మరో లవ్ జిహాద్ కేసు యూపీలో వెలుగు చూసింది. రాంపూర్ బారాబాదీకి చెందిన ఓ బాలికను నమ్మించి మోసం చేశాడు వసీమ్ అన్సారీ అనే ముస్లిం యువకుడు. ఐదేళ్ల క్రితం ఆమె 16 ఏళ్ల వయసులో తనతో పరిచయం పెంచుకున్నాడు. రవిశర్మగా పరిచయం చేసుకుని దగ్గరయ్యాడు. తరుచూ ఫోన్ చేస్తుండేవాడు. ఆమెకు మైనార్టీ తీరగానే పెళ్లిచేసుకుందామని ప్రపోజ్ చేశాడు. కొంతకాలంగా లైంగిక వేధింపులకూ పాల్పడుతున్నాడు. ప్రస్తుతం ఆ యువతి వయసు 21 ఏళ్లు.
ఇజ్జత్ నగర్ కు చెందిన వసీం అన్సారీ టైల్స్ వర్కర్ గా పనిచేస్తున్నాడు. 2017లో ఆమెతో పరిచయం పెంచుకుని దగ్గరవుతూ వస్తున్నాడు. అయితే రెండేళ్లకు అంటే 2019లో ఫేస్ బుక్ ద్వారా ఆమెకు నిజం తెలిసింది. అతనిపేరు రవిశర్మ కాదని వసీం అన్సారీ అని తెలియడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను మోసపోయానని వాపోయింది.అయితే క్షమించమని వేడుకుంటూ ఆమె వెంట పడ్డాడు. తన దగ్గరున్న ఆమె ఫొటోలు వీడియోలు బయటపెడతానని బెదిరించడం మొదలు పెట్టాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బాగా తాగి యువతి ఇంట్లోకి ప్రవేశించి ఆమెను ఇష్టంవచ్చినట్టు తిట్టి కొట్టాడు.
మరోసారి ఏప్రిల్ 24న ఆమెను కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. ఇంట్లోవాళ్లు, ఇరుగుపొరుగు అడ్డుకోవడంతో పారిపోయాడు. బాధితురాలు మరోసారి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడికోసం గాలిస్తున్నారు.