తెలంగాణలో జాతీయ కార్యవర్గ సమావేశాలతో హైదరాబాద్ నగరమంతా హడావిడిగా ఉంది. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. రాబోయే 30 నుంచి 40 ఏళ్లు తమ పార్టీయే అధికారంలో ఉండనుందని, భారతదేశం ‘విశ్వ గురువు’ అవుతుందని అమిత్ షా అన్నారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ, కుటుంబ రాజకీయాలు, కులతత్వం సహా బుజ్జగింపు రాజకీయాలు మహా పాపాలని.. ఎన్నో సంవత్సరాలుగా దేశంలోని కష్టాలకు కారణమని అన్నారు.
“తెలంగాణ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ కుటుంబ పాలనను అంతం చేస్తుందని, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశాలో కూడా అధికారంలోకి వస్తుందని, బీజేపీ పార్టీ 2014లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు అధికార యాత్రకు దూరంగా ఉన్న ఇతర రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని హోంమంత్రి చెప్పారని” విలేకరులతో మాట్లాడుతూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చెప్పారు.