భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈరోజు ఉదయం 7.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణ పతకాన్ని ఎగరేశారు. ఈ సందర్భంగా మోదీ దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధి వద్ద ప్రధాని నివాళులు అర్పించారు. అనంతరం ఎర్ర కోటకు చేరుకున్న ప్రధాని మోదీకి.. త్రివర్ణ దళాల చీఫ్ ల సమక్షంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, డిఫెన్స్ సెక్రటరీ డాక్టర్ అజయ్ కుమార్ స్వాగతం పలికారు. త్రివిధ దళాల గౌరవ వందనాన్ని ప్రధాని మోదీ స్వీకరించారు.
ప్రపంచవ్యాప్తంగా భారత స్వాతంత్ర్య దినోత్సవం జరుగుతోందని.. భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గాంధీ, సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్ లకు మనం రుణపడి ఉండాలన్నారు. మంగళ్ పాండేతో ప్రారంభమైన పోరాటంలో ఎందరో సమిధలయ్యారని.. అల్లూరి, గోవింద్ గురు వంటివారి తిరుగుబాట్లు మనకు ఆదర్శమన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు.. భారత్ స్వతంత్రంగా మనుగడ సాగించలేదని.. ముక్కలు చెక్కలు అవుతుందన్నారని.. కానీ వారి అభిప్రాయం తప్పని నిరూపించామన్నారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిదన్నారు. దేశంలోని ప్రతి ఒక్క పేదవారికీ సాయం అందేలా చూడటమే తన జీవిత లక్ష్యమన్నారు. ఆకలికేకలు, యుద్ధాలు, తీవ్రవాదం సమస్యలకు ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నామని ప్రధాని వ్యాఖ్యానించారు.
మహాత్ముని ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నామని.. దేశ ప్రగతిని పరుగులు పెట్టించేందుకు పౌరులు సిద్ధంగా ఉన్నారని మోదీ అన్నారు.
అవినీతి, బంధుప్రీతి అనే రెండు అతిపెద్ద సవాళ్లను నేడు దేశం ఎదుర్కొంటోందన్నారు.. అవినీతి దేశానికి పట్టిన చెదలులా మారిందని.. దానితో మనం పోరాడాలన్నారు ప్రధాని.. అవినీతికి వ్యతిరేకంగా అవగాహన పెంపొందించాలన్నారు. భారత మూలాలున్న విద్యావిధానానికి ప్రాణం పోయాలని.. యువశక్తిలో దాగిన సామర్థ్యాలను వెలికితీయాలని ప్రధాని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రకృతి వ్యవసాయం దేశానికి నూతన బలాన్ని ఇస్తుందని.. గ్రీన్ జాబ్స్ తో బోలెడన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. మన అవసరాల కోసం ఆయిల్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడ్డామన్న ప్రధాని.. పెట్రోల్‌లో పది శాతం ఇథనాల్ కలిపేలా ప్రణాళికలు రూపొందించామన్నారు.
గన్ సెల్యూట్ లో తొలిసారిగా దేశీయంగా రూపొందించిన హౌవిట్జర్ తుపాకులను ఉపయోగించారు. స్పెషల్ యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ఆఫ్ ది నేషనల్ క్యాడెట్ కార్ప్స్ లో భాగంగా.. 14 దేశాలకు చెందిన 26 మంది ఆఫీసర్లు, 127 మంది క్యాడెట్లు భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఇండిపెండెన్స్ డే వేడుకల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పది వేల మందికిపైగా భద్రతా సిబ్బందితో ఎర్రకోట వద్ద రక్షణ ఏర్పాటు చేశారు.