జ్ఞానవాపి మసీదు సముదాయానికి సంబంధించిన వీడియో సర్వే పూర్తైనప్పటికీ నివేదికను గడువులో సమర్పించలేకపోతున్నారు. అందుకు కాస్త అదనపు సమయం కోరుతున్నామని అసిస్టెంట్ కోర్టు కమిషనర్ అజయ్ సింగ్ తెలిపారు.అసలైతే మంగళవారంలోగా నివేదిక సమర్పించాలి.
“కోర్టు ఆదేశాల మేరకు జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ లో వీడియోగ్రఫీ సర్వే మే 14 నుంచి 16 వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగింది . నివేదికను మంగళవారమే కోర్టుకు సమర్పించాల్సి ఉంది. కానీ నివేదిక సిద్ధం కానందున…కోర్టు నుంచి అదనపు సమయం కోరుతాం’ అని అసిస్టెంట్ అడ్వకేట్ కమిషనర్ అజయ్ ప్రతాప్ సింగ్ తెలిపారు.
సోమవారం కోర్టు నిర్దేశించిన సర్వేలో వారాణసిలోని జ్ఞానవాపి మసీదు-కాశీ విశ్వనాథ ఆలయ సముదాయంలో శివలింగం కనుగొన్నట్లు చెప్పడంతో మందిర్-మసీదు వ్యవహారం చర్చకు దారితీసింది.కాగా జ్ఞానవాపి మసీదును సర్వే చేయాలని ఆదేశించడం, స్థలాలను సీల్ చేయడం అన్యాయమని ముస్లిం పర్సనల్ లా బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది.మసీదులోని కొలనులో శివలింగం దొరికిందని హిందువులు అంటుంటే.. అది ఫౌంటెన్ అని మసీదు కమిటీ అంటోంది.