రాజకీయ గుత్తాధిపత్యం నుంచి దేవాలయాలకు విముక్తి కల్పించాలని హైందవ శంఖారావం తీర్మానం చేసింది. ఇందుకోసం చిత్త శుద్ధి తో పనిచేస్తామని సభకు హాజరైన మూడు లక్షల మంది ప్రతినిధులు ప్రతిన పూనారు. హైందవ శంఖారావం స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాలకు చెందిన హైందవ భావజాలం ఒక్కచోటకు చేరుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే లక్షలమంది ఒక్క గొంతుకను వినిపించి హైందవ స్ఫూర్తిని తెలియజేశారు.
…….
విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం వద్ద కేసరపల్లి హైందవ శంఖారావం సభకు దాదాపు మూడు లక్షల మంది స్వచ్ఛందంగా తరలి వచ్చారు. దేశంలోని దేవాలయాలు అన్నింటినీ ప్రభుత్వాల కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. రాజకీయాలు, కులాలు, ప్రాంతాలు, వర్గాలు, వర్ణాలకు అతీతంగా స్వచ్ఛందంగా జన సాగరం వలే హైందవ శంఖారావానికి రావడం జరిగింది.
…………..
ఈ సదస్సులో విశ్వహిందూ పరిషత్ అఖిల భారత అధ్యక్షులు అలొక్ కుమార్, జాతీయ సంఘటన కార్యదర్శి మిలింద్ , జాతీయ సహ సంఘటన కార్యదర్శి కోటేశ్వర శర్మ అతిథులుగా విచ్చేశారు.
స్వామీజీలు త్రిదిండి చిన్న జీయర్ స్వామి, గణపతి సచ్చిదానంద , శివ స్వామి , కమలానంద భారతి, కొండవీటి జ్యోతిర్మయి, మాత సరస్వతి దేవి, రాష్ట్రంలోని దాదాపు 100 మంది స్వామీజీలు ఆశీస్సులు అందించారు. బిజెపి నుంచి మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు,
ఎంపీలు పురందేశ్వరి , సీఎం రమేష్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్, పార్థసారథి తదితరులు హాజరయ్యారు.
………
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా హైందవ శంఖారావం జరుగుతోంది అన్నారు. ఈ స్ఫూర్తితో దేశమంతటా జాతీయస్థాయి ఉద్యమాన్ని నిర్మించుకుందాం అని పిలుపునిచ్చారు . దేశంలోని అన్ని ప్రభుత్వాలు కూడా దేవాలయాలను ప్రభుత్వాల కబంధ హస్తాల నుండి విముక్తి కలిగించాలని అన్నారు. ఇందుకోసం జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దాదాపు 15 లక్షల ఎకరాల భూమి దేవాలయాలకు ఉండేదని .. ఇప్పుడు ఐదు లక్షల ఎకరాలు మాత్రమే మిగిలిందని వివరించారు. ధూప ,దీప , నైవేద్యాలు కూడా నోచుకోక దేవాలయాలు ఇబ్బంది పడుతున్నాయని తెలియజేశారు. సెక్యులరిజం పేరుతో ఇతర మతాల లోనికి వెళ్లిన వాళ్ళకే రిజర్వేషన్లు ఇస్తున్నారని,, దీని ద్వారా నిజమైనటువంటి ఎస్సీ ఎస్టీ ,బీసీలకు తీరని అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు.
……
ఈ బహిరంగ సభలో వివిధ క్షేత్రాలు అయిన ఏబీవీపీ, భజరంగ్ దళ్, విద్యా భారతి వంటి దాదాపు 40 సంస్థలకు చెందిన నాయకులు మరియు సభ్యులు పాల్గొనడం జరిగింది. మూడు లక్షల మంది సబికులకు కావలసిన అన్ని రకాల వసతులను వివిధ క్షేత్రాల కార్యకర్తలు స్వచ్ఛందంగా సమకూర్చారు. ఎటువంటి అసౌకర్యం లేకుండా సభకు విచ్చేసిన వారందరికీ పూర్తిస్థాయిలో సదుపాయాలు కల్పించారు. దేవాలయాల విముక్తి కోసం పోరాడుతాం అన్ని ప్రతిజ్ఞ తీసుకొని.. ప్రతినిధులు అంతా స్వస్థలాలకు మళ్ళారు.