ప్రతి ఏడాది జూలై నెల 26వ తేదీన కార్గిల్ విజయ్ దివస్ జరుపుకోవడం ఆనవాయితీ . దొంగ చాటుగా సరిహద్దుల్లో చొరబడిన శత్రువులను తరిమికొట్టేందుకు మన సైనిక సోదరులు ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేశారు. ఎందరో సైనిక వీరులు ప్రాణాలు కోల్పోయి అమరులుగా మిగిలారు. వాయు సేన, సైనిక బలగాలు లు సంయుక్తంగా చేసిన పోరాటం ఫలించి కార్గిల్ ను దక్కించుకున్నాము.
సైనిక వీరుల విజయ గాథ మనందరికీ స్ఫూర్తిదాయకము. పాకిస్తాన్ చొరబాట్లకు బుద్ధి చెప్పడమే లక్ష్యంగా భారత సైన్యం ‘ఆపరేషన్ విజయ్’ మొదలు పెట్టింది. పెద్ద సంఖ్యల్లో సైనికుల్ని కార్గిల్‌కు తరలించింది. యుద్ధ క్షేత్రమంతా ఎత్తైన కొండలు. శత్రుమూకలను తిప్పి కొట్టడం తేలిక కాదు. పాకిస్తాన్ సైన్యం కార్గిల్‌ను అక్రమించడానికి వెనుక ఉన్న ధైర్యం ఎత్తైన కొండలే. దాదాపు 130 కిలో మీటర్ల పరిధిలో 16-18 వేల అడుగుల ఎత్తైన పర్వతాల మీద నుంచి జాతీయ రహదారి (ఎన్ హెచ్ 1డీ)పై రాకపోకలు, భారత సైన్యం కదలికలను తేలికగా గమనించవచ్చు. దీనికి తోడు గడ్డకట్టుకు పోయేంత చల్లటి ఉష్ణోగ్రతలు. గత యుద్ధాలలో ఓటముల కారణంగా భారత్‌తో ముఖాముఖి యుద్ధం చేయడం కష్టమని పాక్ గ్రహించింది. కొండలను ఎంచుకొని భారత్ సైన్యానికి ఎక్కవ నష్టం కలిగించాలనే వ్యూహం ఇందుకే.
కీలకమైన జాతీయ రహదారి-1డి పాక్ శతఘ్ని దాడికి గురయ్యే పరిధిలో ఉండటంతో సైన్యాన్ని, ఆయుధాలను తరలించడం, విమానాల ద్వారా సామాగ్రిని చేరవేయడం కూడా కష్టమైపోయింది. అందుకే జూన్ రెండో వారానికి గాని భారత్ యుద్ధభూమి మీద పట్టు సాధించలేకపోయంది. ఆ తర్వాత చొరబాటును నియంత్రించే స్థితికి వెళ్లింది. శత్రువుల దగ్గర ఆయుధాలు, గ్రనేడ్లు మాత్రమే కాక ఫిరంగులు, శతఘ్నులు, యుద్ధవిమానాలని కూల్చివేసే తుపాకులు ఉన్నాయి. మానవరహిత విమానాలు, అమెరికా సమకూర్చిన ఫైర్ ఫైండర్ రాడార్ల ద్వారా పాకిస్తాన్ పర్యవేక్షణ కొనసా గించింది. 8,000 మందు పాతరలు కనుగొన్నట్లు తర్వాత కాలంలో భారత్ ప్రకటించింది.
మే 26న చొరబాటుదారులపై భారత వాయుసేన దాడులు మొదలయ్యాయి. ఇదే ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’. మిరాజ్ 2000 ఫైటర్ జెట్ల సహాయంతో వైమానికదళం శత్రుసైన్యంపై బాంబుల వర్షం కురిపించి కొన్ని స్థావరాలను నేలమట్టం చేసింది.ఈ పోరాటంలో భారత వైమానిక దళం ఒక మిగ్-27 స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్ట్‌ని ఇంజిన్ విఫలం కావడంతో కోల్పోయింది. మరో మిగ్-21 ఫైటర్ ని పాక్ దళాలు కూల్చివేశాయి. మొదట్లో రెండిరటినీ తామే కూల్చినట్లు పాకిస్తాన్ చెప్పుకుంది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత రిటైర్డ్ పాక్ ఆఫీసరు సాంకేతిక సమస్యల వల్లే కూలిందని చెప్పాడు.
మే 27, 1999న ఫ్లైట్ లెఫ్టినెంట్ నచికేత నడుపుతున్న మిగ్-27లో ఇంజన్ లోపంతో బటాలిక్ సెక్టార్లో ఉండగా పారాచూట్ సాయంతో బయట పడ్డారు. పాక్ సైన్యం యుద్ధఖైదీగా పట్టుకుంది. నచికేత జాడ కనిపెట్టడానికి వెళ్లిన స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహూజా విమానాన్ని మిసైల్ సహాయంతో పాక్ దళాలు కూల్చేశాయి. విమానం కూలి పోవడానికి ముందే అజయ్ అహుజా క్షేమంగా బయట పడి పాక్ దళాలకు దొరకడంతో కాల్చి చంపారు. మే 28న ఎమ్ఐ-17 హెలికాప్టరును పాకిస్తాన్ కూల్చడంతో నలుగురు సిబ్బంది మరణించారు. జూన్ 1న పాకిస్తాన్ దాడులను ముమ్మరం చేసింది. జాతీయ రహదారి 1ఎ పై బాంబులు వేసింది.
ద్రాస్ సెక్టార్లో ఎన్‌హెచ్ 1డీ చేరువలో ఉన్న పర్వత శిఖరాలను స్వాధీన పర్చుకోవడం మొదటి ప్రాధాన్యతగా భావించింది భారత సైన్యం. అందుకే ద్రాస్‌లో ఉన్న టైగర్ హిల్, టోలోలింగ్ పర్వతాల మీద గురిపెట్టారు. ఆ తర్వాతే సియాచిన్ వైపు ప్రవేశించే బటాలిక్-టుర్ టోక్ సబ్ సెక్టార్ మీద దాడి చేశారు. జూన్ 6 న భారత సైన్యం పెద్ద ఎత్తున దాడులు మొదలుపెట్టింది. జూన్ 9 బటాలిక్ సెక్టారులో రెండు కీలక స్థావరాలను భారత సైన్యం తిరిగి వశపరచుకుంది.
సముద్ర మట్టానికి 16 వేల అడుగుల ఎత్తులో ఉన్న టోలోలింగ్ పర్వత శిఖరాన్ని స్వాధీనం చేసుకోవడానికి భారత సైన్యం 110 డిగ్రీల చలిగాలుల మధ్య పోరాటం సాగించింది. కర్నల్ రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో సైన్యాన్ని అర్జున్, భీమ, అభిమన్యు అని మూడు భాగాలుగా చేసి త్రిముఖ వ్యూహం పన్ని జూన్ 14, 1999న టోలోలింగ్‌ను స్వాధీనం చేసుకొని జాతీయ జెండా ఎగురవేశారు.
మేజర్ వివేక్ గుప్తా, హైదరాబాద్‌కు చెందిన మేజర్ పద్మపాణి ఆచార్య శత్రుమూకలతో పోరాడి అమరులైౖంది ఇక్కడే. మరికొంత మంది సైనికులను కోల్పోవలసి వచ్చింది. కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్లలో దాదాపు సగం మంది టోలోలింగ్ శిఖర కైవసం సందర్భంగా అమరులయ్యారంటే పోరాటం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. టోలోలింగ్ పర్వత శిఖరాన్ని భారత సైన్యం స్వాధీనం చేసుకోవడం ద్వారా ఈ యుద్ధంలోని కీలక విజయాన్ని నమోదు చేసింది. అయితే దీన్ని నిలుపు కోవడం మరింత కీలకంగా మారింది.
టోలోలింగ్ గెలుపుతో సైన్యం స్థైర్యం పెరగటమే కాదు ఇక్కడి నుంచి లద్దాక్ మార్గం జాతీయ రహదారి 1డిలో దాదాపు 20 కిలోమీటర్ల పరిధి వరకు భారత్ అధీనంలోకి వచ్చింది. ఎన్ హెచ్ 1డీ రహదారి పరిసర ప్రాంతాలలోని స్థావరాలను జూన్ మధ్య నాటికి భారత సైన్యం తిరిగి స్వాధీన పర్చుకుంది. ఆ తర్వాత శత్రువులను నియంత్రణ రేఖ అవతలకి తరిమికొట్టడం మీద దృష్టి పెట్టింది. యుద్ధం ముగిసే వరకు శతఘ్నులతో దాడులు కొనసాగాయి. తర్వాత టైగర్ హిల్స్ మీద దృష్టి పెట్టింది. జూన్ 29న భారత సైన్యం టైగర్ హిల్ సమీపంలోని రెండు కీలక స్థావరాలను పాయింట్ 5060, పాయింట్ 5100 స్వాధీనపరచుకుంది. జూలై 2న మన సైన్యం యుద్ద క్షేత్రంలో త్రిముఖ దాడిని మొదలుపెట్టింది. జూలై 4న దాదాపు11 గంటల పోరు తరువాత, భారత సైన్యం టైగర్ హిల్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకుంది. జూలై 5న భారత సైన్యం ద్రాస్ సెక్టార్ పై పూర్తి నియంత్రణ సాధించింది. జూలై 7న బటాలిక్ సెక్టారులోని జుబర్హైట్స్ను భారత సైన్యం స్వాధీనం చేసుకుంది.
సముద్రమట్టానికి 17 వేల అడుగుల ఎత్తులో ఉన్న పాయింట్ 5140 ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి జరిగిన యుద్ధానికి లెఫ్టినెంట్ కర్నల్ యోగేష్ కుమార్ జోషి నాయకత్వం వహించారు. సైన్యాన్ని రెండు భాగాలుగా చేసి ఒక దానికి లెఫ్టినెంట్ సంజీవ్ సింగ్, మరొక దానికి లెఫ్టినెంట్ విక్రం బాత్ర నాయకత్వం వహించారు. ఇద్దరూ విజయం సాధించి పాయింట్ 5140ని స్వాధీన పరచుకున్నారు. విక్రం బత్రాకు కెప్టెన్‌గా ప్రమోషన్ ఇచ్చారు.
ఆ తర్వాత జూలై 8న కెప్టెన్ విక్రం బత్రా, కెప్టెన్ అనుజ్ నయ్యర్ ఆధ్వర్యంలో సైన్యం పాయింట్ 4875 స్వాధీనానికై బయల్దేరింది. మూడు రోజుల భీకర యుద్ధం అనంతరం జూలై 11న ఆ ప్రాంతం మన వశమైంది. గాయపడిన భారత సైనికుడికి సహాయం చేస్తున్న సమయంలో కెప్టెన్ విక్రం బత్రాను పాకిస్తాన్ సైనికుడు వెనక నుంచి తుపాకీతో కాల్చడంతో ఆ యుద్ధవీరుడు నేలకొరిగాడు. పాయింట్ 4875 శిఖరానికి ‘బాత్రాటాప్’ అని పేరు పెట్టారు. జూలై 11 బటాలిక్‌లోని కీలక శిఖరాలను భారత సైన్యం స్వాధీనపరచుకోవడంతో పాకిస్తాన్ వెనక్కి వెళ్లడం మొదలైంది.
అప్పటి ప్రధానమంత్రి వాజపేయి యుద్ధనీతి ని చాలా గొప్పగా ప్రదర్శించారు. చాకచక్యంగా నిర్ణయాలు తీసుకుంటూ పాకిస్తాన్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చారు.
పోరు తీవ్రంగా సాగుతున్న సమయంలో ఎయిర్ చీఫ్ మార్షల్ అనిల్ యశ్వంత్ ప్రధాని వాజపేయికి ఫోన్ చేసి ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ విజయవంతంగా సాగుతోందని, ఎల్ఓసీని దాటి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని శత్రు స్థావరాలను ధ్వంసం చేసేందుకు అనుమతి ఇవ్వవలసిందిగా కోరాడు. కానీ వాజపేయి స్వీయ నియంత్రణ పాటిస్తూ ఎల్ఓసీని దాటవద్దని చెప్పారు. ఈ నిర్ణయం భారత దౌత్య విజయానికి కీలకమైనదిగా విశ్లేషకులు భావించారు. వాజపేయి యుద్ధ నీతిని ఆసియన్ దేశాలు, యూరోపియన్ యూనియన్ దేశాలే కాకుండా అమెరికా, చైనా కూడా స్వాగతించాయి. అలా సరిహద్దు దాటితే యుద్ధ తీవ్రత పెరగడమే కాక, అంతర్జాతీయంగా అనేక ప్రశ్నలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. భారత్‌కు శాంతి మంత్రమే కాదు, యుద్ధతంత్రం కూడా తెలుసు అని చాటి చెప్పారు వాజపేయి.
జూన్ 15న అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ప్రధాని నవాజ్‌కి ఫోన్ చేసి కార్గిల్ నుండి వెనక్కి తప్పుకోమని స్పష్టం చేశారు. కానీ ఆ ప్రయత్నాలు నత్తనడకన సాగాయి. నవాజ్ తీరుపై క్లింటన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత షరీఫ్ అభ్యర్థనపై క్లింటన్ కలిశారు. ‘బేషరతుగా సైనికులను ఉపసంహరించడం మీకు ఇష్టం లేకపోతే, ఇక్కడికి రాకండి, అని నేను మీకు ముందే చెప్పాను. మీరు అలా చేయకపోతే, ‘కార్గిల్ సంక్షోభానికి దోషి పాకిస్తానే’ అని చెప్పడానికి ముందే సిద్ధం చేసిన ప్రకటన నా దగ్గర సిద్ధంగా ఉంది’ అని షరీఫ్‌తో క్లింటన్ చెప్పేశారు. క్లింటన్‌తో మాట్లాడుతున్నప్పుడే, టీవీలో ‘టైగర్ హిల్‌పై భారత్ పట్టు’ అనే వార్త ఫ్లాష్ అయింది. సమావేశం బ్రేక్ సమయంలో ముషా ర్రఫ్కు ఫోన్ చేసిన నవాజ్ షరీఫ్ వార్త నిజమేనా అని అడిగారు. ముషార్రఫ్ ఖండించలేదు. క్లింటన్‌తో సమావేశం అయిన తర్వాత నవాజ్ షరీఫ్ బయటికి వస్తున్నప్పుడు ఆయన ముఖంలో ఒత్తిడి కనిపించింది
ఒక దశలో పాకిస్తాన్ అణుదాడికి సిద్ధపడు తున్నట్లు వార్తలు వచ్చినా, పూర్తి స్థాయి పరిజ్ఞానం లేకపోవడంతో వెనక్కి తగ్గింది. రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధంపై ప్రపంచ దేశాలు ఆందోళ వ్యక్తం చేశాయి. అంతర్జాతీయంగా పాకిస్తాన్ పై ఒత్తిడి పెరిగింది.
ఒకదశలో భారత నౌకాదళం ఆపరేషన్ తల్వార్ పేరుతో కరాచీ నౌకాశ్రయంతో పాటు ఇతర సముద్రమార్గాలను దిగ్బంధించడానికి సిద్ధమైంది. భారత నౌకాదళానికి చెందిన పశ్చిమ-తూర్పుదళాలు ఉత్తర అరేబియా సముద్రంలోకి చేరాయి. పూర్తి స్ధాయి యుద్ధం సంభవిస్తే పాక్ వద్ద కేవలం ఆరు రోజులకు సరిపడ ఇంధనమే ఉందని నవాజ్ షరీఫ్ చెప్పాడు.
జూలై 14న ఆపరేషన్ విజయ్ విజయవంత మైందని భారత ప్రధాని వాజపేయి ప్రకటించారు. దీంతో పాటు పాకిస్తాన్‌తో చర్చలకు భారత్ షరతులు విధించింది. జూలై 26న యుద్ధం అధికారికంగా ముగిసింది. పాకిస్తాన్ చొరబాటుదారులను పూర్తిగా వెళ్లగొట్టామని భారత సైన్యం ప్రకటించింది. దాదాపు రెండు నెలల 20 రోజుల తర్వాత పాక్ సైన్యం పూర్తిగా వెనక్కి తగ్గింది. దాదాపు 130 స్థావరాలను భారత సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంది.
ఈ విజయ సాధనలో 527మంది సైనికులు బలిదానం చేశారు. 1,363 మంది గాయపడ్డారు. సైన్యానికి అవసరమైన ఆయుధ, ఆహార సరఫరా అందించిన ‘టండా టైగర్’ దళంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 150 మంది గాయపడ్డారు.
పాక్ సైనికులు దాదాపు 12 వందలకు పైగా మరణించి, అంతకు మూడింతలమంది గాయపడినా, ఈ లెక్కలు అధికారికంగా వెల్లడికాలేదు. పైగా వాళ్లంతా తమకు సంబంధం లేదని చేతులు దులుపు కొంది.
కానీ భారత ప్రభుత్వం మాత్రం మన అమరవీరుల కుటుంబాలను గౌరవించింది. చనిపోయిన సైనిక సోదరులకు పతకాలు ప్రకటించింది. నేటి యువతకు ఈ సైనిక సోదరుల పోరాటం సదా స్ఫూర్తి దాయకం.