోవడం వంటి అనేక కారణాలు క్రీడల్లో దేశం వెనకబడడానికి కారణం.
2019లో కేంద్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించడానికి, క్రీకెట్ యేతర క్రీడాకారులను తీర్చిదిద్దడానికి ఖేల్ ఇండియా అనే పథకాన్ని ప్రవేశపెట్టి ఇప్పటివరకు రెండు వేల కోట్ల రూపాయలు ఇందుకోసం కేటాయించింది. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని హాకీని ప్రోత్సహిస్తున్నారు. దాని ఫలితమే ఈరోజు ఒలంపిక్స్ లో భారత పురుషుల మరియు మహిళా హాకీ జట్ల ప్రదర్శన..
మున్ముందు ఒలంపిక్స్ వంటి ప్రపంచ స్థాయి పోటీల్లో మెరుగైన ప్రదర్శన చేసి ఎక్కువ పతకాలు సాధించాలి అంటే ఇంకా అనేక మార్పులు చేయాల్సి ఉంటుంది.
ముందుగా ఒలంపిక్స్ లో దేశానికి అత్యధిక స్వర్ణ పతకాలు అందించిన మేజర్ ధ్యాన్ చంద్ గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలి.
క్రీడలకు ఏమాత్రం సంబంధం లేని రాజీవ్ గాంధీ పేరు మీద ఇస్తున్న రాజీవ్ ఖేల్ రత్న అవార్డును భారత్ ఖేల్ రత్న అవార్డుగా పేరు మార్చాలి.
దేశంలో ఇప్పటికే నిర్మించిన లేదా ఇకమీదట నిర్మించబోయే స్టేడియాలకు ఆయా క్రీడల్లో దేశానికి ఖ్యాతి గడించిన క్రీడాకారుల పేర్లు పెట్టాలి.. రాజకీయ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానుల పేర్లు తొలగించాలి.
పాఠశాల, కళాశాల స్థాయిలో క్రీడలను ప్రోత్సహించేందుకు ఇతర పాఠ్యాంశాలతో పాటు ఏదేని ఒక ఆటను పాఠ్యాంశంగా ఎంచుకునే అవకాశం కల్పించాలి.. వాటికి మార్కులు కూడా కేటాయించాలి..
క్రీడలను కెరీర్ గా ఎంచుకునే వారికి హాస్టల్ వసతి, నైపుణ్యం కలిగిన కోచ్ ల వద్ద శిక్షణ తీసుకునే అవకాశం కల్పించాలి.. అందుకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలి.
దేశంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో క్రీడను ప్రోత్సహించే బాధ్యతలు తీసుకుని అందుకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించి, శిక్షకులను ఏర్పాటు చేసి దేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు అయినా ఆ క్రీడలో శిక్షణ పొందేందుకు అవకాశం కల్పించాలి.
రెగ్యులర్ గా జాతీయ స్థాయిలో వివిధ క్రీడల పోటీలు నిర్వహించాలి. అందులో ప్రతిభ కనబరిచిన వారిని అంతర్జాతీయ పోటీలలో పాల్గొనేందుకు ప్రభుత్వం సహాయం చేయాలి.
అంతర్జాతీయ పోటీలలో పతకాలు తెచ్చిన వారికి కోట్లకు కోట్ల రూపాయలు నజరానాలు ఇవ్వడం కాకుండా జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి దేశంలో యువతకు శిక్షణ ఇచ్చే గురువులుగా అవకాశం ఇవ్వాలి..
నాలుగేళ్లలో వచ్చే ఒలంపిక్స్ ను దృష్టిలో పెట్టుకొని సాధన చేయడమే కాకుండా వచ్చే 8 & 12 ఏళ్ల తర్వాత వచ్చే ఒలంపిక్స్ కొరకు ఇప్పటి నుండే క్రీడాకారులను తీర్చిదిద్దే ప్రయత్నం చెయ్యాలి..
ఇవన్నీ ఒక్కరోజులో జరిగేవి కావు.. కాని ఈ దిశలో పనిచేసినప్పుడే ఒలంపిక్స్ వంటి ప్రపంచ స్థాయి పోటీల్లో దేశం మెరుగైన పతకాలు సాధిస్తుంది..
– Nàgaràju Munnuru
– Nàgaràju Munnuru