ప్రాంతాలు ఏమయినా మనమంతా భారతీయులం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. కలిసికట్టుగా మనం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్
వేదికగా లోకమంథన్ 2024’’ కార్యక్రమాన్ని జ్యోతిప్రజ్వలన చేసి రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ… భారత సమాజాన్ని చీల్చడానికి అన్ని మూలలా కుట్రలు జరుగుతున్నాయని, భారతీయ సమాజంలోనే అత్యంత సహజంగా వున్న ఏకత్వ లక్షణాన్ని విచ్ఛిన్నం చేయడానికి, మరి కొందరు భారతీయుల్లో కృత్రిమ భేద భావాలను సృష్టిస్తున్నారన్నారు. అయినా సరే.. భారతీయత అన్న ధర్మం ఆధారంగా ప్రజలందరూ కలిసికట్టుగానే వున్నారన్నారు.
చాలా కాలం పాటు భారత దేశాన్ని విదేశీయులు పాలించారని, ఈ సమయంలో ఆ సామ్రాజ్యవాద శక్తులు భారత ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టడంతో పాటు ఇక్కడి సామాజిక స్థితిగతులను కూడా ఛిన్నాభిన్నం చేశారన్నారు. మన సంస్కృతిని ఆంగ్లేయులు ఏహ్యభావంతో చూసేవారని, అలాగే మనలో కూడా మన సంస్కృతిపై ఏహ్య భావం వచ్చేలా కుట్రలు చేశారన్నారు. విదేశీయులు చాలా సంవత్సరాలు పరిపాలించడంతో మెదళ్లలో వలసవాద బుద్ధే ఆక్రమించిందన్నారు. భారత్ ని శ్రేష్ఠమైన దేశంగా నిర్మాణం చేయడానికి, భారతీయుల మానసిక ప్రవర్తనను మార్చి, వారిని ఏకత్వం, శ్రేష్ఠత్వం వైపు తీసుకెళ్లాల్సిన కర్తవ్యం అందరిపై వుందని సూచించారు.
ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులైన
జిష్ణుదేవ్ వర్మ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్, కేంద్ర బొగ్గు & గనుల శాఖ మంత్రి, లోక్ మంథన్ రిసెప్షన్ కమిటీ చైర్మన్ జి.కిషన్ రెడ్డి, ప్రజ్ఞా ప్రవాహ్ ప్రధాన కార్యదర్శి నంద కుమార్, ప్రజ్ఞాభారతి చైర్మన్ డా హనుమాన్ చౌదరి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు విచ్చేశారు.
మూడు రోజుల పాటు ఈ కళా జాత జరుగుతుంది.