ఈ దేశ దౌర్భాగ్యం ఏమిటంటే భారతదేశ చరిత్ర పుస్తకాలలో భారత హిందూ రాజులు ఓడిపోయిన యుద్ధాలు గురించే ఎక్కువ రాయబడ్డాయి. అలాగే హిందువులు స్వతఃసిద్దంగా అహింసా వాదులు అని చెప్పే విధంగా చరిత్ర చిత్రికరించబడింది..
ముఖ్యంగా చాలా మంది హిందూ రాజులు, హిందు సాధువుల యుద్ధ విజయాలు గురించి చరిత్రలో కనిపించకుండా దాచేశారు. బహుశా వాటి గురించి తెలిస్తే దేశంలో మళ్లీ నిజమైన హిందూ ధర్మ పునర్జీవనం జరుగుతుంది అని నెహ్రు మరియు వామపక్ష చరిత్రకారులు భావించి ఉండడమే కారణం అయి ఉండవచ్చు. అందుకే విద్యార్థులకు తాము దిగుమతి చేసుకున్న విదేశీ సెక్యూలర్ వైరస్ చొప్పించే విధంగా పిల్లల చరిత్ర పాఠ్య పుస్తకాలను నెహ్రు సెక్యూలర్ భావజాలానికి సరిపోయేటట్లు వక్రీకరించి రాసి పడేసారు.
కానీ ఇంటర్నెట్ పుణ్యమా అని వామపక్ష చరిత్రకారులచే మరుగుపరచబడిన ఎన్నో విషయాలు కొత్త పుస్తకాల ద్వారా తెలుసుకునే అవకాశం కలుగుతున్నది.
అటువంటి పుస్తకమే విలియం ఆర్ పించ్ రాసిన ” వారియర్ ఆస్కెటిక్స్ అండ్ ఇండియన్ ఎంపైర్స్, కేంబ్రిడ్జ్-2006.” ఈ పుస్తకం భారతదేశం మరియు బ్రిటన్ లోని లైబ్రరీలు మరియు ఆర్కైవ్లలో కనుగొనబడిన విభిన్నమైన మూలాల ఆధారంగా రాయబడింది. విలియం పించ్ యొక్క ఈ ప్రతిష్టాత్మక పుస్తకం పదహారవ శతాబ్దం ప్రారంభం నుండి నెహ్రూ శకం వరకు సన్యాసిలు, గోసైన్లు, బైరాగీలు, ఫకీర్లు మరియు (ముఖ్యంగా) నాగ సాధువులు వారి పరివారం యొక్క సన్యాసి యోధుల అఖారాల యుద్ధ వివరాలు గురించి ఉన్నాయి. అతను పుస్తకంలో మొదటగా, మొఘల్ పాలనలో ఈ సాధువుల విస్తరణ సంస్థాగతీకరణ ప్రక్రియను, తరువాత పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ సాయుధ సన్యాసులను చవకైన బాగా నైపుణ్యం గల సాయుధ పదాతిదళం మరియు అశ్వికదళ సైనికులుగా నియమించబడడం గురించి, చివరిగా ఈ యోధా సాధువులు అంటే బ్రిటిష్ వారు కూడా ఎలా భయపడ్డారో, దాని వల్ల వీరిని మిలిటెంట్ సన్యాసులుగా ముద్ర వేసి అనుమానాస్పద నిఘాలో ఉంచడం గూర్చి కూడా రాసాడు.
ఈ సాధువులు యుద్ధ నైపుణ్యం మరియు తెగింపు గురించి తెలుసుకోవాలి అంటే ఇది చదవండి:
సాధారణంగా భారతదేశంలోని సాధువులను చాలా తేలికగా తీసుకుంటారు, ఎగతాళి కూడా చేయబడతారు. దీనికి కారణం వీరు బాధ్యతల నుంచి తప్పించుకుని ఉచిత ఆహారానికి అలవాటు పడిన పనికిమాలిన వ్యక్తులుగా చిత్రీకరింపబడ్డారు కాబట్టి.
వీరిలో నాగ సాధువులు అయితే భారతదేశంలోని అత్యంత విచిత్రంగా వింతగా కనిపించే వారిలో ఒకరు. వీరు తమ ముఖాలపై, శరీరాలపై బూడిద పూసుకుని ఎక్కువగా దిగంబరంగా, విపరీతమైన జుట్టుతో కనిపిస్తూ వుంటారు. ఈ నాగ సాధువులు మోక్షాన్ని సాధించడానికి యోగ యొక్క తీవ్ర రూపాన్ని అభ్యసిస్తారు. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళా సమయంలో మాత్రమే సాధారణంగా ఈ నాగ సాధువులు కనిపిస్తారు. కుంభమేళా పూర్తయిన తర్వాత, వారు అడవుల లోకి ఎగువ హిమాలయాల్లోకి పోయి మళ్ళీ 12 సంవత్సరాల వరకు కనిపించరు.
8 వ శతాబ్దంలో ఆదిశంకరాచార్య రాబోయే 1000 – 1500 సంవత్సరాలలో మన దేవాలయాలు, దాని సంపద మరియు సంస్కృతిపై దాడులు అనేక రెట్లు పెరుగుతాయని ఊహించినందున ఈ నాగ సాధు వర్గాన్ని స్థాపించారు. ముష్కరులను ఎదుర్కోవడానికి క్రూరంగా దాడి చేయగల సాధువుల సైనిక విభాగం అవసరం అని గుర్తించి నాగ సాధువుల గ్రూప్ ఏర్పాటు చెయ్యబడింది. వీరిలాగే కొంత కాలానికి అఘోరీలు కూడా ఉద్భవించారు.
అఘోరీలు మరియు నాగ సాధువుల పరాక్రమం గురించి చరిత్రలో మొదటిసారిగా గోకుల్ యుద్ధంగా చెప్పబడింది. 1757 సం. లో ఈ యుద్ధంలో 4000 మంది నాగ సాధువులు అహ్మద్ షా అబ్దాలీ నేతృత్వంలోని 30000 బలమైన ఆఫ్ఘన్ సైన్యాన్ని ఓడించారు.
భారతదేశంలోని అనేక పవిత్ర స్థలాలలో, శ్రీకృష్ణునితో అనుబంధించబడిన ప్రదేశాలు ఎల్లప్పుడూ ప్రత్యేకమైనవి. వీటిని తరచుగా బ్రజ్ మత్స్య ప్రాంతం అంటారు. ఈ ప్రదేశాలు ప్రధానంగా కృష్ణుడి పుట్టుకతో సంబంధం కలిగి ఉంటాయి. అంటే ఇవి బృందావనం, గోకుల్ మరియు మధుర.
1757 సం. లో ఆఫ్ఘనిస్తాన్ నుండి అహ్మద్ షా అబ్దాలీ నేతృత్వంలోని ముష్కర దళాలు ఆలయ సంపదపై దురాశతో మరియు మతపరమైన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి బృందావన్ మరియు మధురపై 30000 మంది బలమైన సైన్యంతో దాడి చేశాయి. ప్రిన్స్ జవహర్ సింగ్ నాయకత్వంలో 10000 మంది హిందూ సైనికులు ఈ పవిత్ర స్థలాలను రక్షించడానికి ప్రయత్నించారు, కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు, ఆక్రమణదారులను ఈ సేనలు అడ్డుకోలేకపోయారు. దేవాలయాలను ధ్వంసం చేయడం తో పాటు సంపదను దోచుకోవడం వంటి అకృత్యాలతో పాటు చాలా మంది మహిళలు సామూహిక అత్యాచారాలు గురి అవుతూ ఉండటంతో ఆ ముష్కర మూకల చేతిలో చిక్కే కంటే మరణమే మంచిదని వారు భావించి ఈ రాక్షసుల నుండి తప్పించుకోవడానికి యమునా నదిలోకి దూకారు. అందమైన బృందావన నగరం పూర్తిగా నాశనం చేయబడింది. దండయాత్ర సమయంలో దారుణమైన రక్తపాతం కారణంగా చాలా సంవత్సరాలు అక్కడ మట్టి ఆ దుర్వాసనను వెదజల్లేదని ఆ స్థానిక కధనాలు చెబుతాయి.
బృందావనాన్ని పూర్తిగా నాశనం చేసిన తర్వాత ఈ ఆఫ్ఘన్ సైన్యం కొన్ని మైళ్ల దూరంలో ఉన్న గోకుల్ వైపు తిరిగింది. దానిని జయించే బాధ్యత కమాండర్ సర్దార్ ఖాన్, అతని 20000 మంది సైనికులకు ఇవ్వబడింది. సర్దార్ ఖాన్ తన సైనికులతో కలిసి గోకుల్ నగరానికి వెళ్లి చూసే సరికి వీరి రాక కోసం ఎదురుచూస్తూ, కత్తులు మరియు ఈటెలతో నగ్నంగా ఉన్న దాదాపు 3000 మంది నాగ సాధువులను చూసి ఈ ముష్కరులు ఆశ్చర్యపోయారు. సర్దార్ ఖాన్ వారిని చూసి నవ్వుతూ తన సైనికులకు వీరందరి భోజనానికి ముందే నరికి పోగులు పెట్టమని చెప్పారు. అధునాతన సైనిక శిక్షణ పొందిన తన సైన్యాన్ని ఈ నగ్న సాధువులు ఏం చెయ్యగలరు అని అహంభావంగా ఆలోచించాడు.
నాగాలు, ఆఫ్ఘన్ల మధ్య యుద్ధం ప్రారంభం అయిన రెండు గంటల తర్వాత ఆ సైన్యానికి తమ అంచనా తప్పు అని తెలియలేదు. ఎందుకంటే ఊహించిన దానికి భిన్నంగా నాగ సాధువులు చేతిలో వారి సైన్యం ఊచ కోత కోయబడింది. సర్దార్ ఖాన్ ఈ పరిణామం చూసి భయపడి వెంటనే మరో 5000 మంది సైనికులను బ్యాకప్ గా పంపమని కోరాడు. కానీ ఈ బలగం కూడా నాగ సాధువుల ధాటికి నిలబడి లేకపోయాయి.
అఫ్ఘాన్ సైనికులకు బూడిదతో నిండిన ముఖాలు భయంకరంగా కనిపించసాగాయి. భారీ ప్రాణనష్టంతో ఆఫ్ఘన్ సైన్యం బలం క్షీణించింది. ఇది బృందావన్లో ఉన్న రాజు అహ్మద్ షా అబ్దాలీకి చాలా కోపం తెప్పించింది. దాంతో అతను మరికొంత మంది సైన్యాన్ని పంపాడు, కాని వారు కూడా నాగ-అఘోరీ సాధువుల చేతిలో ఓడిపోవడంతో ఆ ఎత్తుగడ కూడా ఫలించలేదు. ఆఫ్ఘన్ల ఛిద్రమైన శరీరాలు పేరుకుపోతుండటంతో ఆఫ్ఘన్ సైన్యం యొక్క నైతికత క్షీణిస్తోంది. తన ప్రాణంపై ఉన్న మమకారంతో మరియు ఈ సాధువులు అంటే భయంతో కమాండర్ సర్దార్ ఖాన్ తన సైనికులను వెనక్కి రమ్మని ఆదేశించాడు.
ఆ విధంగా నాగ సాధువులు పవిత్రమైన గోకుల్ నగరాన్ని పైశాచిక శక్తుల నుండి రక్షించగలిగారు. ‘హర్ హర్ మహాదేవ్’ యొక్క యుద్ధ కేకలు శత్రువులను గడగడలాడించాయి. ఆక్రమణదారులు ఆ తరువాత పవిత్రమైన గోకుల్ నగరంపై మళ్లీ ఒక కన్ను వేయడానికి ఎప్పటికి సాహసించలేదు!
Courtesy : Chada Shatri





