బీజేపీ కార్యవర్గ సమావేశాలు ముగిసిన అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన విజయ సంకల్ప సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. సభా వేదికపైకి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను మోదీ భుజం తట్టి అభినందించారు. బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్రమోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. బీజేపీని ఆశీర్వదించేందుకు ఎంతో దూరం నుంచి వచ్చిన సోదర, సోదరీమణులకు ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు” అని అన్నారు. భద్రాచలంలో శ్రీరాముడు, యాదాద్రిలో లక్ష్మీనరసింహ స్వామి, జోగులాంబ అమ్మవారు, వరంగల్ భద్రకాళీ అమ్మవారి ఆశీర్వాదాలు ఉన్నాయని ఆయనన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తోందని ప్రధాన మంత్రి మోదీ పేర్కొన్నారు. సబ్కా సాథ్.. సబ్కా వికాస్ మంత్రంతో తెలంగాణను మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు బీజేపీ కట్టుబడి వుందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రధాన మంత్రి మోదీ పేర్కొన్నారు.రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ఎంతో కృషి చేస్తోందన్నారు.తెలంగాణలో మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మిస్తామని చెప్పారు.
కరోనా సమయంలో తెలంగాణ ప్రజలకు ఎంతో చేశామని… ఉచిత రేషన్, ఉచిత వ్యాక్సిన్ అందించామని మోదీ గుర్తు చేశారు.తెలంగాణ ప్రజల్లో బీజేపీపై నమ్మకం బాగా పెరుగుతోందని, 2019 ఎన్నికల్లోనూ ఇక్కడి ప్రజలు బిజెపికి మద్దతుగా నిలిచారని చెప్పారు.
హైదరాబాద్‌లో సైన్స్ సిటీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని, బయో మెడికల్ సైన్సెస్ కేంద్రాలు కూడా ఏర్పాటవుతున్నాయని పేర్కొన్నారు.
తెలుగులో టెక్నాలజీ, మెడికల్ చదువులు ఉంటే ఎంతో బాగుంటుంది.. దానికి అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణలో 5 నీటి ప్రాజెక్టులకు కేంద్రం సహకరిస్తోందని అన్నారు. రైతుల కోసం కనీస మద్దతు ధరను పెంచాం. హైదరాబాద్‌లో 1500 కోట్లతో ఫైఓవర్లు, ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌లు నిర్మిస్తున్నామని, 350 కోట్లతో హైదరాబాద్‌కు మరో రీజనల్ రింగ్ రోడ్డు మంజూరు చేశామని మోదీ ప్రకటించారు.