తాతా.. సోషలిజం అంటే ఏమిటి?
ఏం. లేదు మనవడా..
“ఎవరో రిస్క్ తీసుకుని ఒక వ్యాపార సంస్థను స్థాపించి లాభాల్లోకి తీసుకు వస్తే రాత్రికి రాత్రి
ప్రభుత్వం తన అధికారం ఉపయోగించి వారి దగ్గర లాగేసుకొని ఒక 40/50సం. లు దాన్ని నిర్వహించి దివాళా కొట్టించి మళ్లీ ఏ ప్రైవేట్ వాడికో అమ్మేయ్యడం అంటారు.”
ఉదాహరణకు మన ఎయిర్ ఇండియా తీసుకో, లాభాల్లో నడుస్తున్న దానిని ప్రభుత్వం లాగేసుకొని 60 సం.లు నడిపి వేల కోట్లు అప్పులు, నష్టాలు మిగిల్చి నడపడం చేతకాక చేతులు ఎత్తేసి మళ్లీ ఆ టాటా వాళ్ళకే అమ్మేయ్యడం లాగా అన్నమాట.
నెహ్రు గారు ఇందిర గారు, ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపిస్తే మోడీ అమ్మేస్తున్నారు అని ఒక వాదన తీసుకు వచ్చారు.
అసలు నెహ్రు, ఇందిరా టైం లో ప్రైవేట్ పెట్టుబడులకు ప్రోత్సాహం ఇచ్చి ఉంటే దేశం ఎప్పుడో అభివృద్ధి చెంది చైనా అమెరికాలతో పోటీ పడే స్థితిలో ఉండేది. కనీసం వారు పేరు పెట్టుకున్న అదే మేం చిన్నప్పుడు చదువుకున్న “మిక్సీడ్ ఎకానమీ” అంటే కొంత ప్రభుత్వ కొంత ప్రైవేట్ లేదా కొంత సోషలిజం కొంత కాపీటలిజం ఆర్ధిక నమూనా చిత్త శుద్దితో అమలు చేసి వున్నా దేశం ఆర్ధికంగా బాగా ఎదిగి ఉండేది.. కానీ అదీ చేయక గుడ్డిగా సోవియట్ యూనియన్ అనుకరణ వల్ల ప్రతీ దానిలో ప్రభుత్వ అజమాయిషీ ఎక్కువ అయి వారి పాలనలో ఆర్ధిక వ్యవస్థ ఏనాడూ పరుగులు తీయలేదు.
ఎందుకంటే ప్రభుత్వాలకు ఆదాయాలు తక్కువ, వాటిల్లోంచే ప్రభుత్వ నిర్వహణకు, సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తే ఇంక ప్రభుత్వ సంస్థలు స్థాపించడానికి డబ్బులు ఎలా వస్తాయి? అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి సంస్థలు స్థాపించాలి. లేదా మిగతా ముఖ్య అభివృద్ధి కార్యక్రమాలు అంటే విద్యుత్, రోడ్లు, రైల్వేస్, టెలీ కమ్యూనికేషన్, సాగు నీరు, త్రాగు నీరు, గృహ నిర్మాణం మొ. ప్రాజెక్ట్ లను వెనక్కి పెట్టాలి. 1990 వరకు దేశంలో జరిగింది అదే. ఏదో బ్రిటిష్ వాడి టైం లో ఏర్పరచబడ్డ రైల్వేస్, టెలికమ్యూనికేషన్, విద్యుత్ మొదలగువి మైంటైన్ చెయ్యడం కాస్త పెంచడం జరిగింది కానీ అంత కంటే గొప్పగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోలేకపోయాం. సుమారు స్వాతంత్రం వచ్చిన 45సం. ల వరకు దేశంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక హై వే నిర్మించలేకపోయాం. ఇంకా దారుణం ఏమిటంటే
2013లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అఫిడవిట్ సుప్రీంకోర్టు లో ఇస్తూ ముందు 30సం. లలో నిర్మించిన హై వేలల్లో 50% వాజపేయి 5 సం. ల పాలనలోనే కట్టబడ్డాయి అని చెప్పారు. దీనికి
కారణం? సోషలిజం పేరుతో గత ప్రభుత్వాలు ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించకపోవడం వల్ల.
అంతే కాక ఒక సంస్థ స్థాపించి కుదురుకుని లాభాలు రావడానికి 5 నుండి 10 సం. లు పడుతుంది. అంటే ఈ పెట్టుబడులు మీద ఆ 5 లేదా 10సం. లు ఆదాయాలు ఏమి రావు. వ్యాపారం అంటేనే పెద్ద రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. వ్యాపార రంగంలోకి ప్రవేశించి బాగా పేరు తెచ్చుకున్న కొన్ని వందల మంది పేర్లు మనకి తెలుస్తాయి కానీ చేతులు కాల్చుకుని దివాళా కొట్టిన కుటుంబాలు కొన్ని వేలల్లో లక్షల్లో ఉంటాయి అని మనం అనుకోము.
మరి ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించి వాటిని వెంటనే లాభాల్లోకి తీసుకురావడం ఎలా?
అదే మ్యాజిక్…దాని పేరే నేషనలైజేషన్ లేదా జాతీయకరణ చేయడం అంటారు. ఒకే దెబ్బకి రెండు పిట్టలు. అంటే ఒకటి ప్రజలకు మేలు చేసే సంక్షేమ ప్రభుత్వం అని రాజకీయంగా పేరు తెచ్చుకోవచ్చు, రెండు ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించి 5 లేదా 10 సం. లు అవి కుదురుకోడానికి ఎదురుచూసే అవసరం లేకుండా రాత్రికి రాత్రి లాభాల్లో ఉన్న సంస్థలను ప్రభుత్వం తన అధికారం ఉపయోగించి బలవంతంగా లాగేసుకొని ప్రారంభ వ్యాపార రిస్క్ లు నుండి తప్పించుకోవడం.
అసలే ప్రైవేట్ పెట్టుబడులకు బద్ద వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాల పాలనలో ప్రైవేట్ పెట్టుబడులు తక్కువ ఉండేవి. ఈ జాతీయకరణ వల్ల జరిగిన నష్టం ఏమిటి?
కొత్తగా ప్రైవేట్ రంగంలో సంస్థలు రావడం తగ్గిపోయింది. కారణం? తీరా రిస్క్ తీసుకుని, కష్టనష్టాలు భరిస్తూ ఏ పెద్ద సంస్థ స్థాపించి లాభాల్లోకి తీసుకు వస్తే ప్రభుత్వం ఏ క్షణమో తమ చేతుల్లోంచి గుంజుకుపోతుంది అనే భయంతో ప్రైవేట్ రంగంలో కూడా పెట్టుబడులు తగ్గిపోయాయి.
దేశంలో ఎంత ఎక్కువ వ్యాపారాలు జరిగితే ప్రభుత్వాలకు అంత ఆదాయాలు వస్తాయి. వ్యాపారం జరగాలి అంటే పెద్ద ఎత్తున పరిశ్రమలు, వ్యాపారాలు, నిర్మాణ రంగంలో పెట్టుబడులు రావాలి. అవి వస్తే ఉపాధి అవకాశాలూ పెరిగి ప్రజల చేతుల్లో ఆదాయాలు పెరిగి, కొనుగోలు సామర్ధ్యం పెరిగి వస్తువుల డిమాండ్ పెరిగి కొత్త పరిశ్రమలు వచ్చి మళ్ళీ కొత్త ఉపాధి పెరుగుతుంది..ఇది ఒక పాజిటివ్ చైన్. అలా కాకా పెట్టుబడి దారులు దోపిడీ దారులు, వాళ్లను వ్యాపారాలు చేసుకొనివ్వం, ప్రభుత్వమే అన్ని చేస్తుంది అంటే జరిగిన అనర్ధానికి మన దేశం ప్రత్యక్ష ఉదాహరణ.
అందుకే 1990 లు వచ్చే సరికి దేశం దివాళా అంచులకు చేరింది.
మనం ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థలు అని గొప్పగా చెప్పుకుంటున్న చాలా సంస్థలు మొదట్లో ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలు వ్యాపార రిస్క్ తీసుకుని స్థాపించినవి అనే సంగతి చాలా మందికి తెలియదు.
చూడండి ఈ లిస్ట్.. ఇవన్నీ పెద్ద ప్రైవేట్ రంగ సంస్థలు తరువాత జాతీయకరణ చేయబడ్డాయి.
1. ఎయిర్ ఇండియా, ఆంద్రు యూల్
2. ఆంధ్రా బాంక్, అలహాబాద్, కెనరా బాంక్ మొదలగు మొత్తం 20 బ్యాంకులు.
3. బాల్మర్ లారీ, భారత్ కుకింగ్ కోడెక్కన్(నిజాం) ఎయిర్వేస్ల్,
భారత్ పెట్రోలియం, బర్న స్టాండర్డ్
4. , ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్
5. గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్, జనరల్ ఇన్సూరెన్సు కంపనీ
6. హిందూస్థాన్ ఏరో నాటిక్స్ (HAL)
హిందూస్థాన్ పెట్రోలియం (HP)
హిందూస్థాన్ షిప్ యార్డ్
7. మాజాగాం షిప్ బిల్డర్స్
8. నేషనల్ ఇన్సూరెన్సు కంపనీ
న్యూ ఇండియా ఇన్సూరెన్సు కంపనీ
9.ఆయిల్ ఇండియా, ఓరియెంటల్ ఇన్సూరెన్సు
10. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్సు
11. వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్
12. స్టేట్ బాంక్
ఈ లిస్ట్ పెద్ద సంస్థలవి. ఈ లిస్ట్ ఇంకా చాలా ఉంది.
చూసారా ఏ వ్యాపార ప్రారంభ రిస్కులు లేకుండా రాత్రికి రాత్రి ప్రభుత్వం స్థాపించిన గొప్ప ప్రభుత్వ రంగ సంస్థలు.
1980ల తరువాత పుట్టిన వారికి మేం పడ్డ కష్టాలు తెలియవు. 1990 లలో వచ్చిన ఉదార ఆర్ధిక విధానాలు వల్ల ఈ తరం వాటి ఫలితాలు అనుభవిస్తూ ఏది కావాలంటే అది మార్కెట్ కి పోయి కొనుకుంటున్నారు. మా కాలంలో మధ్య తరగతి వారు ఒక గ్యాస్ కనెక్షన్, ఒక టెలీఫోన్, ఒక స్కూటర్, ఒక 10 కేజీ లు పంచదార, ఒక టేప్ క్యాసెట్ సంపాదించడం గగనం. చాలా ఎలక్ట్రానిక్ వస్తువులు దేశం లో తయారు అయ్యేవి కాదు కాబట్టి విదేశీ సరుకులు అంటే విపరీతమైన క్రేజ్. దగ్గర ఊర్లకి తప్ప దూర ప్రయాణాలు బస్సు ప్రయాణం కలే. ఎందుకంటే 100కి.మీ 4/5 గంటలు ప్రయాణ సమయం పట్టేది. రోడ్లు అంత గొప్పగా ఉండేవి. దూర ప్రయాణాలకు ఒకటో ఆరో వచ్చే రైళ్లే దిక్కు.. మేం సోషలిజం లో సోష వచ్చి పడ్డాం కాబట్టి దాని కష్టాలు తెలుసు. ఆ కష్టాలు ఈ తరం అనుభవించలేదు కాబట్టి అందుకే ఈ తరానికి ఈ ఉదార ఆర్ధిక విధానాలు విలువ తెలియడం లేదు.
ఏదో పిడీ సిద్ధాంతం అదే సోషలిజం లేదా క్యాపిటలిజం అని పట్టుకు వేలాడకుండా ముఖ్యమైన పరిపాలన, డిఫెన్స్, విద్య, వైద్యం, సంక్షేమం తప్ప మిగతా రంగాలలో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టనవసరం లేదు. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ కాలానుగుణంగా మార్పులు చేసుకోవాలి.
Courtesy :- Chada Shastry