పాకిస్తాన్తో అమీ తుమీ తేల్చుకునేందుకు భారత్ సిద్ధపడుతోంది.
పూర్తిస్థాయి యుద్ధం, లేదా కొంత భూభాగాన్ని ఆక్రమించడం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను తీసేసుకోవడం, చివరికి సర్జికల్ స్ట్రైక్స్ చేయడం.. అనే ఆప్షన్స్ పరిశీలిస్తున్నారు.
ఏమైనా కానీ పాకిస్తాన్ కు పూర్తిస్థాయిలో బుద్ధి చెప్పేందుకు సైనిక బలగాలు సన్నాహాలు చేస్తున్నాయి.
సైనిక ఆపరేషన్ మీద భారత్ అన్ని చర్యలూ చేపడుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ముగ్గురు సైన్యాధిపతులు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. ఇందులో త్రివిధ దళాధిపతులు సైనిక రంగ నిపుణులు పాలుపంచుకొన్నారు.
ఈ సమావేశం తర్వాత, ప్రతీకారం తీర్చుకోవడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. మన ప్రతీకారం ఎలా ఉండాలి? దాని లక్ష్యాలు ఎలా ఉండాలి? దాని సమయం ఎలా ఉండాలి వంటి కార్యాచరణ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ సాయుధ దళాలకు ఇస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
ఆపరేషన్ పద్ధతి, లక్ష్యం, సమయాన్ని నిర్ణయించే అధికారం సైన్యానికి ఇచ్చారు. సైన్యం సామర్థ్యాలపై ప్రధానమంత్రి పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి బలమైన ప్రతిస్పందన ఇవ్వాలనే భారతదేశం దృఢ సంకల్పాన్ని పునరుద్ఘాటించారు. సమావేశంలో, త్రివిధ దళాధిపతులు వారి అంచనాలు, కార్యాచరణ ప్రణాళికలను ప్రధాని మోదీకి వివరించారు. ప్రధానమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం సైన్యానికి ఒక ముందస్తు అనుమతిగా, ప్రతీకారం తీర్చుకునే స్వేచ్ఛగా భావిస్తున్నారు.
మొత్తం మీద పాకిస్థాన్ జీవితాంతం గుర్తు ఉంచుకొనేలా బుద్ధి చెప్పాలని నిర్ణయించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన కార్యాచరణ మొదలు అవుతుంది అని తెలుస్తోంది.