
File Photo
అసోం సంస్కృతికి విరుద్ధంగా ఉన్న ఊర్లు, ప్రాంతాల పేర్లు మార్చే పనిలో పడ్డారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాశర్మ. బెంగాల్ సుల్తాన్ పేరుమీద ఉన్న కాలాపహాడ్ పేరు మార్చాల్సి ఉందన్నారు. అందుకు తగిన పేరు సూచించాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యేను కోరారు.
కాలాపహార్ మాత్రమే కాదు… అసోంలోని ఊరు, పట్టణం ప్రతీ నగరం పేర్లు స్థానిక సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. అసోంవ్యాప్తంగా అందుకు విరుద్ధంగా ఉన్న పేర్లను మార్చాలనుకుంటున్నట్టు చెప్పారు. ఊర్లు, ప్రాంతం పేర్లతో ఓ కులం, ఓ వర్గాన్ని సూచించే పేర్లు ఉండవద్దు. అందుకు సంబంధించి పేర్లమార్పుపై ప్రజలనుంచి సూచనలు ఆహ్వానించేందుకు ఓ పోర్టల్ ను ప్రారంభించనున్నాం అని హిమంత ట్వీట్ చేశారు కూడా.
గువాహటిలోని కాలాపహర్ మెడికల్ కాలేజీ భూమిపూజ సందర్భంగా ఆయన మాట్లాడారు. చరిత్ర, సంస్కృతికి అనుగుణంగాలేని ప్రదేశాలు, గ్రామాల పేర్లను మారుస్తున్నాం. కొన్ని ప్రాంతాల పేర్లు స్థానికులకే నచ్చడంలేదు..ఇక గతంలో దురుద్దేశంతో పెట్టిన పేర్ల పట్ల కూడా ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ఆయన అన్నారు. కాలాపహార్ కూడా అలాంటిదేనని..ఈ పేరు తొలగించాల్సి ఉందని… ప్రజలతో సంప్రదించి తగు పేరు సూచించాలని స్థానిక ఎమ్మెల్యేనూ కోరినట్టు ఆయన చెప్పారు. నిరంకుశ ముస్లిం జనరల్ పేరుమీద కాలాపహార్ అని పేరుపెట్టారని… ప్రసిద్ధ శక్తిపీఠం కామాఖ్య ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేసిన దుర్మార్గుడు అతడని శర్మ అన్నారు.
అసోం పౌరాణిక, చారిత్రక నేపథ్యం దృష్ట్యా మెడికల్ కాలేజీకి ప్రాగ్జోతిషపూర్ మెడికల్ కాలేజీ అని పేరు పెట్టనున్నట్టు చెప్పారు. 480 పడకలు, 46 ఐసీయూలు, ఏడు హైటెక్ థియేటర్లు సహా సకల సౌకర్యాలతో…. 450 మంది విద్యార్థులు. 100మంది ఇంటర్న్ ల కోసం వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.