ఈరోజు గురుపూర్ణిమ, వ్యాసపూర్ణిమ, ఆషాఢ పౌర్ణమి రోజున భారతదేశమంతా గురుపూర్ణిమ కార్యక్రమాన్ని నిర్వహించుకొంటుంది. ఈ యుగానికి అవసరమైన విజ్ఙాన సర్వస్వము అందించినవాడు వ్యాసుడు. ఎవరీ వ్యాసుడు? ద్వాపరయుగ అంతంలో పరాశర మహర్షి, సత్యవతికి పుట్టిన వాడు వ్యాసుడు, పుట్టిన వెంటనే తపస్సు కోసం వెళ్ళిపోయిన తపోపురుషుడు , అటువంటి వ్యాసుడు ఏం చేశాడు, ఎందుకు వ్యాసుడు పేరుతో గురుపూజా కార్యక్రమాలు హిందూ సమాజం నిర్వహించుకుంటూ ఉన్నది? ఈ విషయాలను సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వ్యాసుడు ద్వాపర యుగ అంతంలో కలియుగం ప్రారంభం లో ఉన్నాడు. వ్యాసుడి కాలం వరకు వేదములు అనేటువంటి మొత్తం ఒకటేనా, లేక మూడా అనే చర్చ జరుగుతోంది, ఆ చర్చకు ముగింపు పలికి వ్యాసుడు వేదాలను నాలుగు గా వర్గీకరించాడు, 1) ఋగ్వేదము 2) యజుర్వేదము 3) సామవేదము 4) అధర్వణవేదము . వ్యాసుడి కాలం వరకు లభించిన ఉపనిషత్తులను కూడా వర్గీకరించి నాలుగు వేదాలకు సమన్వయం చేసిన వాడు. అప్పటినుండి వేదములు చతుర్వేదములు గా మనం చెప్పుకుంటున్నాం. అంతేకాకుండా ఈ సృష్టి ప్రారంభంనుండి జరిగిన చరిత్రను అష్టాదశ పురాణాల రూపంలోమనకు అందించిన వాడు. పురా అంటే ప్రాచీనం అని అర్ధం అంటే ప్రాచీనమైన వాటిని తెలిపేది పురాణం. యుగయుగాల చరిత్ర అంటే ఈ భూమి పుట్టినప్పుడు నుండి ఉన్న చరిత్రను మనకు అందించాడు అంటే మన చరిత్ర ను అనుసంధానం చేశాడు అని చెప్పవచ్చు అంతేకాక తను ఉన్న కాలాన్ని మహాభారతం గా ఇతిహాసాన్ని రచించాడు. ఇతిహాసం అంటే” ఇతి –హా–సం”ఈ విధంగా జరిగింది అని దాని భావము.ఈ విధంగా కలియుగానికి అవసరమైన విజ్ఞాన సర్వస్వం మొత్తం అందించినవాడు వేదవ్యాసుడు. వ్యాసుడు అందించిన విషయాలకు మనం వ్యాఖ్యానాలు చేసుకుంటూ అందులోని ధర్మసూక్ష్మాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము . వ్యాసుడు ఇంతే చేశాడా ఇంకా ఏమైనా చేశాడా? అని మనం ఆలోచిస్తే ధర్మ సంరక్షణ కోసం అతను చెయ్యవలసిన పనులన్నీ కూడా చేసుకుంటూ వచ్చాడు. వాటిలో కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
ధర్మరాజు రాజసూయ యాగం పూర్తయిన తర్వాత వేదవ్యాసుడు తో సంభాషణ చేశాడు, ఆ సమయంలో ధర్మరాజు వ్యాసుని ఒక ప్రశ్న అడిగారు శిశుపాల వధ సమయంలో అనేక ఉత్పాతాలు కనపడ్డాయి ఆ ఉత్పాతాల సందేశం ఏంటి అని అడిగాడు, దానికి వ్యాసుడు చిరునవ్వుతో ధర్మరాజా రాబోవు 13 సంవత్సరాలు నీవు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. 13 సంవత్సరాల తర్వాత భీషణ సంగ్రామం జరగబోయే సూచనలు కనపడుతున్నాయి , దాంట్లో క్షత్రియులు అందరూ సర్వనాశనంజరిగే సూచనలు కనబడుతున్నాయి, కాబట్టి నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అక్కడి నుండి నిష్క్రమించాడు. మరో సంఘటన పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఒకరోజు వేదవ్యాసుడు పాండవుల దగ్గరకు వెళ్ళాడు, పాండవులు వేదవ్యాసుని పూజించిన తర్వాత ధర్మరాజును వెంట పెట్టుకుని మాట్లాడుతూ వెళ్తున్నారు, ఆ సమయంలో ధర్మరాజు యొక్క మనోభావాలను గమనించిన వ్యాసుడు ధర్మరాజుతో అంటాడు రాబోవు రోజుల్లో ఒకవేళ సంగ్రామమే సంభవిస్తే రెండు పక్షాల శక్తి సామర్ధ్యాల గురించి నువ్వు ఆందోళన చెందుతున్నావు అందుకే మీరు ఇక్కడ అ కాలక్షేపం కాదు చేయాల్సింది ధర్మ సంరక్షణ కోసం అవసరమైతే యుద్ధం చేసేందుకు కావాల్సిన సర్వశక్తులూ సంపాదించాలి, అందుకోసం నీవు నన్ను అడుగు, అడిగితే నీకు నేను ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను, నీవు ఆ మంత్రాన్ని అనుష్టించి దానిని అర్జునుడికి ఉపదేశించు, అర్జునుడిఅమంత్రం సాధనచేసి పరమశివుని మెప్పించి పాశుపతాస్త్రం సంపాదించమని చెప్పు , అని చెప్పి ధర్మరాజుకు ప్రతి స్మృతి మంత్రోపదేశం చేశాడు. అట్లా పాండవుల్ని ధర్మరక్షణకు సంసిద్ధం చేసేందుకు ప్రయత్నించాడు, అట్లాగే యుద్ధంలో అభిమన్యుడు మరణించినప్పుడు వేదవ్యాసుడు కురుక్షేత్రంలో ధర్మరాజు దగ్గరకు వెళ్ళి ఓదార్చి చనిపోయిన వాళ్ల గురించి బాధపడకూడదు, అభిమన్యుడు సామాన్యుడు కాదు ఎంతో గొప్ప తపఃసంపన్నులు ఎటువంటి ఉత్తమ గతులను పొందుతారో అటువంటి ఉత్తమ గతులుఅభిమన్యుడు పొందాడు. కొద్దిరోజుల్లో యుద్ధం పూర్తి కాబోతున్నది, నీవు విజయం సాధించిన పోతున్నావు ఇప్పుడు ధైర్యంగా జరగవలసినదానిగురించి ఆలోచించ మని చెప్పి వెళ్ళిపోయాడు. కురుక్షేత్ర సంగ్రామం పూర్తి అయిన తర్వాత ధర్మరాజ చింతా గ్రస్తుడు అయ్యాడు , నా కారణంగా అనేకమంది మహావీరులు యుద్ధంలో మరణించారు ఇదంతా నేను చేసిన పాపము అని భావించాడు, ఆ సమయంలో వేదవ్యాసుడు ధర్మరాజుకి ధైర్యం చెబుతూ ఒక మాట చెప్పాడు ఈ ప్రపంచంలో పాపం చేయని వారు ఎవరు ఉండరు ఆ పాపాలను పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి ఎట్లా పాపాలను పోగొట్టుకోవాలి?: దానికి మానవులు యాగాలు, దానాలు, తపస్సు , మొదలైన వాటి ద్వారా పోగొట్టుకోవాలి అని ధైర్యం చెప్పాడు. ఇట్లా వేదవ్యాసుడు ద్వాపర యుగం అంతంలో ధర్మ సంరక్షణ కోసం చరిత్ర అనుసంధానం కోసం విశేష ప్రయత్నం చేసినవాడు. అందుకే హిందూ సమాజం వ్యాసుని గురువుగా భావించి మనము పూజిస్తూ ఉంటాము, మనం కూడా ధర్మ సంరక్షణకు మన బాధ్యత మనం నిర్వర్తించాలని సంకల్పం చేసుకోవాలి , అదే వ్యాసపూర్ణిమ మనకు ఇచ్చే సందేశం.