ఇటీవలే హిందూమతంలోకి మారిన వసీంరిజ్వీ రాసిన పుస్తకంలో ఇస్లాంను, ఖురాన్ ను కించపరిచేలా ఉందని…దాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ ను డిల్లీ హైకోర్టు తిరస్కరించింది. పుస్తకాన్ని బ్యాన్ చేయడంతో పాటు… రిజ్వీ భవిష్యత్తులో అలాంటి రాతలు రాయకుండా ఉండేందుకు 2 కోట్ల 5 లక్షల రూపాయల జరిమానా విధించాలంటూ కమర్ హస్నైన్ వ్యాజ్యం వేశారు. ఇప్పటివరకు విక్రయించిన పుస్తకాల కాపీలను తగులబెట్టేలా ఆదేశం ఇవ్వాలని పిటిషనర్ కోరారు. అయితే జస్టిస్ సంజీవ్ నరులాతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ ఈ పిటిషన్ ను కొట్టివేసింది.
పుస్తకం బ్యాన్ చేయాలని పిటిషనర్ కోరుతున్నప్పటికీ అందుకు సంబంధించి ఆధారాలేవని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఓ మతం మనోభావాలు దెబ్బతీసేలాంటివేవీ కనిపించడం లేదని అన్నారు. అలాంటప్పుడు చర్యలకు ఎలా ఆదేశిస్తామని కోర్టు వ్యాఖ్యానించింది. సదరు వ్యక్తి రాతల వల్ల, తీరువల్ల ప్రజలకు పెద్దగా హాని లేనప్పుడు… చర్యలు అక్కర్లేదని కోర్టు అంది. ఈ కేసును కోర్టుకు తీసుకురావడానికి పిటిషనర్‌కు చట్టపరమైన హక్కు లేదని అభిప్రాయపడుతూ కేసును కొట్టేసింది.
షియా వక్ఫ్ బోర్డ్ మాజీ చీఫ్ అయిన వసీం రిజ్వీ డిసెంబర్ 2021లో ఇస్లాం మతాన్ని త్యజించి హిందుమతంలోకి మారారు. దీంతో ఇస్లామిస్టులు ఆయన్ని టార్గెట్ చేశారు. ఘజియాబాద్‌లోని దాస్నా దేవి ఆలయంలో మహంత్ యతి నరసింహానంద గిరి సమక్షంలో ఆయన హైందవం స్వీకరించి జితేంద్రనారాయణస్వామిగా పేరు మార్చుకున్నారు.
ఇటీవల, రిజ్వీ తన ‘మహమ్మద్’ పుస్తకాన్ని దాస్నా మహంత్ సమక్షంలోనే ఆవిష్కరించారు. దానిపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ సహా పలువురు ఆయనపై ఫిర్యాదు చేశారు. అంతకుముందు, రిజ్వీ ఖురాన్ నుండి 26 శ్లోకాలను తొలగించాలని..అవి ఉగ్రవాదాన్ని ప్రేరేపించేలా ఉన్నాయని అన్నారు. ఇక షియా వక్ఫ్ బోర్డు అధినేతగా రిజ్వీ అయోధ్యలోని రామజన్మభూమి పోరాటానికి మద్దతు పలికారు.