శ్రావణమాసం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలు కలకళలాడుతున్నాయి. సౌభాగ్యాన్ని పెంపు చేసే చక్కటి వ్రతంగా దీనిని చెబుతారు. అందుచేతనే ఆడపడుచులు ఆత్మీయతతో దీనిని జరుపుకుంటారు. వ్రతం చేసుకున్నాక చుట్టుపక్కల ముత్తైదువులకు తాంబూలం అందిస్తారు తద్వారా మహిళల మధ్య కుటుంబాల మధ్య ఐక్యత విలసిల్లుతుంది.
వరలక్ష్మీ వ్రతం లో సాంప్రదాయానికి పెద్దపీట వేస్తారు. శ్రావణ పూర్ణిమకి ముందు వచ్చే శుక్రవారం తిథి, నక్షత్రంతో సంబంధం లేకుండా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. అయితే ఆవారం కుదరని పక్షంలో శ్రావణమాసంలో వచ్చే ఏ శుక్రవారంలోనైనా వ్రతాన్ని చేసుకోవచ్చు. అన్ని మాసాల్లో కన్నా శ్రావణమాసం శివకేశవులతో పాటు లక్ష్మీదేవికి కూడా ప్రీతికరమైనది. ఈ వ్రతాన్ని ఆచరించిన మహిళలకు సకల సౌభాగ్యాలు కలుగుతాయని అంటారు. స్కందపురాణంలో శివుడు పార్వతీదేవికి ఈ వరలక్ష్మీ వ్రతాన్ని గురించి చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈరోజున సువాసినులకు పూజ చేసి, వ్రతకథను చదువుకుని అమ్మవారికి ధూప,దీప. నైవేద్యాలు సమర్పించి ఆనందంగా వ్రతాన్ని చేసుకుంటారు మహిళలు.
వరలక్ష్మీ వ్రతానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపదలెన్నో ఎన్నో ఉన్నాయి. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అర్థం కూడా ఉంది. ఈ వ్రతాన్ని ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో విస్తృతంగా ఆచరిస్తారు. వరలక్ష్మీ తల్లి భక్తులను అష్ట లక్ష్మి రూపాల్లో (ధన, ధాన్య, విజయ, సంథాన, ధైర్య, విద్యా, వైభవ, శాంతి) అనుగ్రహిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వాసం.
ఒకసారి అష్టలక్ష్మి స్వరూపాల ప్రాధాన్యతను పరిశీలిద్దాం. మనిషి జీవితంలోనూ బాల, కౌమార, యౌవన, వార్థక్యం అనే నాలుగు దశలుంటాయి. ఈ నాలుగు దశల్లోనూ అష్టలక్ష్ములు మనల్ని ఒక్కో విధంగా అనుగ్రహిస్తూ ఉంటారు. ప్రతి ప్రాణి ప్రయాణం పుట్టుకతోనే ప్రారంభమవుతుంది కను మొదటగా పాలకడలిలో పుట్టిన పసిడితల్లి ఆదిలక్ష్మిని స్తుతిస్తాం. పెరుగుదలకు అవసరమైన ఆహారాన్ని అందించే తల్లిగా ధాన్యలక్ష్మిని, పెరుగుతన్నప్పుడు వచ్చే భయాలను తొలగించే తల్లిగా ధైర్యలక్ష్మిని,కుటుంబ క్షేమాన్ని కోరకుంటూ సంతాన లక్ష్మిని, విజయం లభిస్తేనే ముందుకు వెళ్లగలం కనుక విజయలక్ష్మిని, అజ్నానం తొలిగించి జ్నానాన్ని ప్రసాదించమని విద్యాలక్ష్మిని, ధనమూలం ఇదం జగత్ అన్నట్టు దారిద్ర్య బాధలు తొలగాలని ఆధనలక్ష్మీ దేవిని ఇలా ఎన్నో విధాలుగా ఆరాధిస్తున్నా మనలో గల తాపత్రయాలను తొలగించడానికి గజలక్ష్మిని ఇలా ప్రార్థిస్తూ వస్తున్నాం. ఇలా అష్టలక్ష్ములు మన జీవితంలో సమప్రాధాన్యం కలిగిస్తున్నారు.
అంతేకాకుండా కుటుంబాల మధ్య ఐక్యతను పెంచే పండగగా వరలక్ష్మీ వ్రతాన్ని చెప్పుకోవచ్చు. ఇటువంటి సాంప్రదాయాలను వ్రతాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.