ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సనాతన ధర్మం దిశగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు తో పాటు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైందవ ధర్మానికి పెద్దపీట వేస్తున్నారు. బిజెపి మొదటి నుంచి హైందవ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంది అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ని దర్శించేందుకు దేశ విదేశాల నుంచి భక్తుల వస్తారన్న సంగతి తెలిసిందే. ఈ యాత్రికుల అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించేందుకు భారీ ప్రణాళికను రూపొందిస్తున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకవర్గం ఆధ్వర్యంలో దీనికోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే విజన్ 2047 ను ప్రజల ముందుకు తెచ్చింది. ఇదే మాదిరి విజన్ 2047 ప్రణాళికను తిరుమలకు కూడా రూపొందిస్తున్నారు.
ఈ దిశగా టీటీడీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
దీని ద్వారా తిరుమలకు అద్భుతమైన శోభ వస్తుందని అంచనా వేస్తున్నారు. తిరుమల అభివృద్ధిలో సాంప్రదాయాన్ని, ఆధునికత ను సమతుల్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించిన మేరకు టీటీడీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. తిరుమల విజన్ 2047 లక్ష్యాలను చేరుకునేందుకు, పట్టణ ప్రణాళిక, ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్, వారసత్వ పరిరక్షణ, పర్యావరణ నిర్వహణపై ప్రత్యేక నైపుణ్యం కలిగిన ఏజెన్సీల నుంచి ప్రతిపాదనలను టీటీడీ ఆహ్వానిస్తోంది.
రాగల రోజుల్లో ప్రతిరోజు తిరుమలకు లక్ష మంది భక్తులు వస్తారని అంచనా. ఈ యాత్రికల కోసం ఆధునిక వసతులతో పాటు
ఆధ్యాత్మిక భక్తి కల్పించేట్లు ప్రణాళిక తయారు చేస్తున్నారు. . తిరుమల అభివృద్ధిపై దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేయడం, ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని జోనల్ అభివృద్ధి ప్రణాళికను సవరించడం, తిరుమల పవిత్రతను కాపాడుతూ భక్తుల సౌకర్యాలను మెరుగుపరచడానికి కన్సల్టెంట్ను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. మూడు వారాల్లోగా ఆసక్తి గల ఏజెన్సీల నుంచి ప్రతిపాదనలను కోరుతున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో అనుభవం కలిగిన సంస్థలకు ఈ పని అప్పగించాలని టిటిడి భావిస్తోంది. అదే సమయంలో హైందవ భావాలు కలిగి ఉండడం కూడా ప్రాధాన్యతలో తీసుకుంటున్నారు. అంతిమంగా అంతర్జాతీయ పుణ్యక్షేత్రంగా తిరుమలను తీర్చిదిద్దేందుకు సంకల్పించుకున్నారు.