మంత్రి కేటీఆర్‌కు వీహెచ్‌పీ సూటి ప్రశ్నలు..! ఇదేనా మందిర నిర్మాణంపై మీ వైఖరి..?
అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు ప్రారంభమైన విషయం తెలిసిందే. భవ్యమైన మందిర నిర్మాణం కోసం.. దేశ వ్యాప్తంగా ప్రతి హిందూ కుటుంబం నుంచి నిధి సమర్పణ కార్యక్రమాన్ని.. రామ మందిర నిర్మాణ తీర్ధ క్షేత్ర ట్రస్ట్ చేపడుతోంది. ఇందుకోసం విశ్వ హిందూ పరిషత్, సంఘ్ పరివార్ సభ్యులు ప్రతి గ్రామాం లోని హిందూ కుటుంబాన్ని స్పృషిస్తూ.. నిధి సమర్పణ అభియాన్ చేపడుతున్నారు. అయితే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ అభియాన్ చురుగ్గా సాగుతుండగా.. తెలంగాణ ప్రాంతంలో మాత్రం అధికార పార్టీ టీఆర్ఎస్కు చెందిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మందిర నిర్మాణానికి సంబంధించి చేస్తున్న వ్యాఖ్యలపై విశ్వ హిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్‌పై వీహెచ్‌పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
పరకాల ఎమ్మెల్యే ఇంటిపై దాడి జరిగితే మంత్రి కేటీఆర్ స్పందించారని.. మరి ఆ ఎమ్మెల్యేతో పాటుగా.. మరి కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోటానుకోట్ల మంది భక్తుల విశ్వాసాలపై మాటలతో యుద్ధం చేస్తే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ వారిపై ఎందుకు నోరు మెదపడం లేదంటూ మండిపడ్డారు. సాక్షాత్తు ఓ మంత్రి పేరుతో ఉన్న ట్రస్టు సభ్యులు విడిగా చందా పుస్తకాలను ప్రింట్ చేయించి.. ప్రజల వద్ద నుంచి రాముడి గుడి పేరుతో డబ్బులను వసూలు చేస్తున్నారు. ఈ ఘటనలపై ఎందుకు స్పందించడం లేదని.. సాక్షాత్తు ఓ మంత్రి పేరుతో ఉన్న నడుస్తోన్న ట్రస్టు ద్వారా రామ మందిర నిర్మాణం కోసం అంటూ.. ఆ ట్రస్టు సభ్యులు విడిగా చందా పుస్తకాలను ప్రింట్ చేయించి..
ప్రజల వద్ద నుంచి రాముడి మందిరం పేరుతో డబ్బులను వసూలు చేస్తున్నారని.. ఆర్మూర్ ప్రాంతంలో కూడా ఇలాంటి చర్యలు జరుగుతుంటే.. మంత్రి కేటీఆర్ మౌనంగా ఉన్నారన్నారు.
రాముడి పేరు పెట్టుకున్న మంత్రి కేటీఆర్.. ఇకనైనా టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు బుద్ది చెప్పాలని కోరారు. లేని పక్షంలో రామ మందిర నిర్మాణంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్న మాటల యుద్ధాన్ని పార్టీ విధానంగా భావించాల్సి వస్తుందని వీహెచ్‌పీ అభిప్రాయ పడింది.
గతకొద్ది రోజులుగా.. హిందువుల విశ్వాసాలను గాయ పరచడంలో టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీతో పోటీ పడుతోందని.. రామ కార్యానికి అడ్డుపడాలని చూస్తే ప్రజలు క్షమించరని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో రామ నామస్మరణతో మార్మోగిపోతుంటే కుహానా లౌకిక వాదులకు నిద్ర పట్టడం లేదన్నారు. ఇకపై శ్రీ రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు కార్యకలాపాలపై ఎవరైనా అనవసరంగా నోరు జారితే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని విశ్వ హిందూ పరిషత్ హెచ్చిరించింది.