వేదాల్లో ఎన్నెన్నో సైన్సు రహస్యాలు కనిపిస్తాయి అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ … సర్ సంఘ చాలక్ డాక్టర్ మోహన్ జీ భాగవత్ అన్నారు. వేదాలను సమకారంగా అధ్యయనం చేస్తే ఎన్నెన్నో సృష్టి రహస్యాలు తెలుస్తాయని ఆయన వివరించారు. అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో శ్రీపాద్ దామోదర్ సత్వలేకర్ రచించిన వేదాల హిందీ వ్యాఖ్యానం మూడో ఎడిషన్ ను మోహన్ భాగవత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేదాలు సనాతన ధర్మానికి ఆధారమని, వేదాలలోనే విజ్ఞానం, సైన్స్, గణితం, మతం, వైద్యం మరియు సంగీతం కూడా పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. వేద మంత్రాలలో కూడా అంకగణితం, క్యూబ్, క్యూబ్ రూట్ సూత్రాల మూలాలు స్పష్టంగా గోచరిస్తాయన్నారు.
వేదముల ప్రాధాన్యతను డాక్టర్ మోహన్ జి ఉదాహరణలతో వివరించారు.
వేదాలలో సమస్త లోక కల్యాణం దాగి వుందన్నారు. సమస్త మానవాళికి ఏకత్వ మార్గాన్ని చూపుతాయని, సనాతన సంస్కృతిలో జీవితం అనేది పోటీతత్వం కాదని, ఈ తత్వాన్ని వేదాలు ప్రబోధించాయని అన్నారు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ’ అని ఈ దృక్పథంతోనే వేదాలు వచ్చాయని తెలిపారు. అయితే… వేద మూలాన్ని సైన్స్ అంగీకరించదని, కానీ.. భౌతికవాదానికి మించిన ఆనందం వేదాల్లో వుందని, మొత్తం మానవాళి వేదాల అధ్యయనం ద్వారా జ్ఞానోదయం పొందుతూనే వుందని స్పష్టం చేశారు.
వేదంలో చెప్పబడిన విషయాలను నిజ జీవితంలో అనుసరిస్తేనే వాటికి అర్థముంటుందన్నారు. అయితే.. అందులో వున్న అర్థాన్ని వివరించి చెప్పాల్సిన అవసరం వుందని అభిప్రాయపడ్డారు. సంఘటన అన్న అంశం కూడా వేదాల్లో వుందని, దానికి సంబంధించిన సూత్రాలు కూడా అందులో వున్నాయని వెల్లడించారు. అయితే వేదాల విషయంలో చర్చోపచర్చలకు వెళ్లకూడదని, అలా వెళ్తే వచ్చే లాభమేమీ వుండదన్నారు. ఎవరైతే వేదాలను విశ్వసిస్తారో వాటిని అధ్యయనం చేసి, నిజ జీవితంలో ఆచరించాలని మోహన్ భాగవత్ సూచించారు.
వేదములను నిజజీవితంలో ప్రేరణగా తీసుకోవాలని ఆయన వివరించారు.