చారిత్రక వక్ఫ్ బోర్డు సవరణల బిల్లుకి ఆమోదం అందబోతోంది. దుర్మార్గపు విధానాలతో కూడిన వక్ప్ బోర్డులో సంస్కరణలు తీసుకొని వచ్చేందుకు ఈ బిల్లుని ప్రవేశ పెడుతున్నారు. దీని ద్వారా పారదర్శక విధానాలు అమలు అవుతాయి.
ఇందుకు సంబంధించిన శాసన విధాన కసరత్తు ఊపందుకొంది. ‘వక్ఫ్ సవరణ బిల్లు-2024’పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) రూపొందించిన నివేదికను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. జేపీసీకి చైర్మన్‌గా వ్యవహరించిన జగదంబికా పాల్, బిజెపి ఎంపీ సంజరు తదితరులు ఈ ముసాయిదా బిల్లుపై తమ నివేదికను హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సభ ముందుకు తీసుకొచ్చారు. ఈ బిల్లుపై నివేదికను రాజ్యసభ ఎంపీ మేధా కులకర్ణి సభలో ప్రవేశపెట్టారు.
బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు సభలో గందరగోళం నెలకొంది. నివేదికపై ప్రతిపక్ష ఎంపీలు నిరసన తెలిపారు. తాము సమర్పించిన డిస్సెంట్ (అసమ్మతి) నోట్‌ను తొలగించారంటూ నిరసనకు దిగారు. సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభను చైర్మన్ జగదీప్ ధన్ఖర్ 20 నిమిషాల పాటు వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైనప్పటికీ ప్రతిపక్షాలు తమ నిరసనను కొనసాగించాయి. ఈ నిరసనల మధ్యే ఈ నివేదికకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.
ఇప్పటికే జాయింట్ పార్లమెంటరీ సంఘం కసరత్తు పూర్తి అయినది.
జనవరి 29న ముసాయిదా నివేదికను జెపిసి ఆమోదించిన విషయం తెలిసిందే. బీజేపీ సభ్యులు సూచించిన 14 సవరణలను కమిటీ ఆమోదించింది. అయితే కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఆప్, శివసేన(యూబీటీ), ఏఐఎంఐఎంతోసహా ప్రతిపక్ష సభ్యులు సూచించిన ప్రతి మార్పును కమిటీ తిరస్కరించింది. ఈ సవరణలతో వక్ఫ్‌బోర్డులలో ఇతరులు కూడా సభ్యులుగా ఉంటారు.
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రతిపక్ష పార్టీలు ఈ సవరణలను వ్యతిరేకిస్తున్నాయి. అయినప్పటికీ పార్లమెంటరీ విధానాలతోనే బిల్లుని ఆమోదించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా పార్లమెంటు ముందుకు ఈ బిల్లును తీసుకురావడం జరిగింది.