జైలర్ కోపంతో నీ గుండెలో నేతాజీ ఉన్నట్లయితే నీ గుండెల్లో నుండి పెకిలించి తీసి బందిస్తానంటూ కోపంతో ఊగిపోతూ మరో వైపు చూస్తూ వెంటనే వచ్చి ఈమె గుండెలను చీల్చేయండి రండి అంటూ ఆజ్ఞాపించాడు…. పనివాడు ఇనుప ఆయుధాలు తీసుకువచ్చి ఆమె వక్షస్థలాన్ని కోయడం ప్రారంభం చేశాడు…. రక్తం చివ్వున చిమ్ముతూ ఉండగా ఆ తల్లి విలవిలలాడి పోయింది వాళ్లేమో రాక్షసంగా నవ్వుకుంటున్నారు…
(ఈ సంఘటన అండమాన్ నికోబార్ దీవుల లోని కాలాపాని జైలులో జరిగింది.)
ఆజాద్ హింద్ ఫౌజ్ లోని ఝాన్సీ లక్ష్మీబాయి మహిళా రెజిమెంట్ లో శిక్షకురాలు, ఆంగ్లేయులచే అండమాన్ కాలాపాని జైలు శిక్ష విధించబడిన వీరనారి “నీరాఆర్య”.
తనను కట్టుకున్నవాడే ఆంగ్లేయుల పంచన చేరి దేశద్రోహిగా మారి సమరయోధులను హత్య చేయడాన్ని కళ్ళారా చూసి అతడు ఇక భూమిపై ఉండకూడదని నిర్ణయం తీసుకొని పొడిచి చంపి నేతాజీని మరియు అనేక మంది దేశభక్తులను రక్షించిన వీరాంగణ, చివరి దశలో అజ్ఞాతంగానే మన హైదరాబాద్ ఫలక్‌నుమా ప్రాంతంలో ఉంటూ ఉస్మానియా ఆస్పత్రిలోనే అంతిమ శ్వాస విడిచారు.
భారతదేశ చరిత్రలో మొదటి గూఢచారిణి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ మహిళా విభాగం అయిన ఝాన్సీ లక్ష్మీబాయి రెజిమెంట్ లో కీలక బాధ్యతలు నిర్వహించిన “నీరా ఆర్య” 1902 మార్చి 5 న ఇప్పటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం “భాగ్ పత్ జిల్లా”లోని ‘ఖేకడా’ అనే నగరంలో జన్మించారు.
తండ్రి “శేట్ చజ్ మల్” అప్పటికే దేశంలో గొప్ప పేరున్న వ్యాపారవేత్త, నీరా ఐదవ ఏట తండ్రి వ్యాపార ముఖ్య కేంద్రమైన కలకత్తాకు వలస వెళ్ళాడు.
నీరాఆర్య విద్యాభ్యాసం మొత్తం కలకత్తాలోనే పూర్తయింది, తాను తండ్రితో కలిసి పలు ప్రాంతాల్లో వ్యాపార నిమిత్తం వెళ్లడం వలన తనకు పలు భాషలపై మంచి పట్టు ఉండేది.
తన కూతురు మొదటి నుండి చదువు, ఆటపాటలలో మేటియై,దేశభక్తితో స్వతంత్ర్య భావాలను కలిగి ఉండడం మరియు బ్రిటిష్ వారిని పారద్రోలే ఆలోచనలను కలిగి ఉండడాన్ని కూడా గమనించారు.
యుక్త వయసు రాగానే నాటి బ్రిటిష్ ఇండియా సిఐడి పోలీసు ఇన్స్పెక్టర్ అయిన “శ్రీకాంత్ జొయరంజన్ దాస్” తో వివాహం జరిపించాడు తండ్రి.
తన భర్త బ్రిటిష్ వారి కోసం, తను నేతాజీ నేతృత్వాన దేశంకోసం పనిచేస్తూ కూడా పరస్పర విరుద్ధ భావాలతో ఉన్నప్పటికీ అతడిలో మార్పు తీసుకువచ్చి దేశభక్తుడిగా మార్చాలని ప్రయత్నం చేస్తూనే కలిసి చాలాకాలం జీవనం కొనసాగించారు.
బ్రిటిష్ ప్రభుత్వం నీరాఆర్య భర్తను నేతాజీ కదలికలను గుర్తించడం వీలైతే వెంటనే హతమార్చే పనిలో నియమిస్తారు. ఒక సందర్భంలో నీరాఆర్య భర్త నేతాజీనీ తుపాకీతో కాల్చగ గురి తప్పి డ్రైవర్‌కు గాయం అవుతుంది, ఈ క్రమంలో నేతాజీని కాపాడటానికి తన వెంటే ఉన్న కత్తితో భర్తను పొడిచి వేసింది దానితో జోయారంజన్ దాస్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
ఆ తర్వాత నీరాఆర్య నాగిని అనే మారుపేరుతో స్వాతంత్రోద్యమ కార్యకలాపాలను నిర్వహించింది. నీరాఆర్య తమ్ముడు బసంత్ కుమార్ కూడా ఆజాద్ హింద్ ఫౌజ్ లో పని చేసేవాడు. మహిళల కోసం ఏర్పాటు చేసిన ఝాన్సీ లక్ష్మీబాయి రెజిమెంట్ కెప్టెన్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో మహిళా సైనికులకు శిక్షణ ఇచ్చే వారు. నూతన సైనికులను సమకూర్చేవారు.
భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రవాస ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న సుభాష్ చంద్రబోస్ సింగపూర్ కేంద్రంగా సైనికులను సమకూర్చుకుని ఆంగ్లేయులను పారద్రోలుటకై భారత్ వైపు బయలు దేరి, చారిత్రాత్మకమైన ‘ఛలో ఢిల్లీ ‘ నినాదం ఇచ్చి ఈశాన్య భారతాన్ని స్వాధీనం చేసుకుని ప్రజలందరూ స్వాగతాలు పలుకుతుండగా ఢిల్లీ వైపు సాగే క్రమంలో వాతావరణం అనుకూలించక పోవడం, వర్షాలు వరదలు తుఫాను తాకిడికి సైన్యం చెల్లాచెదురై పోయారు. మరోవైపు సహాయం కోసం విదేశాలకు వెళ్లిన నేతాజీ అదృశ్యమైపోయారు.
ఆతర్వాత అజాద్ హిందు ఫౌజు సైన్యం లొంగిపోయింది. ఎర్రకోటలో విచారించి అజాద్ హింద్ ఫౌజ్ సైనికులందరికి వివిధ శిక్షలు వేయగా నీరాఆర్య ను మాత్రం ఖైదు చేసి అండమాన్ “కాలాపాని” జైలుశిక్ష విధిస్తారు.
జైలులో ఆమెపై ప్రతిరోజు అతి కిరాతకంగా శారీరకంగా మానసికంగా అనేక చిత్రహింసలకు గురిచేసేవారు.
తను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత స్థానిక ఉర్దూ కవయిత్రి “ఫర్హనా తాజ్” తో తన జీవితంలో ముఖ్యంగా జైలు జీవితంలో జరిగిన ఘటనలను పంచుకోగా, ఆమె వాటిని తన రచనల్లో పొందుపరిచింది.
ఆమె చెప్పిన ప్రకారం.
అండమాన్ కాలాపాని జైల్ లో ఉండగా ఒక రోజు ఒక జైలు ఉద్యోగి వచ్చి రమ్మని వెంట తీసుకు వెళ్ళాడు అప్పటికే నేను బలమైన బరువైన ఇనుప గొలుసులతో కాళ్లను మరియు చేతులను కలిపి బంధించిన ఆ గొలుసులతోనే బరువుగా నడుస్తూ నడుస్తూ అతని వెంట వెళ్ళాను. జైలర్ పక్క గదిలో వరకు తీసుకెళ్లిన అతను ఒక పెద్ద సుత్తి మరియు గొలుసులను తొలగించడానికి మరొక పరికరాన్ని తీసుకొచ్చాడు. ఇనుప సంకెళ్ళను తొలగిస్తున్నానంటూ ప్రారంభించిన వాడు నా చర్మాన్ని కూడా కోసివేస్తున్నాడు. బాధను తట్టుకోలేక పోతున్నాను మరోవైపు సంకెళ్ళు తీసి వేస్తున్నారని మనసులో కొంత ఉపశమనంగా ఉన్నప్పటికీ చేతిని కత్తిరిస్తున్న బాధ భరించలేకపోతున్నాను…
ఇది ఇలా ఉండగా కాళ్లకు సంబంధించిన సంకెళ్లను తొలగిస్తున్నా నంటూ చూసి చూసి ఇనుప సుత్తితో నా కాలి వేళ్లపై రక్తం వచ్చేటట్లు కొడుతున్నాడు, భరించలేని బాధతో ఇలా ఎందుకు కొడుతున్నావ్ అని గట్టిగా అరిచాను., దానితో వాడు కొడతాను ఎక్కడైనా కొడతాను నీ వక్షస్థలంపై కూడా కొడతాను అని మూర్ఖంగా జవాబు ఇస్తే., ఆ జైలులో ఒక బానిసగా ఉన్న నేను వాళ్లేం చేసినా చూడాల్సిందే భరించాల్సిందే, కానీ నేను నాఆత్మాభిమానాన్ని చంపుకోలేక వ్యతిరేకించాను మహిళలపై ఇలాంటి మాటలు ఇలాంటి చేతలు మంచిది కాదని ఇటువంటి పనులు మూర్ఖులు మాత్రమే చేస్తారని అన్నాను, ఇంకా ఏమీ చేయలేక వాడిపై ఉమ్మేసాను దీనితో వాడు అరవడం ప్రారంభం చేశాడు ఈ అరుపులు విని జైలర్ అక్కడికి చేరుకున్నాడు.
ఇన్ని బాధలెందుకు పడతావు బ్రిటిష్ రాణి ఎలిజబెత్ శరణు కోరుకో నిన్ను వదిలి వేస్తామని బెదిరింపు లాంటి బుజ్జగింపుగా ఒక మాట అన్నాడు. నేను శరణు వేడితే జగజ్జనని కాళిక మాతనే శరణు వేడుతాను తప్ప, ఇతర దేశాలను ఆక్రమించుకుని దోచుకుంటున్న దోపిడీ దొంగలను శరణువేడను అని నిర్ద్వందంగా చెప్పాను, దానితో వాళ్ళు మరింత రెచ్చిపోయారు.
ఒకవైపు కాలి నుండి స్రవిస్తున్న రక్తం మరొకవైపు చేతి నుండి స్రవిస్తున్న రక్తం… బాధతో విలవిల లాడి పోతున్నాను.
ఇంతలోనే జైలర్ నేతాజీ ఎక్కడున్నాడో చెబితే నిన్ను వదిలి పెడతాం అని అన్నాడు…, అప్పటికే విమాన ప్రమాదంలో నేతాజీ అసువులుబాసినట్లుగా ప్రకటన వెలువడింది దాన్నే అతని గుర్తు చేశాను. విమాన ప్రమాదంలో మృతి చెందిన సుభాష్ బాబు గురించి నీకు ఎంత తెలుసో జైల్లో ఉన్న నాకూ అంతే తెలుసు అని అన్నాను. కానీ అతడు మరింత రెట్టించిన గొంతుతో లేదు సుభాష్ చంద్ర బోస్ ఎక్కడో ఉన్నాడు అది నీకు తెలుసు ఎక్కడున్నాడో చెప్పు అంటూ గద్దించసాగాడు..,
వాడి అరుపులను మౌనంగా భరించి వింటున్నాను కొంతసేపటికి..
చివరకు హాఁ.., ఉన్నాడు నేతాజీ ఉన్నాడు అని అన్నాను వెంటనే ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అంటూ నా వైపు వస్తుండగా నేతాజీ నా గుండెల్లో ఉన్నాడు అని బదులిచ్చాను.
అంతే ఆ సమాధానం విన్న జైలర్ కోపంతో నీ గుండెలో నేతాజీ ఉన్నట్లయితే నీ గుండెల్లో నుండి పెకిలించి తీసి బందిస్తానంటూ కోపంతో ఊగిపోతూ మరో వైపు చూస్తూ వెంటనే వచ్చి ఈమె గుండెలను చీల్చేయండి రండి అంటూ ఆజ్ఞాపించాడు. పనివాడు ఇనుప చిమ్టి లాంటి పరికరాన్ని తీసుకువచ్చి నా శరీరం పైన ఉన్న చీరకొంగును లాగేశాడు, జాకెట్ ను తొలగించాడు వక్షస్థలంపై ఆయుధాన్నుంచి నా కుడి రొమ్మును ఇనుప పరికరంతో తొలగించాలని కోసివేయడం ప్రారంభం చేశాడు భయంకరమైన నొప్పితో విలవిలలాడి పోయాను. రక్తసిక్తమైన దేహంతో శరీరం అంతా కంపించి పోతుండగా ఎక్కడున్నాడో చెప్పు నీ గురువు నీవు దైవంగా నమ్మే నేతాజీ అంటూ అరుస్తూనే ఉన్నాడు నా మెదడు మొద్దుబారిపోతున్నది ఆ తర్వాత ఎప్పుడు స్పృహ లోకి వచ్చి లేచానో నాకే తెలియదంటూ చెప్పారు.
ఇంతటి క్రూర చిత్రహింసలను తట్టుకొని కూడా ఆమె ఏనాడు నేతాజీ గురించిన విషయాలను బ్రిటిష్ వారికి చెప్పలేదు.
నీరాఆర్య జన్మించిన భాగ్ పత్ జిల్లాకు చెందిన సాహితీవేత్త తేజ్ పాల్ సింగ్ దామా రచించిన నీరా జీవిత చరిత్ర అయినా “ఫస్ట్ లేడీస్ స్పై” అనే పుస్తకాన్ని ప్రచురించారు. దీని ఆధారంగా చైనా సినీ నిర్మాత “జాంగ్ హ్యుయిహూ అంగ్ గ్రేసి” త్వరలో సినిమా తీయబోతున్నారని సమాచారం.
భారతదేశ స్వాతంత్ర్యానంతరం కూడా అజ్ఞాతంగానే ఉంటూ భారత యూనియన్ లో విలీనం కాకుండా ఉన్న హైదరాబాద్ స్టేట్ లోని ప్రజల దుఃఖాన్ని కష్టాలను విని ఇక్కడి సమాచారం తన అనుయాయుల ద్వారా భారత యూనియన్ కు చేరవేయడం కోసం హైదరాబాద్ చేరుకున్నట్లు, వివిధ స్థలాలలో గుడిసె వేసుకొని సామాన్య జీవితం గడుపుతూ ఇక్కడి స్థితిగతులను రహస్యాలను చేర వేసినట్లుగా సమాచారం.
హైదరాబాద్ ఫలక్ నుమా ప్రాంతంలో గుడిసెలోనే నివసిస్తూ రోడ్డు పక్కన పూలు అమ్ముకుంటూ జీవనం కొనసాగించిన ఆత్మాభిమానం గల దేశ భక్తురాలు. అప్పుడప్పుడు చుట్టుపక్కల పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఏవేవో చదువుకునే లేదా ఆడుకునే వస్తువులను తెచ్చి ఇచ్చేవారని, “బాగా చదువుకోవాలని ఈ దేశానికి పేరు తేవాలని చెబుతుండేవారనీ” పూలమ్మే వృద్ధమాత ఇలా పిల్లలపై ఖర్చు చేస్తుండడం విచిత్రంగా ఉండేదని. ఆ నోటా ఈ నోటా వినవస్తుండేది.
సంపన్న కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులు చదివి, అన్ని రంగాలలో ఆరితేరి స్వాతంత్రాన్ని సాధించిపెట్టిన ఆజాద్ హింద్ ఫౌజ్ లో ట్రైనర్ అయి ఉండి కూడా తన జీవిత చరమాంకంలో ప్రభుత్వం నుండే కాదు ఎవరి ద్వారా కూడా ఎలాంటి సహకారాన్ని కోరుకోని స్వాభిమానం ఆమెది.
స్వాతంత్ర్య కోసం తన భర్తనే బలి ఇచ్చింది, తన సర్వసంపదలను వదిలిపెట్టింది, బంధుగణం ఎదుటన ఈ పనులు చేయడం అవమానంగా భావించక తన సోదరుడితో సహా స్వాతంత్ర్య సమరంలో దూకింది, తనకోసం తన పిల్లలకోసం తన ఇంటికోసం అంటూ ఆలోచించలేదు.., దేశం కోసం ఇవ్వడమే కాని తీసుకోవడం తెలియని మహాతల్లి తన సర్వస్వాన్ని ధారపోసింది. ఎప్పుడెప్పుడు ఏమేమి ఇవ్వాల్సి వచ్చినా అన్నింటినీ త్యాగం చేసింది , ఇంకా చేయడానికి సిద్ధపడింది భారతదేశ వైభవానికి పునాది రాయిగా ఉండిపోవాలని కోరుకున్నది ఆ తల్లి.
ఒకానొక సందర్భంలో ఆమె వేసుకున్న గుడిసె ప్రభుత్వ భూమిలో ఉందని ఆ గుడిసెను కూడా అప్పటి ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ మున్సిపాలిటీ వారు కూల్చి వేశారు.
చివరికి 26 జూలై 1998 న 96 ఏళ్ళ వయసులో అనారోగ్యంతో ఒక నిరుపేదగా, అసహాయురాలిగా, నిరాశ్రితగా, అనారోగ్య వృద్దమహిళగా చార్మినార్ దగ్గర్లో గల ఉస్మానియా ఆస్పత్రిలో చేరి మరణించింది.
ఆమె మరణించిన విషయాన్ని తెలుసుకొని స్థానిక ఒక పత్రికా విలేఖరి తన మిత్రుల సహాయంతో అంతిమ సంస్కారాలు జరిపించారు.
మహనీయులైన “నీరా ఆర్య” గారికి మనం ఏమివ్వగలం…, అశ్రునయనాలతో అమ్మను గుర్తు చేసుకోవడం, ముకులించిన హస్తాలతో నివాళులర్పించడం తప్ప.
~ గత జూలై ఇరవై ఆరవ తేదీన హిందీ ప్రాంతానికి చెందిన మిత్రులు ఎవరో గుర్తుచేస్తూ ఫేస్బుక్లో పోస్ట్ చేసిన దాన్ని చూసి వివరాలు తెలుసుకోవాలని అఖిల భారత అధికారి రాస్ బిహారీజితో మాట్లాడగా వారు మరిన్ని వివరాలు చెబుతూ ఉంటే ఆశ్చర్యచకితుడనై పోయాను నీరాఆర్య గారి జీవిత చరమాంకం హైదరాబాదులోనే గడిచిపోయిందని అక్కడే మృతి చెందింది అని చెప్పగానే నేను మరింత ఉద్విగ్నతకు లోనయ్యాను. ఈ విషయం గురించి చాలామందిని సంప్రదించాను…. వారి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది .
ఇది వ్రాస్తున్నంతసేపు మనసంతా మనసంతా దుఃఖ భారంతో గందరగోళంగా ఉంది కళ్ళలో కన్నీళ్ళు సుడులు తిరుగుతున్నాయి నాలుక తడారిపోతున్నది.
~ ఆకారపు కేశవరాజు.